అమరావతి కథ.. ఎందుకింత వ్యధ.!

అమరావతి.. ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవం.. అంటూ రాజధాని అమరావతి పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేసిన పొలిటికల్‌ యాగీ అంతా ఇంతా కాదు. ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామంటూ చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. ఐకానిక్‌ టవర్స్‌ అన్నారు.. ఐకానిక్‌ బ్రిడ్జిలు అన్నారు.. ఇప్పుడైతే అక్కడ ఏవీ కన్పించవు. ప్రధాని నరేంద్రమోడీని తీసుకొచ్చి అమరావతిలో చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో శంకుస్థాపన అయితే చేయించారుగానీ, రాజధాని నిర్మాణ పనులు జరగాల్సిన వేగంతో జరగలేదు.

ఇంతకీ, ఇప్పుడు అమరావతిలో ఏముంది.? అంటే, ఏమీలేదని మాత్రం చెప్పలేం. తాత్కాలిక సచివాలయం వుంది. తాత్కాలిక హైకోర్టు వుంది. ఇంకా మరికొన్ని తాత్కాలిక నిర్మాణాలున్నాయి. ఒకట్రెండు యూనివర్సిటీల్ని తీసుకొచ్చారు. ఇంకేదో హంగామా అక్కడ నిన్న మొన్నటిదాకా జరిగింది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక, అమరావతిలో సీన్‌ మారిపోయిన మాట వాస్తవం. అమరావతి పేరు చెప్పి చంద్రబాబు అండ్‌ టీమ్‌ భారీగా అవినీతికి పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో లోతైన విచారణ దిశగా అడుగులు వేస్తోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌.

సరిగ్గా ఈ టైమ్‌లోనే మంత్రి బొత్స సత్యనారాయణ 'బాంబు' పేల్చారు. కృష్ణానదికి వరదలు రావడాన్ని రాజధానితో లింక్‌ పెట్టిన బొత్స, రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 'ఖర్చు' అంశాన్ని బొత్స ప్రస్తావించడంతో, అమరావతి ఇక అధోగతి అన్న అభిప్రాయాలకు బలం చేకూరింది. అభిప్రాయాలు వేరు, పొలిటికల్‌ రచ్చ వేరు. రాత్రికి రాత్రి అమరావతిని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ మార్చేస్తుందన్నట్లు టీడీపీ నేతలు హంగామా షురూ చేశారు.

'మీరు రాజధాని మార్చేస్తామంటే మేం ఊరుకునేది లేదు.. ఎవర్నడిగి రాజధానిని మార్చాలనుకుంటున్నారు..' అన్నది టీడీపీ నేతల ప్రశ్న. ఔనా.? అలాగా.? మరి, తెలుగుదేశం ప్రభుత్వం ఎవర్ని అడిగి అమరావతిని రాజధానిగా డిసైడ్‌ చేసిందట.? ఈ ప్రశ్న వైసీపీ నుంచి వస్తే, టీడీపీ నేతల నోరు పెగులుతుందా.! ఛాన్సే లేదు. ఒకాయన తిరుపతిలో రాజధాని వుండాలంటాడు. ఇంకొకాయన దోనకొండకు రాజధానిని తరలించే ప్రయత్నం జరుగుతోందంటారు.

ప్రస్తుతానికైతే అధికారికంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా అమరావతిపై చేయలేదు. ప్రభుత్వంలో చర్చ జరగడం సహజం. ఆ చర్చ అవినీతిని వెలికి తీయడానికేనన్నది తాజాగా వైసీపీ నుంచి వస్తున్న వివరణ. కానీ, ఈలోగా వీలైనంతగా వివాదాన్ని రగిలించి, చలికాచుకోవాలన్నది టీడీపీ ఆలోచనగా కన్పిస్తోంది. 

బాహుబలి' ఇంకా కలగానే ఉంది