ఆంధ్ర రాజకీయాలు- బీజేపీ దృతరాష్ట్ర కౌగిలి..!

‘‘తెలివైన శత్రువు దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ జిత్తులమారి మిత్రుడు పక్కన ఉంటే వినాశనం తప్పదు’’-  అది రాజగురువు చాణుక్యుడు ఒక సందర్భంలో చంద్రగుప్తుడికి ఉపదేశిస్తాడు. ఈ విజ్ఞత ప్రస్తుత రాజకీయులకు ఉందో లేదో చెప్పలేం కానీ.. ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు మలుపుతిరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే- ముఖ్యమంత్రి జగన్ - ఈ సూత్రాన్ని మర్చిపోయారనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించిన తర్వాత జగన్ అనుసరించే రాజకీయ వ్యూహాన్ని అందరూ జాగ్రత్తగా గమనిస్తున్నారు.

తనపై ఉన్న కేసుల నుంచి బయటపడాలంటే కేంద్రం అండ తప్పనిసరి కాబట్టి.. బీజేపీతో ఘర్షణ వైఖరి అవలంభించరనేది స్పష్టంగానే అందరికీ తెలుసు. ఇక శత్రువుకు శత్రువు మిత్రుడు కాబట్టి కేసీఆర్‌తో బహిరంగ సఖ్యత కూడా జగన్ కు తప్పనిసరే! కానీ ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ ఎలాంటి పాత్ర పోషిస్తుందనే విషయమే రాజకీయ విశ్లేషకులకు ఆసక్తికరమైన అంశం. మొదట మోదీ బాహుబలి కౌగిలిలో చిక్కిన జగన్ - ఆ తర్వాత దాని నుంచి బయటపడతారా.. లేక అదే ఆయన పట్ల దృతరాష్ట్ర కౌగిలిగా మారుతుందా అనే విషయాన్ని గమనించాలి.

బీజేపీ వ్యూహమిది..
‘‘మిత్రుడైనా సరే.. తప్పులు చేయనివ్వాలి. ఆ తప్పుల వల్ల వచ్చే అపప్రద్ధను అంటనివ్వాలి. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు అతనిని అదుపులోకి తీసుకోవాలి. పూర్తిస్థాయిలో ఆక్రమించుకోవాలి..’’ అనే వ్యూహాన్ని బీజేపీ అనేక రాష్ట్రాల్లో అనుసరిస్తూ వచ్చింది. మాయావతి, ములాయంసింగ్‌ నుంచి కుమారస్వామి దాకా అనేక మందిపై విజయవంతంగా ప్రయోగాలు చేసింది. నెమ్మదిగా మారుతున్న పరిస్థితులు చూస్తుంటే జగన్ వంతు అనుకున్న దానికన్నా ముందే వస్తుందా అనే అనుమానం కలుగుతోంది.

తాజా పరిణామాలు చూస్తే- బీజేపీ అమరావతి నిర్మాణం ద్వారా తొలి పావును కదిపినట్లు అర్థమవుతోంది. అమరావతి నిర్మాణంపై వైఎస్సాఆర్‌సీపీకి.. జగన్ కు అనేక అభ్యంతరాలున్నాయనే విషయం అందరికీ తెలుసు. కానీ అమరావతి నిర్మాణమనేది తెలుగు ప్రజలకు అవసరం. లేకపోతే తెలుగు ప్రజలకు రాజధాని లేకుండాపోతుంది. ఎవరు అడ్డుపడినా చరిత్రహీనులు అవుతారు. సాధారణంగా అమరావతి నిర్మాణం లాంటి సంక్లిష్టమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాటిని కొద్దికాలం వాయిదా వేయటం.. ఆ తర్వాత వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవటం పరిణితి చెందిన రాజకీయ నేతలు చేసే పని.

ఉదాహరణకు తెలంగాణా ఉద్యమ సమయంలో- మెట్రోరైలుకు వ్యతిరేకంగా కేసీఆర్‌ అనేక వ్యాఖ్యలు చేశారు. ఒకదశలో మెట్రోరైలు నిర్మాణమే ఆగిపోతుందా అన్నంత గొడవ చేశారు. అధికారంలోకి రాగానే తన వైఖరి మార్చుకున్నారు. మెట్రోరైలు ప్రారంభమయింది. ప్రజలకు కొంత ఇబ్బంది తగ్గింది. మొన్న ఎన్నికల్లో మెట్రోరైలు నిర్మాణం తన ఘనతగానే టీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకుంది. కానీ అమరావతిపై జగన్ తీరు ఆ విధంగా లేదు. మొదట బడ్జెట్‌లో నిర్మాణానికి నిధులు తగ్గించారు. అంతవరకూ బానే ఉంది. కానీ ప్రపంచబ్యాంకు నుంచి వచ్చే రెండువేల కోట్లను కాలదన్నుకోవటం అవివేకమనే చెప్పాలి.

దీనికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణమన్నట్లు విపక్షాలు ప్రచారం మొదలుపెట్టాయి. వాస్తవానికి ప్రపంచబ్యాంకు రుణాన్ని ఆపివేయటానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు. తెలుగు ఆడపడుచు నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలోని కేంద్ర ఆర్థికశాఖ. ఈ విషయాన్ని ప్రపంచబ్యాంకు స్పష్టంగా పేర్కొంది కూడా. కానీ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం వల్ల- జగన్ కావాలని ఈ పనిచేశారనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదనే వాదనతో- బీజేపీ చేతులు దులుపుకుంటుంది.

ప్రజలముందు దోషిగా జగన్ నిలబడాల్సి వస్తుంది. అంతేకాదు. ప్రపంచబ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఒక్కసారి మచ్చపడిన తర్వాత రుణాలు లభించటం అంత సులభంకాదు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా రుణం కావాలని అడిగితే గత చరిత్రను కచ్చితంగా పరిశీలిస్తారు. అప్పుడు ఆ రుణం ఇప్పించమని కేంద్రప్రభుత్వాన్ని బతిమాలవలసి వస్తుంది. బీజేపీకి కావాల్సినది కూడా అదే! నెమ్మనెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవటానికి దీనిని ఒకమార్గం.

స్నేహం ప్రమాదమే!
ఇదంతా చదివిన తర్వాత జగన్, ఆయన అనుచరులు అంత తెలివి తక్కువ వాళ్లా? ఆ మాత్రం దూరదృష్టి లేకుండా వ్యవహరిస్తారా? అనే అనుమానం కొందరికి రావచ్చు. గెలిచిన ఉత్సాహం, మిత్రుల ప్రోద్బలంతో కొన్నిసార్లు తీవ్రమైన తప్పులు జరిగే అవకాశముంది. వాటిని సరిచేసుకోవటం కూడా కష్టం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను చూద్దాం. ప్రజవేదిక నిర్మాణం పర్యావరణ సూత్రాల రీత్యా.. నైతికంగా తప్పుకావచ్చు. కానీ చట్టరీత్యా తప్పుకాదు. సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే అందుబాటులో ఉన్నాయి. దీని నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారులకూ ఈ విషయం తెలుసు.

ప్రభుత్వ నేతలు ఊపులో ఉన్నారు కాబట్టి వారేం మాట్లాడకపోవచ్చు. కానీ ప్రజావేదికను కూల్చిన తర్వాత.. మిగిలిన నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోతే కచ్చితంగా విమర్శలు వస్తాయి. నోటీసులు అందుకున్న వారు కచ్చితంగా కోర్టుకు వెళ్తారు. కూల్చివేతలు ఆగిపోతాయి. చంద్రబాబుపై కావాలని కక్ష సాధిస్తున్నారనే భావన ప్రచారంలోకి వస్తుంది. జగన్ రెడ్డికి బీజేపీ నేతలు పరోక్షంగా అందిస్తున్న సలహాల నేపథ్యమే ఇలాంటి చర్యలకు కారణమని వార్తలు వస్తున్నాయి. ఇదేకనక నిజమైతే జగన్ దృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్నట్లే! అది మొత్తానికే ప్రమాదకరం కావచ్చు. 

-సీత (fbackfm@gmail.com)

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..

Show comments