అంత‌రాత్మ‌కు మించిన ప్ర‌జ‌లెవ‌రు బాబు?

"అమ‌రావ‌తి నిర్మాణంలో నేను త‌ప్పు చేశాన‌ని ఐదుకోట్ల మంది తెలుగు ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డితే క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి సిద్ధం" అని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తిపై టీడీపీ నిర్వ‌హించిన అఖిల‌ప‌క్షం స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఈ మాట‌ల‌న్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ‌నాభా ఐదు కోట్లు అని, వారంతా చంద్ర‌బాబు త‌ప్పు చేశాడ‌ని చెబితే ఆయ‌న క్ష‌మాప‌ణ చెబుతాడ‌ట‌. ఇదెక్క‌డైనా జ‌రిగే ప‌నేనా? ఇలాంటివేవీ జ‌ర‌గ‌వ‌నే ఉద్దేశంతో చంద్ర‌బాబు గొప్ప‌లు పోతున్నాడు. ఆరునెల‌ల క్రిత‌మై సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. చంద్ర‌బాబు ఐదేళ్ల ప‌రిపాల‌న‌పై స్ప‌ష్ట‌మైన తీర్పు చెప్పారు. అయ్యా చంద్ర‌బాబు మీరు చేసింది చాలు...ఇక ప‌దండి అని ఇంటికి సాగ‌నంపారు.

చంద్ర‌బాబు బ‌డాయిగా చెబుతున్న రాజ‌ధాని ప్రాంత‌మైన తుళ్లూరు, మంగ‌ళ‌గిరిలో టీడీపీ ఓట‌మిపాలైన విష‌యాన్ని ఆయ‌న సౌక‌ర్య‌వంతంగా మ‌రిచిపోయిన‌ట్టున్నాడు. మంగ‌ళ‌గిరిలో స్వ‌యాన ఆయ‌న కుమారుడు లోకేశ్ ఓడిపోవ‌డం దేనికి సంకేతం?  సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేవ‌లం టీడీపీకి 23 అసెంబ్లీ, 3 పార్ల‌మెంట్ స్థానాల‌కే ప‌రిమితం చేయ‌డం ప్ర‌జాతీర్పు కాక మ‌రేంటి? జగ‌న్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్న వైసీపీకి ఏకంగా 151 అసెంబ్లీ, 22 పార్ల‌మెంట్ స్థానాలు క‌ట్ట‌బెట్ట‌డం ప్ర‌జాతీర్పు కాదా?

ఆరునెల‌ల క్రితం ఇచ్చిన ప్ర‌జాతీర్పు కాకుండా మ‌రెలాంటి ప్ర‌జాభిప్రాయాన్ని చంద్ర‌బాబు కోరుకుంటున్నాడో అర్థం కావ‌డం లేదు. పోనీ ఇవేవీ కాద‌నుకున్నా...ప్ర‌తి ఒక్క‌రికీ అంత‌రాత్మ అంటూ ఒక‌టి ఉంటుంది క‌దా! క‌నీసం ఆయ‌న త‌న అంత‌రాత్మ‌ను అడిగైనా ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెబితే బాగుంటుంది. విభ‌జ‌న స‌మ‌యంలో నాటి కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించిన శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ సూచ‌న‌లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా, త‌న పార్టీ వ్యాపార‌వేత్త‌లైన నారాయ‌ణ‌, సుజ‌నాచౌద‌రి, గ‌ల్లా జ‌య‌దేవ్‌, బీద సోద‌రుడితో క‌మిటీ వేసి రాజ‌ధానిని ప్ర‌క‌టించిన విష‌యం జ‌గ‌మెరిగిన స‌త్యం.

వాస్త‌వాలను విస్మ‌రించి ప్ర‌చారం కోసం మాట్లాడ‌డం త‌న‌కెలాంటి ప్ర‌యోజ‌నాలు తెచ్చి పెడుతుందో చంద్ర‌బాబే ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే అంత‌రాత్మ‌కు మించిన ప్ర‌జ‌లెవ‌రూ ఉండ‌రు కాబ‌ట్టి.

Show comments