సినిమా రివ్యూ: అంతరిక్షం

రివ్యూ: అంతరిక్షం
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.
తారాగణం: వరుణ్‌ తేజ్‌, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, శ్రీనివాస్‌ అవసరాల, సత్యదేవ్‌, రాజా, రహమాన్‌ తదితరులు
కథ, కథనం: సంకల్ప్‌, కిట్టు విస్సాప్రగడ
సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి
కళ: రామకృష్ణ, మోనిక
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.
సమర్పణ: క్రిష్‌
నిర్మాతలు: వై. రాజీవ్‌ రెడ్డి, జె. సాయిబాబు
దర్శకత్వం: సంకల్ప్‌
విడుదల తేదీ: డిసెంబర్‌ 21, 2018

రొటీన్‌కి భిన్నంగా ఆలోచించడం, పాథ్‌ బ్రేకింగ్‌ సినిమా చేయడం లేదా తక్కువ మంది నడిచిన దారి ఎంచుకోవడం, మన పరిమితులని మించి ప్రయత్నం చేయడం... 'అంతరిక్షం'తో సంకల్ప్‌ అద్భుతాలు చేసుండకపోవచ్చు కానీ పైన చెప్పిన లక్షణాలతో తన ప్రత్యేకతని మాత్రం చాటుకున్నాడు. అండర్‌ వాటర్‌ సబ్‌మెరీన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఘాజీతో పరిచయమైన సంకల్ప్‌ రెండవ సినిమాకి కూడా మిగతా వాళ్లలా రొటీన్‌ గ్రౌండ్‌ ఎంచుకోలేదు. తనకంటూ ఓన్‌ 'స్పేస్‌' క్రియేట్‌ చేసుకునేలా ఆలోచించాడు. ఇలాంటి ప్రయత్నాలకి భారీ బడ్జెట్‌ లేదా వందల కొద్దీ వర్కింగ్‌ డేస్‌ అవసరమనే అపోహని తొలగించాడు.

తక్కువ రోజుల్లో, పరిమిత వనరులతో 'మెచ్చుకోతగ్గ' అవుట్‌పుట్‌ అయితే అందించాడు. ప్రయత్నం వరకు అంతరిక్షమంత గొప్పదనిపించినా, ఆచరణలో మాత్రం 'నేల విడిచి సాము' మెప్పించలేదు. ఇండియన్‌ స్పేస్‌ ఆర్గనైజేషన్‌ ఎలా పని చేస్తుంది, అక్కడ వుండే రెగ్యులారిటీస్‌ ఏమిటి, వ్యోమగాముల ఆలోచనా సరళి, వారికి ఎదురయ్యే సవాళ్లు, వారు ఉపయోగించే భాష, టెర్మినాలజీ వగైరా అంతటిపై క్షుణ్ణమైన అధ్యయనం చేసారు. అయితే బేసిక్‌ రీసెర్చ్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌, స్పేస్‌ సీన్స్‌ తాలూకు ఎగ్జిక్యూషన్‌లో షైన్‌ అయిన సంకల్ప్‌ కథని నడిపించే తీరులో మాత్రం అవసరానికి మించిన సినిమాటిక్‌ లిబర్టీ తీసేసుకున్నాడు.

స్పేస్‌ ఆర్గనైజేషన్‌ మొత్తం ఒక్క వ్యక్తిపై ఆధారపడి నడుస్తున్నట్టు, ఒక వ్యక్తి దగ్గర మినహా కీలకమైన ఇన్‌ఫర్మేషన్‌ మరెక్కడా రికార్డ్‌ కానట్టు చూపించడం అంత పెద్ద సంస్థని అవమానించడమే! మూడు వందల కిలోమీటర్ల అంతరిక్ష యానానికి వెళ్లిన వాళ్లు అప్పటికప్పుడు మనసు మార్చుకుని మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణించడం, గ్రౌండ్‌పై వున్న అథారిటీస్‌ని కాదని అంతరిక్షంలోంచి కమాండ్‌ చేయడం... సినిమాటిక్‌ లిబర్టీని కూడా కొన్ని వేల కిలోమీటర్లు ఎక్కువ దూరం తీసుకుపోవడంతో సమానం. ఇకపోతే సోకాల్డ్‌ ఏ మిషన్‌లో కూడా ఉత్కంఠతకి తావు లేదు.

స్పేస్‌ క్రాఫ్ట్‌ నుంచి బయటకి వెళ్లి వుండగలిగే టైమ్‌ కేవలం కొన్ని నిమిషాలే కావడం వల్ల ఎక్కువ టెన్షన్‌ బిల్డ్‌ చేయడానికి స్కోప్‌ దక్కలేదు. పైగా ఆ మిషన్‌ కూడా కేవలం ఏవో డివైస్‌లు మార్చడం లేదా డాటా ట్రాన్స్‌ఫర్‌ చేయడం లాంటివే కావడం వల్ల థ్రిల్లింగ్‌గా అనిపించలేదు. దానికి తోడు దర్శకుడు స్పేస్‌లో రియాలిటీకి దగ్గరగా తీయడానికి బదులు కమర్షియల్‌ 'స్పేస్‌'కి  ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇవ్వడం వల్ల డ్రామాకి కూడా ఆస్కారం లేదు. తెలుగు సినిమా కమర్షియల్‌ సూత్రాలకి భిన్నంగా ఏదో సర్‌ప్రైజ్‌ ఇస్తున్నాడని అనిపించేలోగానే కమర్షియల్‌ మైలేజ్‌ కోసం కాంప్రమైజ్‌ అయిపోయి నిరాశ కలిగిస్తాడు.

ఎంత సినిమాటిక్‌ లిబర్టీస్‌ తీసుకున్నప్పటికీ క్లయిమాక్స్‌లో థ్రిల్‌కి, అదే సమయంలో మెలోడ్రామాకీ స్కోప్‌ ఇచ్చినట్టయితే ఈ చిత్రం ఫైనల్‌ అవుట్‌పుట్‌ మరోలా వుండేది. కథ మొదలవడమే తాపీ ధోరణిలో సగటు ఇంగ్లీష్‌ స్పేస్‌ సినిమాల మాదిరిగా మొదలవుతుంది. ఏదో కారణం మీద వృత్తిని విడిచి దూరంగా వుంటోన్న కథానాయకుడి అవసరం సడన్‌గా పడడం, అతను గతం మరచిపోయి కర్తవ్య సాధన కోసం ముందుకి కదలడం లాంటివన్నీ ఇలాంటి సినిమాల్లో కామన్‌ సీన్లు. ఆ హీరో తాలూకు సదరు గతం ఏమంత ఎఫెక్టివ్‌గా అనిపించదు.

అసలు సినిమా అంతరిక్షంలోకి వెళ్లాకే మొదలవుతుంది. అయితే అక్కడ థ్రిల్స్‌ కంటే పేట్రియాటిక్‌ స్పీచ్‌లతో కూడిన డ్రామా ఎక్కువ చోటు చేసుకుంటుంది. ప్రయోగాలకి వెరవని వరుణ్‌ తేజ్‌ నిబద్ధతతో కూడిన అభినయంతో తన పాత్రకి న్యాయం చేసాడు. మిగిలిన నటీనటులందరూ కూడా తమ వంతుగా చేయగలిగింది చేసారు. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నత ప్రమాణాలనే పాటించింది. ప్రొడక్షన్‌ డిజైన్‌ చాలా బాగుంది. స్పేస్‌ సెంటర్‌ సెట్స్‌, స్పేస్‌ క్రాఫ్ట్‌ ఇన్‌సైడ్‌ వ్యూ వగైరా అన్నీ చక్కగా కుదిరాయి. ఇరుకైన ప్రదేశాల్లోను కెమెరా పనితీరు ఆకట్టుకుంటుంది. అన్నిటికీ మించి ప్రశాంత్‌ విహారి నేపథ్య సంగీతం అబ్బురపరుస్తుంది. ఒక్కోసారి సీన్‌లో కనిపించని డ్రామాని, ఉత్కంఠని తన సంగీతంలోనే వినిపిస్తుంది.

ఘాజీతో తనపై అంచనాలని పెంచిన సంకల్ప్‌ అంతరిక్షం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సంకల్పించాడంటే ఒక రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ వుంటాయి. కానీ అతనో బేసిక్‌ స్పేస్‌ సినిమాని మాత్రమే అందించాడు. అయితే ఈ మాత్రం ధైర్యం చేసి, ఈ స్థాయిలో కొత్తదనం చూపించే దర్శకులకి కొరత వుండడం వల్ల ఈ ప్రయత్నం కూడా మార్కులు కొట్టేస్తుంది. కాసింత కథనంపై దృష్టి పెట్టినట్టయితే సంకల్ప్‌ ఇదే సినిమాతో అద్భుతాలు చేసి వుండేవాడు. కథ, కథనాలతో నిట్టూర్పులు విడిపించినా, ప్రయత్నానికి మాత్రం చప్పట్లు కొట్టించుకుంటాడు.

బాటమ్‌ లైన్‌: అంతంతమాత్రం!
- గణేష్‌ రావూరి

భేకార్ మాటల్.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని డ్యాన్స్ ఏస్తామా 

 

Show comments