ఇకపై ఏది పడితే అది మాట్లాడతామంటే వీల్లేదు

సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలేవారికి అలహాబాద్ హైకోర్టు కాస్త గట్టిగానే గడ్డిపెట్టింది. ఐటీ చట్టం కింద అలాంటివారిపై కేసు పెట్టడం సరైన చర్యేనని తేల్చి చెప్పింది. తనపై పెట్టిన కేసు కొట్టివేయాల్సిందిగా నందిని అనే మహిళ వేసిన పిటిషన్ ని తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడి, చివరకు కాళ్లబేరానికి వస్తే కుదరదని స్పష్టం చేసింది.

అసలేం జరిగింది..?

ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన నందిని సచన్ అనే మహిళ సోషల్ మీడియాలో ఓ వ్యక్తిపై అభ్యంతరకరమైన ఆరోపణలు చేసింది. అతని గురించి తప్పుగా మాట్లాడటమే కాదు, కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలు కూడా అప్ లోడ్ చేసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

నౌడా పట్టణ పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణ ఆపాలంటూ ఆమె అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సదరు వ్యక్తితో పెళ్లికి నిరాకరించినందుకే తనపై ఇలా కేసు పెట్టాడని నందిని ఆరోపించింది.

ఈ పిటిషన్ కొట్టివేసిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని తేల్చి చెప్పింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కామెంట్లు చేయడం, ఇతరులను అగౌరవపరచడం, వారి వ్యక్తిత్వాన్ని కించపరచడం, వారిని ఇబ్బందికి గురిచేయడం సరికాదని చెప్పింది.

భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర్యం అంటే ఇష్టం వచ్చిన భాష మాట్లాడటం కాదని, సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన మాటలకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తమ భావాలను వ్యక్తపరిచేవారు, వాటిపై కాస్త కంట్రోల్ లో ఉండాలని సూచించింది.

ఇతరులను నొప్పించనంత వరకు స్వేచ్ఛ విలువైనదని, పరిధి దాటితే దాని అనంతర పరిణామాలు అనుభవించాల్సి వస్తుందని నందినికి వార్నింగ్ ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు. 

Show comments