చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ ఆరాటం

తన స్నేహితుడు చంద్రబాబు కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెగ ఆరాటపడుతున్నారని సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

కరోనా ఉందంటూ ఎన్నికల్ని వాయిదావేసిన కమిషనర్.. ఓవైపు కరోనా కేసులు ఉన్నప్పటికీ తాజాగా ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం అడగడం విడ్డూరంగా ఉందన్నారు.

"ఎన్నికల కమిషనర్ చట్టబద్దంగా వ్యవహరించాలి. టీడీపీ జేబు సంస్థగా మారకూడదు. రాజకీయ కుట్రల్లో కమిషనర్ భాగస్వామ్యం కాకూడదు. అలా జరిగితే ప్రజాస్వామ్యం నిలబడదు. కరోనా ఉందని చెప్పి స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వేసింది ఆయనే. 

ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరిపిద్దామా వద్దా అని అభిప్రాయం అడుగుతున్నది కూడా ఆయనే. రాష్ట్రంలో కరోనా కేసులు ఎలా ఉన్నాయో, కరోనా పూర్తిగా తగ్గిందా లేదా అనేది ఎన్నికల కమిషనర్ కు తెలియదా?"

ఎన్నికలకు భయపడి వైసీపీ విముఖత వ్యక్తం చేస్తోందనే విమర్శల్ని తిప్పికొట్టారు అంబటి. అసలు పార్టీలో ఎవ్వరికీ అలాంటి భయం లేదని, ఇదంతా అచ్చెన్నాయుడు లాంటి నాయకులు సృష్టిస్తున్న ప్రచారమని అన్నారు. కేవలం కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఎన్నికలపై మాట్లాడుతున్నామని అన్నారు.

"ఎన్నికలకు భయపడే ప్రశ్న లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేమే గెలుస్తాం. ఈ 18 నెలల జగన్ పాలన చూసిన తర్వాత ఓడిపోతామని ఎవరైనా అనుకుంటారా? కాకపోతే ఈ కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు అవసరమా అనేది మా భయం.

కరోనా సెకెండ్ వేవ్ ఉంటుందని స్వయంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నాకు కూడా కరోనా వచ్చింది. మళ్లీ వచ్చే ప్రమాదముందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలందర్లో ఈ భయం ఉంది. ఇప్పుడెందుకనేది మా ప్రశ్న."

ఓవైపు కరోనా ఉన్నప్పటికీ కేవలం అల్లరిచేయాలనే విషపూరిత ఆలోచనతో నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి, ఎన్నికల కమిషనర్ కు ఉన్న సంబంధం ఏంటో ప్రజలందరికీ తెలుసంటున్నారు అంబటి. గతంలో రమేష్ రాసిన లేఖ, టీడీపీ ఆఫీస్ నుంచే లీకైందనే విషయాన్ని గుర్తుచేశారు.

Show comments