బాబును ఓడించడానికి ఉద్యోగులు చాలు

విజన్ 2020, విజన్ 2040 అంటూ ఎప్పుడూ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని అరచేతిలో స్వర్గం చూపించే చంద్రబాబుని కొన్ని పాత జ్ఞాపకాలు బాగా భయపెడుతున్నాయి. అలాంటి చేదు జ్ఞాపకాల్లో ప్రస్తుతం ప్రస్తావించుకోవాల్సింది 2004 ఎన్నికలు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ చేతిలో చావుదెబ్బ తిన్నారు చంద్రబాబు. ఆ టైమ్ లో ఓటుతో బాబుపై వేటు వేసిందీ, తమను వేధించిన పాపానికి బదులు తీర్చుకుందీ ప్రభుత్వ ఉద్యోగులే. ఇప్పుడు మరోసారి ప్రభుత్వ ఉద్యోగులే బాబుని భయపెడుతున్నారు.

అప్పట్లో బాబు నిరంకుశ వైఖరి నచ్చక ఉద్యోగులు ఒక్కసారిగా ఆయనకు ఎదురుతిరిగారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వారు ప్రభావితం చేయగలవారు అందరూ కూడబలుక్కుని టీడీపీని పదేళ్లు పైకి లేవకుండా తొక్కిపడేశారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో చంద్రబాబు కూడా అంగీకరించారు. అప్పుడు చంద్రబాబుకి తన నిరంకుశత్వం శాపంగా మారితే, ఇప్పుడు ఉద్యోగుల్లో టీడీపీపై వ్యతిరేకత పెరడగానికి రకరకాల కారణాలున్నాయి.

టీఏ, డీఏ బకాయిలు సకాలంలో విడుదల చేయకపోవడం, పీఆర్సీ అమలులో తీవ్ర జాప్యం వంటివి వచ్చే ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించబోతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా వేతనాలు, రెగ్యులరైజేషన్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీళ్లంతా మరోసారి బాబును ఇంటికి పంపించడానికి మానసికంగా సన్నద్ధమై ఉన్నారు. ఇప్పటికే బాబుపై కోపంతో రగిలిపోతున్న నిరుద్యోగులు కూడా వీళ్లకు తోడయ్యారు. జాబు పేరుతో బాబు వంచించిన తీరుని నిరుద్యోగులు మరిచిపోలేదు. ఇంకోసారి కల్లబొల్లి హామీలిచ్చినా ఎవరూ నమ్మడానికి సిద్ధంగాలేరు.

అప్పట్లో అసంతృప్త వర్గానికి వైఎస్సార్ అండగా నిలబడితే, ఇప్పుడు బాబు వ్యతిరేక పవనాలకు జగన్ అండగా నిలిచారు. బాబు వల్ల మోసపోయిన బాధిత వర్గాలకు జగన్ ఇస్తున్న భరోసా వరంలా మారింది. అనుభవజ్ఞుడు అని రాష్ట్రాన్ని చేతిలో పెడితే చివరకు అనుభవాన్నంతా రంగరించి అధోగతి పాలు చేశాడని అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అప్పుడు తండ్రి చేతిలో చావు దెబ్బతిన్న చంద్రబాబు, రాబోయే ఎన్నికల్లో వైఎస్ తనయుడు జగన్ చేతిలో పరాభవాన్ని మూటగట్టుకోబోతున్నారు.

Show comments