అమిత్ షా : చెప్పేవి శ్రీరంగ నీతులు...

‘చెప్పేవన్నీ రంగనీతులు చేసేవన్నీ తప్పుడు పనులు’ అని తెలుగులో ఒక సామెత ఉంది. ఇప్పుడు భాజపా నాయకులు చేసేవి చూస్తోంటే అలాగే ఉంది మరి. ఓవైపు ‘అన్నీ రాష్ట్రాలకు కలిపి ఒకేసారి జమిలీ ఎన్నికలు పెడితే కొన్ని వేలకోట్లు ఆదా అవుతాయ’ని భాజపా నాయకులు జమిలీ ఎన్నికల కోరుతుంటే... మరోవైపు ‘ఎంపీగా పోటీ చేయాలనే ఆశతో ఉన్న వారంతా జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైతేనే ఎంపీ టికెట్టు ఇస్తామ’న్నారు భాజపా నాయకుడు అమిత్ షా.

పొదుపు మాటలు చెప్పి నీతులు వల్లించడం తద్వారా... తామేదో దేశాన్ని ఉద్ధరించేయడానికి కంకణం కట్టుకున్న మహాపురుషులం అన్నట్లుగా బిల్డప్ ఇవ్వడం మోడీ అండ్ కోకు కొత్తేమీకాదు. కానీ వ్యవహారంలో మాత్రం చాలాతేడాగా వ్యవహరిస్తుంటారు. ఓవైపు జమిలి ఎన్నికలు పెడితే డబ్బులు మిగులుతాయంటూనే.. మరోవైపు డబ్బులు దుబారా అయ్యే ఇలాంటి కుయత్నాలకు వారు ఒడిగడుతుండడం గమనించాల్సిన సంగతి. ఇలాంటి వ్యయం నిర్ణయాలు తీసుకోవడం భాజపాకు కొత్తేంకాదు. కొంతకాలం ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇలాంటి పనే ఒకటి చేశారు.

ఎప్పట్నుంచో ఎంపీలుగా ఉన్నవారిని మళ్లీ ఎమ్మెల్యేలుగా నిలబెట్టారు. వాళ్లు ఓడిపోతే అంత పోయేదేంలేదు కానీ... గెలవడం వల్ల అనివార్యంగా ఉపఎన్నికల పరిస్థితి ఏర్పడింది. ఓవైపు ఎంపీ పదవిలో ఉంటూనే ఎమ్మెల్యే పదవికి పోటీచేసి గెలిచిన వారంతా ఉన్న పదవికి రాజీనామా చేశారు. అందువలన బై ఎలెక్షన్ అవసరమొచ్చింది. ఆ రకంగా అదనపు ఖర్చులకు భాజపా వ్యూహం కారణమైంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తప్పు చేస్తున్నారు.

తెలంగాణలో భాజపా కనీసం ప్రస్తుతం ఉన్న స్థానాలనైనా నిలుపుకోగలుగుతుందా? లేదా? అనేది ఒకవైపు సాగుతున్న చర్చ. ఇక్కడి ముఖ్యనాయకులు మాత్రం.. అసెంబ్లీ ధ్యాస వదిలేసి.. తమకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ టికెట్లు కావాలని కోరుతున్నారు. ఎంపీగా నెగ్గితే.. కేంద్రంలో తమ ప్రభుత్వం మళ్లీ వస్తుంది గనుక.. వైభవం వెలగబెట్టవచ్చునని వారికోరిక. అయితే రేపు ఎంపీ టికెట్టు కోరుకుంటున్నవారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే అంటున్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.

ఓడితే.. ఎమ్మెల్యేగా గెలవలేని వాడికి ఎంపీ టికెట్ ఎందుకు అంటూ తిరస్కరిస్తారు. గెలిస్తే వారితో రాజీనామా చేయించి.. మళ్లీ ఉప ఎన్నికల భారం మోపుతారు! ప్రజల ముందు బిల్డప్ కోసం ఎన్నికల దుబారా వ్యయం తగ్గించి ప్రభుత్వ డబ్బులు పొదుపు చేయాలనుకుంటున్నాం అంటూనే ఇలాంటి యత్నాలతో బై ఎలెక్షన్ పరిస్ధితులకు భాజపా నేతలు పరోక్షంగా కారకులు అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

RELATED చంద్ర పోటు: నొప్పి తెలిసిందా పవన్‌.?