‘ఆంధ్రోళ్ల ఓటు’ తేడా కొడుతుందా?

తెలంగాణ రాష్ట్రంలోని చాలా సెగ్మెంట్లలో, ప్రత్యేకించి రాజధాని హైదరాబాదు నగర పరిధిలో సీమాంధ్ర ప్రాంతం నుంచి తరలివచ్చి సెటిలర్లుగా ఉన్న ‘ఆంధ్రోళ్ల ఓట్లు’ జయాపజయాలను నిర్దేశించేంత గణనీయంగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. 2014 ఎన్నికల్లో ఇలాంటి ‘ఆంధ్రోళ్ల ఓటు’ కేసీఆర్ ను తెరాస పార్టీని ద్వేషించింది. వాటిలో చాలావరకు తెలుగుదేశానికి పడ్డాయి. ఆ రకంగా తెలుగుదేశం కొన్ని సీట్లు గెలుచుకుంది. ఆ తదనంతర పరిణామాల్లో గెలిచిన వారంతా కూడా తెరాసలోకే చేరిపోయారు.

అయితే తర్వాత కొన్నాళ్లకు జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. నగరంలో పరిమిత బలం కలిగిఉన్న తెరాస అంతగా ప్రభావం చూపిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. పైగా ‘ఆంధ్రా ఓటు’ పడుతుందనే నమ్మకం కూడా అప్పటికి లేదు.

అదివరలో ఆంధ్రోళ్లను నానా రకాలుగా తూలనాడుతూ తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టిన కేసీఆర్.. తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత... ఆ తిట్లన్నీ ఉత్తుత్తివే అని చెప్పి వారి ప్రేమను పొందే ప్రయత్నం చేశారు. ఆ రకంగా ఆంధ్రోళ్లు ఆదరించారో లేదో తెలియదు గానీ.. ఆంద్రోళ్ల ఓటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు అనుకూలంగానే పడింది. తెరాస ఘన విజయం సాధించింది.

అయితే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మాత్రం.. జీహెచ్ఎంసీ తరహాలో ఆంధ్రోళ్ల ఓటు మొత్తం.. తెరాసకు అనుకూలంగా పడుతుందనుకోవడం భ్రమ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ విషయంలో వారు రాజీపడ్డారని... ఆ ఎన్నికల్లో తిరస్కరించినా కేసీఆర్ కు ప్రత్యక్షంగా జరిగే నష్టంలేదు గనుక.. తేలిగ్గా తీసుకున్నారని ఒక వాదన ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం.. కేసీఆర్ మీద తమ ఆగ్రహాన్ని చాటుకోవడానికే ప్రయత్నిస్తారనేది వారి అంచనా.

అలాంటి ఊహాగానాలు నిజమైతే... చాలా నియోజకవర్గాల్లో ప్రబలంగా ఉండే ఆంధ్రోళ్ల ఓటు మొత్తం తెరాసకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. అదే జరిగితే.. కేసీఆర్ కలగంటున్నట్లుగా ‘100 సీట్లు’ మార్క్ ను అందుకోవడం దుర్లభం అయిపోతుంది. ఒకవైపు ఆంధ్రా పాలకులు అంటూ ఇప్పటికీ వైషమ్యాలు రెచ్చగొడుతూ... మరోవైపు తెలంగాణలోని ఆంధ్రోళ్లంతా మా బిడ్డలే అని ప్రకటించే కేసీఆర్ పాచిక పారుతుందో లేదో చూడాలి.

RELATED చంద్ర పోటు: నొప్పి తెలిసిందా పవన్‌.?