ఘన విజయం సరే...కులం ఏమిటి?

కుక్క తోకను ఎంత సాగదీసినా, బద్ద వేసి కట్టినా ఆ తరువాత వదిలేస్తే మళ్లీ వంకరగానే ఉంటుంది. భారతీయులు కూడా అంతే. వీరిలో మన తెలుగోళ్లు కూడా ఉన్నారనే సంగతి మర్చిపోవద్దు. ఇంతకూ కుక్క తోకకు, మనోళ్లకు సంబంధం ఏమిటి? ఏమీ లేదు. కుక్క తోక ఎలా ఎప్పటికీ వంకరగా ఉంటుందో మనోళ్ల బుద్ధులు, ఆలోచనలు కూడా వంకరగానే ఉంటాయని చెప్పడమే ఉద్దేశం. భారతదేశం చంద్రయానం చేసినా 'కులయానం' (కుల ప్రయాణం) మాత్రం ఆగడంలేదు. 

ఓ పక్క తెలుగుతేజం పీవీ సింధు ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకొని దేశం మొతాన్ని ఆనందంలో ముంచెత్తగా, అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికమంది సింధు కులం ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో గూగుల్‌పై దాడి చేశారు. అంటే అన్వేషించారన్నమాట. సింధు విజయవార్త తెలియగానే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హర్యానా నుంచి అత్యధికమంది సింధు కులం తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. గూగుల్‌లో అత్యధికంగా అన్వేషించిన ఫ్రేజ్‌ 'పివి సింధు క్యాస్ట్‌' అని సమాచారం. 

నిజంగా ఇది చాలా నీచమైన వ్యవహారం. విచారించాల్సిన విషయం. ఒక భారతీయురాలు విజయం సాధించింది. ఆమె ఇండియన్‌గా మనందరికీ గర్వకారణం. విజయాన్ని విజయంగా చూడాలి. దాన్ని ఆనందించాలి. కాని ఆమె కులం తెలుసుకోవడం అవసరమా? భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో అవసరమే. ఆమె కులం తెలుసుకుంటే ఆమె విజయాన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేయొచ్చు. ఫలానా కులంలో గొప్ప క్రీడాకారిణి జన్మించిందని ఆ కులం వారు ప్రచారం చేసుకోవచ్చు.

ఆమె కులమేదో తెలుసుకుంటే ఆ కులంవారు  (నాయకులు) ప్రభుత్వంతో లాబీయింగ్‌ చేసి ఏవైనా ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేయొచ్చు. ఆమె దళిత మహిళో, అట్టడుగు సామాజిక వర్గానికి చెందినదైతే ఆ కులాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, క్రీడల్లో ప్రోత్సహించడంలేదని ఆందోళనలు చేయొచ్చు. ఇలా ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. సింధు కులం తెలుసుకుంటే ఆ సామాజికవర్గానికి సామాజికంగా, రాజకీయంగా తగిన గౌరవం, గుర్తింపు లభిస్తాయనుకున్నారేమో. 'సింధు మా కులానికి చెందిన అమ్మాయి' అని గర్వంగా చెప్పుకోవచ్చు.

 కారణాలు ఏమైనా కులం కోసం అన్వేషించడం మన సంకుచితత్వాన్ని తెలియచేస్తోంది. ఓ వ్యక్తి ఏ రంగంలోనైనా విజయం సాధిస్తే అతని లేదా ఆమె కులం తెలుసుకోవాలనే ఆసక్తి మనోళ్లకు సహజంగానే ఉంటుంది. ఈ ఆధునిక కాలంలోనూ కుల వ్యవస్థ బలంగా ఉండటమే ఇందుకు కారణం. అందులోనూ కుల ప్రసక్తి లేకుండా మన దేశంలో ఏ పనీ జరగదు. మన దేశంలో కులానికి-రాజకీయాలకు, కులానికి సామాజిక కార్యకలాపాలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. 

సంక్షేమ పథకాలు మొదలుకొని ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడం వరకు, సర్పంచ్‌ ఎన్నిక దగ్గర్నుంచి, ప్రధానిని ఎన్నుకునేవరకు కులం ప్రాతిపదికపైనే జరుగుతోంది. ఇక ఆర్థిక నేరగాళ్లు, హత్యలు చేసినవారు, కుంభకోణాలకు పాల్పడినవారు, ఘరానా మోసగాళ్లు కొందరు తాము పట్టుబడగానే 'నేను ఫలానా వెనకబడిన కులంవాడిని కాబట్టే ఈ విధంగా కేసుల్లో ఇరికిస్తున్నారు' అని ఏడుపు మొహం పెడుతుంటారు. 'నేను ఫలానా కులం వాడిని కాబట్టే ఫలానా అత్యున్నత పదవి దక్కకుండా చేశారు' అని కొందరు నాయకులు ఆరోపిస్తారు. రిజర్వేషన్ల కోసం సాగుతున్న పోరాటాలు చూస్తూనేవున్నాం. 

పాలకులు కొందరు అవినీతిపరులైన నాయకులను రక్షించడానికి కారణం వారి కులం, దాని వెనక ఉన్న ఓటు బ్యాంకు. ఇలా చెప్పుకుంటూపోతే 'కులం కథ' చాలా ఉంది. సరే...రాజకీయ నాయకులకు కులజాడ్యం తప్పదు. అదిప్పట్లో పోయేదీ కాదు. కాని క్రీడాకారులను కూడా కులం దృష్టితో చూడటం, కులాన్ని తెలుసుకొని సంతోషించడమో, ఈసడించడమో చేయడం దుర్మార్గం. సింధు విజయం సాధించింది నిరంతర కృషితోనే తప్ప కుల సంఘాలతో అండతో కాదు. ఒక్క సింధు కులం కోసమే కాకుండా మరో విజేత సాక్షి కులం కోసం గూగుల్లో విపరీతమైన అన్వేషణ సాగింది. 

Show comments