ఏపీలో ఈసారి గెలుపెవరిది? నాదే.. నాదే..!

ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది..? ఏ పార్టీ వారినడిగినా ఈసారి ఖాయంగా గెలుపు తమదే అంటున్నారు. అంతటితో ఆగకుండా సర్వేలు, సవాలక్ష కారణాలు చెబుతున్నారు. ఇవిగో పర్సంటేజీలు, ఇదిగో మా ట్రాక్ రికార్డ్ అంటున్నారు, అవతలి వారి బలహీనతలు కూడా ఏకరువు పెడుతున్నారు. మొత్తానికి అధికారం మాదేనంటూ ఏపీలో అన్నిపార్టీలు ధీమాగా ఉన్నాయి. చివరికి గత ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ కూడా.

జనసేన అయితే ఏకంగా 30 శాతానికి పైగా ఓటర్లు తమ జేబులోనే ఉన్నట్టు బిల్డప్ ఇస్తోంది. గతంలో ప్రజారాజ్యం పోటీచేసినప్పుడు 20శాతం ఓట్లు వచ్చాయని, సీమాంధ్రలో చూస్తే ఇది 30శాతంగా ఉందని, అప్పటికంటే ఇప్పుడు జనసేన పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది కాబట్టి, ఊహించని స్థాయిలో తమకు ఓట్లు వస్తాయని అదృష్టం కలిసొస్తే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామనేది జనసైనికుల వాదన.

అధికార పక్షం టీడీపీ లెక్కలు సరే సరి. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఆ వ్యతిరేకతే తమకు బలమని నమ్ముతోంది. హోదా కోసం కేంద్రంలో మంత్రి పదవుల్ని సైతం త్యాగం చేసి, కేసులు పెడుతున్నా ధైర్యంగా పోరాడుతున్న టీడీపీపై ప్రజల్లో సింపతీ ఉందని లెక్కలు వేస్తోంది. ప్రతిపక్ష వైసీపీని గత ఎన్నికల్లో పిల్ల కాంగ్రెస్ అని చెబుతూ దెబ్బతీసిన టీడీపీ ఈసారి పిల్ల బీజేపీ అని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. 

దీనికితోడు కాంగ్రెస్ తో పొత్తు కూడా కలిసొస్తుందని బాబు దూరాలోచన. అందుకే రాహుల్ తో అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా ఇచ్చేస్తామంటూ మందుగానే తాయిలాలు ప్రకటింపజేశారు. ఇవన్నీ భ్రమలేనని తేలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇక ప్రతిపక్షం మరోసారి పూర్తిగా జగన్ ఇమేజ్ నే నమ్ముకున్నట్టు కనిపిస్తున్నా ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి బాగా కలిసొచ్చే అంశం.

బాబు అండ్ టీమ్ అవినీతి, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం, రాజధాని విషయంలో చెప్పిన కల్లబొల్లి మాటలు, పోలవరం పేరుతో ఆడుతున్న డ్రామాలు, ప్రత్యేక హోదాపై టీడీపీ వేసిన కుప్పిగంతులు, చివరకు రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ తో అక్రమ సంబంధం.. ఇవన్నీ టీడీపీ వ్యతిరేక, వైసీపీ అనుకూల ఓట్లకు కారణమవుతాయని జగన్ టీమ్ లెక్కలు వేస్తోంది. 

వీటితో పాటు గతంలో టీడీపీకి ప్లస్ గా మారిన జనసేన, ఈసారి ఆ పార్టీకి పడే ఓట్లను చీల్చి వైసీపీకి ఊహించని బలం చేకూరుస్తుందని అంచనా. ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచీ మడమతిప్పకుండా చేస్తున్న పోరాటం కూడా వైసీపీకి ప్రధాన బలం. దీనికి బోనస్ గా జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఉండనే ఉంది.

చివరిగా కాంగ్రెస్ కూడా ఈసారి అధికారంలోకి రావాలని, సొంతంగా వీలుకాకపోతే టీడీపీ సపోర్ట్ తో అయినా అధికార పక్షంలో కూర్చుంటామనే నమ్మకంలో ఉంది. రాష్ట్రాన్ని విడదీసిన పాపం కడిగేసుకుంటాం, మాకో అవకాశమిస్తే ప్రత్యేకహోదా ఇచ్చేసి పాప ప్రక్షాళన చేసుకుంటామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతోంది.

కాంగ్రెస్ కి అధికారం, ఏపీకి ప్రత్యేకహోదా ఇదే ఉమ్మడి అజెండాపై హస్తం పార్టీ అపార నమ్మకం పెట్టుకుంది. 2014లో కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసిందనే కోపంలో బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేశారని, ఈ దఫా ప్రత్యేకహోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందనే కసి కాంగ్రెస్ అనుకూల ఓటుగా మారుతుందని ఈ పార్టీ నమ్మకం. 

మొత్తమ్మీద ఏపీలో ఎవరి లెక్కలు వారికున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే అందరూ అధికారం మాదేనంటున్నారు, అన్ని పార్టీలూ ఓటర్లు తమవైపే ఉన్నారని లెక్కలు చూపెడుతున్నాయి. సర్వేలు, అంచనాలు ఎన్ని చెబుతున్నప్పటికీ, చివరిగా ఓటరు మనసులో ఏముందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. 

Show comments