అల్లుడు అందరికీ నచ్చుతాడు

మారుతి అంటే ఎంటర్ టైన్ మెంట్. ఎంటర్ టైన్ మెంట్ అంటే మారుతి అన్నట్లు పేరు తెచ్చుకున్నారు. భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు సినిమాలో ఫ్యామిలీ ప్లస్ యూత్ ను తనవైపు తిప్పుకున్నారు. ఇప్పుడు అదే మారుతి అందిస్తున్న మరో సినిమా శైలజారెడ్డి అల్లుడు. ఈ సినిమా విడుదల మరో రెండురోజుల్లో. ఈ నేపథ్యంలో మారుతితో మాటా మంతీ.

శైలజారెడ్డి అల్లుడు సినిమా బలం ఏమిటి?
రమ్యకృష్ణ గారు. చైతన్య ఇప్పటికి వరకు చేయని జోనర్.

శైలజారెడ్డి అల్లుడు బలహీనత ఏమిటి?
ప్రిడిక్టబుల్ లైన్. తరువాత ఏమవుతుందో అనిపించే థ్రిల్లర్ కాదు. ఓ అబ్బాయి.. ఓ అమ్మాయి.. వాళ్ల ప్రేమ.. ఆ సరదాలు. అంతలో ఆ ప్రేమకు వచ్చిన సమస్య.

మరి తెలిసీ ప్రిడిక్టబుల్ నెరేషన్ లో ఎందుకు వెళ్లారు
ఫార్మాట్ ప్రిడిక్టబుల్ అన్నాను కానీ, నేరేషన్ అనలేదు. నెరేషన్ కొత్తగానే వుంటుంది. చైతన్య ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఫన్ వుంటుంది.. హుషారు వుంటుంది. రొమాన్స్ వుంటుంది. సరదా వుంటుంది. ఇవన్నీ చైతన్య ఒక సినిమాలో చేయడం ఇదే తొలిసారి అనుకుంటా.

ఇంతకీ మారుతి బలం ఏమిటి?
ఎంటర్ టైన్ మెంట్

బలహీనత?
ఇదీ నా బలహీనత అని చెప్పలేకపోవడమే నా బలహీనత

తెలివిగానే చెప్పారు, సరే, రమ్య మేడమ్ ఈ సినిమాకు ఓకె అనకపోయి వుంటే..?
ఆ సంగతే ఊహించలేను. ఎందుకంటే నేను కథ రాసుకోవడమే ఆమెను దృష్టిలో వుంచుకుని రాసుకున్నా. ఆమె ఓకె అనకపోయి వుంటే ఏమయ్యేదో ఊహించలేను.

వెన్నెల కిషోర్ తో మూడో సినిమా, గోపీసుందర్ తో రెండో సినిమా, ఈ రెండూ కలిసి వచ్చే అంశాలేనా?
వెన్నెలకిషోర్ ఫుల్ ఫామ్ లో వున్నాడు. నా గత రెండు చిత్రాలకు అతను అస్సెట్. ఇప్పుడు ఈ సినిమాలో కూడా. అతనితోపాటు పృధ్వీ కూడా ఫుల్ ఫన్ అందిస్తాడు. ఇక గోపీసుందర్ పనితనం ఏమిటో ఇప్పటికే ఈ సినిమా అడియో చెబుతోంది కదా?

బస్ స్టాప్ తో టాలీవుడ్ లో యూత్ ట్రెండ్ తెచ్చింది మీరు. అలాంటిది యూత్ కు ఫ్యామిలీకి మధ్య ఓ స్పేస్ చూసుకుని సెటిల్ అయిపోయారు.
కారణం వుంది. ఎంత క్రేజ్ సాధించినా ఓన్లీ యూత్ ఎంటర్ టైనర్లు అనేవి మహా అయితే పదికోట్లు చేస్తాయి. మరీ గొప్పగా అంటే పదిహేను కోట్లు చేస్తాయి. బడ్జెట్ తక్కువ కావచ్చు. కానీ వాటి హయ్యర్ లిమిట్ అది. సినిమా ఇరవై కోట్లు దాటాలి అంటే ఫ్యామిలీలు థియేటర్ కు రావాల్సిందే. రప్పించాల్సిందే. అందుకే ఇటు యూత్ కు అటు ఫ్యామిలీకి సెట్ అయ్యే స్పేస్ ను వెదుక్కున్నా. భలే భలే.. మహానుభావుడు, బాబు బంగారం, ఇప్పుడు ఈ సినిమా ఇవన్నీ ఆ పర్టిక్యులర్ జోనర్ సినిమాలే.

ఒక్క సినిమా చేస్తే చాలు.. మహేష్ పిలిచాడు. బన్నీ ఆఫర్ ఇచ్చాడు అని వినిపిస్తుంది. ఎనిమిది సినిమాలు చేసారు. ఏ ఒక్కదానికి నిర్మాత లాస్ కాలేదు. మరి మీకు ఆ ఆఫర్లు రాలేదా?
నిజం చెప్పాలంటే ప్రేమకథాచిత్రమ్ తరువాతే అలాంటి ఆఫర్లు వచ్చాయి. పేర్లు వెల్లడించడం సరికాదు. ఓ సూపర్ స్టార్ చేతుల మీదుగా ఆయన సినిమా సెట్ లోనే అడ్వాన్స్ తీసుకున్నా. మరో టాప్ స్టార్ ఓపెన్ ఆఫర్ వుంది. ఇంకా ఓ పెద్దాయిన స్వంత బ్యానర్ పెడుతున్నపుడే ఆఫర్ ఇచ్చారు.

కానీ నాకు నేనేంటో తెలుసు. నేను చాలా మందిలా రైటింగ్ డిపార్ట్ మెంట్ లో, డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి, భారీ సినిమాలకు అప్రెంటీస్ చేసి రాలేదు. నేరుగా డైరక్షన్ లోకి వచ్చా. అందుకే ఇప్పుడు చేస్తున్న సినిమాలే అప్రెంటీస్ అనుకుంటున్నా. సినిమా మేకింగ్ తెలుసు. పెద్ద సినిమాకు కావాల్సిన కథ కావాలి. అది వచ్చేవరకు ఈ ట్రయినింగ్ సాగుతూనే వుంటుంది.

అంతేనే మిడిల్ రేంజ్ లో వున్న సేఫ్టీ చూసి, టాప్ రేంజ్ లో వున్న రిస్క్ చూసి అక్కడే వుండిపోయారా?
అలా కూడా అనుకోవచ్చు. నేను కింద నుంచి వచ్చాను. అనుభవించిన కష్టాలు మళ్లీ అనుభవించకూడదు అనుకుంటున్నాను. అందుకే జాగ్రత్తగా వుంటాను. జాగ్రత్తగా తీస్తాను. తప్పంటారా? నాకు పెద్ద హీరోలకు సరిపడా కథ, లైన్ దొరికితే కచ్చితంగా సినిమా చేయడానికి హీరోలు రెడీగా వున్నారు. నాదే ఆలస్యం. అది మాత్రం చెప్పగలను.

విజయ్ దేవరకొండతో సినిమా అని వినిపిస్తోంది
మాంచి అగ్రెసివ్, వెర్సటాలివటీ వున్న నటుడితో చేయాలని ఎవరికి వుండదు. ఓ మాంచి లైన్ ఒకటి నా దగ్గర వుంది. అది డెవలప్ చేయాలి. విజయ్ కు వినిపించాలి. అప్పుడు కదా.. ఇంకా దానికి చాలా సమయం వుంది. అయినా విజయ్ ఇప్పుడు చాలా కమిట్ మెంట్ ల మీద వున్నాడు.

అయినా నేను శైలజారెడ్డి అల్లుడు సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకుని స్క్రిప్ట్ లు రెడీ చేసుకోవాలనుకుంటున్నాను. అందువల్ల తరువాత ప్రాజెక్టు మీద ఇప్పుడే ఏమీ చెప్పలేను. అయితే బ్యానర్ మాత్రం గీతా-యువి అన్నది పక్కాగా చెప్పగలను.

యువి, గీతా, సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇక్కడే వుంటాయా? మారుతి సినిమాలు?
అలా అని లేదు. నాకు అక్కడ కంఫర్ట్ గా వుంటుంది. నేనేంటో వాళ్లకి తెలుసు. నాకు ఫుల్ ఫ్రీడమ్ వుంటుంది. అందుకే అలా నడచిపోతోంది.

మారుతికి నమ్మకాలు, ముహుర్తాలు చాలా ఎక్కువంటారు?
మంచి పనికి మంచి చూడడం అన్నది మన సంస్కృతి. అలా అని నాకు చాదస్తాలు ఏమీలేవు. నా మానాన నేను ముందుకు వెళ్తూనే, మన పెద్దవాళ్లు చెప్పినవి గుర్తుపెట్టుకుని ఆచరిస్తాను. వీటి విషయంలో కొందరు లోలోపల దాచుకుంటారు. నేను కాస్త బయటకు వచ్చి వుంటాను. అంతే తేడా. మన సమాజంలో, మన జీవితంలో ఇవన్నీ ఓ భాగం. అంతే.

వినాయకచవితి పండగనాడు హ్యాపీగా శైలజారెడ్డి అల్లుడిని చూసి ఎంజాయ్ చేయచ్చని ప్రేక్షకులకు భరోసా ఇస్తారా?
హండ్రెడ్ పర్సంట్. పండగనాడు హాయిగా నవ్వుకోవచ్చు. అదీ కుటుంబసమేతంగా. దానికి నాదీ పూచీ.

థాంక్యూ... థాంక్యూ

శైలజారెడ్డి అల్లుడు వర్కింగ్ స్టిల్స్ కోసం క్లిక్ చేయండి