ఆశ కాంగ్రెస్ ను బలి తీసుకుంటుందా?

ఎన్నికల సీజన్ రాగానే దాదాపుగా ప్రతి పార్టీ కూడా తాము తప్పకుండా గెలుస్తాం అనే నమ్మకాన్ని ముందుగా మనసులో పెంచుకుంటుంది. ఆ నమ్మకమే ప్రతి పార్టీని కూడా ఎన్నికల సమరంలో ముందుకు నడిపిస్తుంటుంది. పోటీ ఎలాంటిదైనా సరే.. ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు. కానీ, ప్రతి ఒక్కరూ మేం గెలుస్తాం.. అనే నమ్మకాన్ని కలిగి ఉండడమే ఇక్కడ ఎన్నికల రంగంలోని తమాషా. తాము ఎటూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, అంత బలం తమకు లేదని చాలా కొన్ని పార్టీలు మాత్రమే క్లారిటీ కలిగి ఉంటాయి.

ఇక ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అనుకునే పార్టీలు దానికి తగినట్లుగా ఆశలను పెంచుకుంటూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణాన్ని గమనిస్తే.. అలాంటి అతి బలమైన ఆశే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరణశాసనం రాయబోతున్నదా అనే అనుమానం కలుగుతోంది. నిజానికి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రసమితి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వంగా.. ప్రజలు అంతో ఇంతో మెచ్చుకోదగిన పరిపాలన అందించిందనే అభిప్రాయాలే పలువురిలో ఉన్నాయి.

ఈ పాజిటివ్ టాక్ రాకముందే.. మరోసారి అధికారం హస్తగతం చేసుకోవడానికే తెరాస ముందస్తు ఎన్నికలకు కూడా సిద్ధపడింది. తెరాస పాలనలోనూ లోపాలు లేకపోలేదు. అయితే ఆయా లోపాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి, ప్రజల్లో చైతన్యం కలిగించి.. ప్రజల్లో తమ పట్ల అనుకూలతను పెంచుకోవడానికి ఇక్కడి ఇతర రాజకీయ పార్టీలు చేసిన ప్రయత్నాలు చాలా తక్కువ. కాంగ్రెస్ ఏదో కాస్త హడావిడి చేసింది గానీ.. క్రియాశీల పోరాటాలు తక్కువే.

అయితే.. ఎన్నికలు రాగానే.. ప్రభుత్వం మీద ఉండగల వ్యతిరేకత తమకే లాభిస్తుందని... ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అధికారంలోకి వచ్చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది. ఈ కలలే కాంగ్రెస్ కొంప ముంచుతున్నాయ్. అధికారం తథ్యం అనే అతి విశ్వాసం కారణంగా.. వారికి తమ మహా కూటమిలో జట్టుకట్టిన పార్టీలకు తగినన్ని సీట్లు ఇవ్వాలంటే బుద్ధి పుట్టడంలేదు. దాంతో కూటమి ముందడుగు వేయడంలో ప్రతిష్టంభన ఏర్పడుతోంది.

తెదేపా, తెజస, సీపీఐలకు అర్హమైనన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ మోకాలడ్డుతోంది. రేపో మాపో తెజస కూటమినుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ రకంగా చూసినప్పుడు.. అధికారం మీద కాంగ్రెస్ లో పుడుతున్న ఆశే.. ప్రస్తుతం ఆ పార్టీని బలితీసుకునే ప్రమాదం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఎలాంటి సిద్ధాంత సారూప్యత లేకుండానే జట్టుకట్టిన ఈ నాలుగు పార్టీలు.. కాంగ్రెస్ అహంకారం కారణంగా.. అచ్చంగా కుప్పకూలిపోయి.. అధికారంలో ఉన్న తెరాసకు గెలుపుమార్గం సుగమం చేస్తాయనే అభిప్రాయం కూడా వినవస్తోంది.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments