ఏపీకి మోడీని మళ్లీ పిలవొద్దు!

చిలకలూరిపేట సభ ముగిసిపోయింది. మహాద్భుతంగా జరిగిందని, లక్షల్లో జనం వచ్చేశారని తెలుగుదేశం, జనసేన దళాలు మురిసిపోతూ ఉండవచ్చు గాక. కానీ.. వారి ఆర్భాటం, ఆనందం అంతా పైపైన మాత్రమే. లోలోపల తెలుగుదేశం శ్రేణులంతా తెగ మధనపడిపోతున్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా, ప్రధాని మోడీని సభకు ఆహ్వానించడం ద్వారా, మోడీ వస్తున్నారనే ప్రచారం ద్వారా ఎలాంటి అనుచిత ప్రయోజనాలను ఆశించారో అవేవీ నెరవేరలేదు. మోడీ మాటల తూటాల ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారని అనుకుంటే అలాంటిదేం జరగలేదు. ఈ నేపథ్యంలో.. ఏపీలో మరోసారి ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోడీ రాకుండా ఉంటేనే బాగుంటుందని, మోడీ కాకుండా ఇతర భాజపా నాయకుల్ని ప్రచారానికి పిలుద్దామని చంద్రబాబునాయుడుకు.. ఆయన కీలక వ్యూహకర్తలు, పార్టీలో సీనియర్లు సలహా చెబుతున్నట్టుగా తెలుస్తోంది. 

ప్రధాని మోడీ వేదిక మీద ఉన్నారంటే.. ఆయన నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ రకరకాలుగా ఉంటాయి.  రాష్ట్రానికి ఆయన ఏం వరాలు ప్రకటిస్తారా? అని ప్రజలు ఆశిస్తారు. అదే విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డిని నానా తిట్లూ తిట్టాలని, తమ మనసులోని తిట్లను ఆయన నోటమ్మట పలికించాలని తెలుగుదేశం, జనసేన దళాలు ఆశిస్తాయి. 

కానీ మోడీ చిలకలూరిపేట సభలో అలాంటి మాటలు ఒక్కటి కూడా మాట్లాడలేదు. రాష్ట్రానికి ఆయన ఏ వరాలూ ప్రకటించకపోయినా తమకేం నష్టం లేదు గానీ.. జగన్ ను ప్రత్యేకంగా తిట్టకపోవడం వల్ల చాలా డేమేజీ జరుగుతుందని తెలుగుదేశం వర్గాలు బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే మళ్లీ ఇంకో సారి ఏపీలో ఎన్నికల సభకు మోడీని పిలిస్తే లాభం కంటె నష్టం ఎక్కువ జరుగుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారుట.

Readmore!

ఈ సభలో మోడీ చాలా లౌక్యంగా మాట్లాడారు. జగన్ ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరం ఉన్నదని ఆయన మాటవరసకు కూడా అనలేదు. మంత్రులందరూ ఒకరిని మించి మరొకరు అవినీతికి పాల్పడుతున్నారని అన్నారే తప్ప.. ఏ ఒక్క పేరుగానీ, ఏ ఒక్క అవినీతి కుంభకోణం గురించి గానీ ప్రస్తావించనేలేదు. ఎన్డీయేకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అనే మాటను రామమంత్రంలాగా పదేపదే చెప్పారు తప్ప.. ప్రభుత్వాన్ని కూల్చడం గురించి తనకు ఎలాంటి పట్టింపు కూడా లేదన్నట్టుగా వ్యవహరించారు. 

మోడీ ఇలాగే మాట్లాడితే.. తెలుగుదేశం కేంద్రంలోని భాజపాను బతిమాలి, బలవంతంగా పొత్తులకు  ఒప్పించుకున్నదని, మోడీ దళంలో జగన్ వ్యతిరేక ఆలోచనే లేదని ప్రజలకు అర్థమైపోతుందని తెలుగుదేశం దళాలు భయపడుతున్నాయి.

అదే సమయంలో మోడీ బదులుగా బిజెపి తరఫున కొందరు కేంద్రమంత్రుల్ని పిలిస్తే తమకు ఎడ్వాంటేజీ ఉంటుందని, తమ స్క్రిప్టును వారి ఎదుట పెట్టి.. వారితో జగన్ ను తిట్టించడం సాధ్యం కావచ్చునని వారు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Show comments