అక్కడ ఎవరు గెలుస్తారో తెలిసిపోయింది!

రాయలసీమ ప్రాంతంలో నేతలకు తమ తమ విజయావకాశాలు ఏమిటో స్పష్టం అర్థం అయ్యిందనే తెలుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది. అక్కడ ఏం జరిగి ఉంటుందనేది చెప్పడానికి లేకుండా పోతోంది. పోలింగ్‌ సరళిని పరిశీలించి చూసి నేతలు తమ విశ్లేషణలు తాము చేసుకొంటూ ఉన్నారు. అందుకు సంబంధించిన కథ ఇలా ఉంది.. రాయలసీమలో గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఊర్లో ఓట్లు ఎటువైపు పడ్డాయి? అనే అంశం గురించి పూర్తి స్పష్టత వచ్చినట్టుగా ఉంది. గ్రామాల్లో ఎవరు ఏ పార్టీ అనే అంశం తేల్చుకోవడం ఏమంత కష్టంకాదు. ప్రత్యేకించి రాయలసీమలో జనాలు పూర్తిగా ఓపెనప్‌ అయిపోతారు. తాము ఏ పార్టీ అనే అంశం గురించి వారికి వేరే క్లారిటీ ఇచ్చుకుంటారు.

ఇలాంటి నేపథ్యంలో.. ఎక్కడిక్కడ పార్టీల వాళ్లకు కూడా తమకు ఎన్ని ఓట్లు పడ్డాయనే అంశంపై దాదాపుగా స్పష్టత వస్తోంది. ఎన్నికల ఫలితాలు ఎప్పుడో మే ఇరవై మూడో తేదీన రాబోతున్నాయి. అయితే తాము గెలుస్తామా? ఓడతామా? అనే అంశం గురించి అర్థం చేసుకోవడానికి నేతలకు అంత సమయం అక్కర్లేదు. పోలింగ్‌ బూత్‌ల వారీగా నేతలకు ఎక్కడిక్కడ వాస్తవమైన రిపోర్టులే అందుతూ ఉన్నాయి.

గ్రామాల్లో ఈసారి దాదాపుగా తొంభైశాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. ఓటర్లు పోలింగ్‌ స్టేషన్లకు పోటెత్తారు. ఉదయాన్నే క్యూలు కట్టారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి బాగా ఉత్సాహం చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చినట్టుగా ఓటర్లు ఊర్లకు రావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి.

ఊర్లో గ్రూపులు వస్తాయి, ఒకే పార్టీ వాళ్లు విడిపోతారు. ఎవరికి వారు తమవర్గం ఓటు ఒక్కటి కూడా వేరు కాకుండా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తారు. అచ్చం అలాంటి పరిస్థితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల విషయంలో చోటు చేసుకుంది. ఓటు వేయడాన్ని ఓటర్లంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలా పోలైన ఓట్లలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయనే అంశం గురించి ఆ గ్రామంలోని ఇరుపార్టీల కార్యకర్తలకూ క్లారిటీ వచ్చేసింది కూడా.

ఇలా చూసుకుంటే.. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో..  ఆయా నేతలకు స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పటికే. అయితే ఇక్కడో చిన్నమెలిక ఉంది. ఎంత కచ్చితంగా చెప్పగలిగినా ప్రతి పల్లెలోనూ ఐదు నుంచి పది ఓట్ల తేడా ఉంటుంది. అది పెద్ద విషయం కాదు కానీ, ప్రతి నియోకవర్గంలో ఉండే మండల కేంద్రాల్లో మాత్రం పరిస్థితి కాస్త మిస్టరీగా ఉంది. కాస్త చిన్న చిన్న టౌన్లే అయినప్పటికీ... అలాంటి చోట్ల ఓట్లు పడ్డాయో నేతలకు అర్థంకాని విషయంగా మారింది. ఆ విషయంలో కూడా పూర్తి స్పష్టత తెచ్చుకోవడానికి నేతలు తమ కసరత్తును సాగిస్తూ ఉన్నారు!

వార్ వన్ సైడే.. నా? ఎవరి లెక్కలు వారివి!

Show comments