యూపీలో పార్టీల బ్రాహ్మణ జపం...!

మన  రాజకీయాల్లో కులమే కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కులరహిత సమాజం ఏర్పడాలని, కులాలను పట్టించుకోవద్దని పాలకులు, నాయకులు పైకి ఎంతగా సుద్దులు చెప్పినప్పటికీ కులం పేరెత్తకుండా, కులాల ప్రమేయం లేకుండా ఏ పనీ చేయరు. చేయలేరు. ఉద్యోగాలు, ప్రమోషన్లు, సంక్షేమ పథకాలు, చదువులు, అడ్మిషన్లు...సమస్తం కులాల ఆధారంగానే జరుగుతోంది.  తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్న కొన్ని కులాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాయి. చివరకు మన దేశంలో రాజకీయ నేరగాళ్లు కొందరు కులం పేరు చెప్పుకొని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

తాను ఫలాన కులం వాడిని కాబట్టే అన్యాయం చేస్తున్నారని వాపోయే నాయకులు అనేకమంది ఉన్నారు. ఇక రాజకీయ పార్టీల ఓటు బ్యాంకుల సంగతి తెలిసిందే. వివిధ సామాజిక వర్గాల ఓట్ల కోసం పార్టీలు పాకులాడుతుంటాయి. అన్ని పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్ల కోసం తాపత్రయపడతాయి. ఆ తరువాత ఆయా నియోజకవర్గాల్లో ఏ కులం ఓట్లు లేదా జనాభా ఎక్కువుంటే ఆ కులం అభ్యర్థులను రంగంలోకి దించుతారు. నియోజకవర్గాల్లో ఏ కులానికి ఎంత మేరకు ఓట్లున్నాయో లెక్కలు తీసి ఆ ప్రకారమే టిక్కెట్లు ఇస్తారు. కులం, మతం, డబ్బు ...ఇవి మాత్రమే మన రాజకీయాలను ఏలుతున్నాయి. 

సాధారణంగా రాజకీయ పార్టీలు సమాజంలో అట్టడుగు ఉన్న  కులాలకు అలాగే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న ఉన్నత కులాలకు (అగ్రవర్ణాలకు) ప్రాధాన్యం ఇస్తాయి. రాజకీయంగా, ఆర్థికంగా బలంగా లేని, ఓట్ల శాతం తక్కువగా ఉండే సామాజిక వర్గాలను పట్టించుకోవు. ఇలాంటి సామాజిక వర్గాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రధానమైంది. ఇతర రాష్ట్రాలను అలా ఉంచితే, తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోవు. ఈ వర్గం పేరుకు అగ్రవర్ణమైనా 'పైన పటారం లోన లొటారం' టైపు. 

రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలహీనం. ఎంత అన్యాయం జరుగుతున్నా ఎదిరించలేని వర్గం.  ప్రభుత్వం నుంచి నయాపైసా సహాయం పొందలేని వర్గం. దీనికి తగ్గట్లు  ఐక్యత లేని సామాజికవర్గం కూడా. సమస్యలపై పోరాడే, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే శక్తి పూర్తిగా శూన్యం. ఈ వర్గానికి తెలుగు రాష్ట్రాల్లో  పెద్దగా ప్రాధాన్యం లేదు. కాని ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బ్రాహ్మణ సామాజికవర్గం బలమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న యూపీలో ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. ఆ వ్యూహాల్లో భాగంగా బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు ఎలా కొల్లగొట్టలా? అని కసరత్తు చేస్తున్నాయి. 

ఏవో ఒకటి రెండు నియోజకవర్గాల్లో కాకుండా రాష్ట్రం మొత్తం మీద బ్రాహ్మణ సామాజికవర్గం రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయించేవిధంగా ఉంది. బ్రాహ్మణులను ఆకర్షించడానికే కాంగ్రెసు పార్టీ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కొంతకాలంగా కాంగ్రెసులో ఈమె పేరు ప్రకటించడంపై తర్జభర్జన జరుగుతోంది. మొదట్లో ఆమె విముఖత వ్యక్తం చేసినప్పటికీ చివరకు ఆమెను ఒప్పించిన నాయకత్వం ఆమె పేరు అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీకి పదిహేనేళ్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ ఒకప్పటి కాంగ్రెసు దిగ్గజం ఉమాశంకర్‌ దీక్షిత్‌ కోడలు. సమర్థ ముఖ్యమంత్రిగా షీలా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఎంపికకు ఇదో కారణమైతే సామాజికవర్గం మరో కారణం. 

యూపీలో కాంగ్రెసు వ్యూహకర్త  అయిన ప్రశాంత్‌ కిషోర్‌  కాంగ్రెసు ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే  బ్రాహ్మణులకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలని అధిష్టానానికి సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెసు కంటే ముందే బీజేపీ కసరత్తు ప్రారంభించింది. కొంతకాలం కిందట కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్లు వినిపించాయి. ఇక దళితుల పార్టీగా పేరుపడిన బహుజన సమాజ్‌ పార్టీ, ముస్లింల పక్షపాతిగా పేరు తెచ్చుకున్న అధికార సమాజ్‌వాదీ పార్టీ కూడా బ్రాహ్మణ ఓట్ల కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. 

బీఎస్పీ స్థాపించిన తొలి రోజుల్లో బ్రాహ్మణులను  చెప్పులతో కొట్టాలంటూ అనరాని మాటలన్న పార్టీ అధినేత మాయావతి క్రమంగా ఆ సామాజిక వర్గం ప్రాధాన్యం తెలుసుకొని దళిత పార్టీ అనే ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేశారు. 2007లో 89 మంది బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇచ్చిన మాయావతి, 2012లో 74 మందికి ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం టిక్కెట్లలో ఈ వర్గానికి 50 శాతం ఇస్తున్నారు. 

రాష్ట్రంలో ఒకప్పుడు బీజేపీకి  బ్రాహ్మణవర్గం మద్దతు బాగా  ఉండేది. కాని క్రమంగా ఆ వర్గం దూరమైంది. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి  రాష్ట్రస్థాయిలో బలమైన బ్రాహ్మణ నాయకుడు లేడని చెబుతున్నారు. మొత్తం మీద యూపీలో అన్ని పార్టీలు బ్రాహ్మణ జపం చేయడం విశేషం. ఈ వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యం ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు చూపిస్తుందో చూడాలి. 

Show comments