అఖిలప్రియ.. బీజేపీని కోరుతున్నది అదేనా?

తెలుగుదేశం పార్టీలో ఉండటానికి పెద్దగా ఆసక్తిని కనబరచడం లేదనే ప్రచారాన్ని పొందుతూ ఉన్నారు మాజీమంత్రి అఖిలప్రియ. చంద్రబాబు నాయుడును తిట్టీతిట్టీ.. తిరిగి తండ్రితో సహా అదే పార్టీలోకి చేరారు ఆమె. భూమా నాగిరెడ్డి మరణంతో తెలుగుదేశం పార్టీకి కలిగిన డ్యామేజ్‌ను తగ్గించుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆమెకు మంత్రిపదవి కూడా ఇచ్చారు. మంత్రిపదవి దక్కిన తర్వాత సొంత వాళ్లను రాజకీయంగా దూరం చేసుకున్నారు అఖిలప్రియ.

నియోజకవర్గంలో ఆమె తీరును వ్యతిరేకిస్తూ పలువురు నేతలు తెలుగుదేశం పార్టీని వీడారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే విశ్వాసాన్ని ఇచ్చిందేమో కానీ.. అఖిలప్రియ వాళ్లందరినీ దాదాపుగా దూరం పెట్టేశారు కూడా. ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. తమకు తిరుగులేదు అని అనుకున్న నియోజకవర్గంలో అఖిలప్రియ ఓడారు. అయితే ఓటమి అంతా జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభావం అని, జగన్‌ మోహన్‌రెడ్డే వచ్చి తన మీద పోటీచేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితమే ఆళ్లగడ్డలో వచ్చిందని అఖిల వ్యాఖ్యానించారు.

అలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారామె. ఫలితాలు వచ్చిన రోజునే ఆమె అలా మొదలుపెట్టేశారు. ఇంటర్వ్యూల్లో కూడా అదే విషయాన్ని చెప్పారు. ఇక వైఎస్‌ విజయమ్మ ద్వారా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాలని కూడా అఖిలప్రియ ప్రయత్నించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అక్కడ ఆమెకు తలుపులు తెరవలేదు అని టాక్‌. అఖిలప్రియను చేర్చుకోవడానికి జగన్‌ మోహన్‌రెడ్డి కూడా ఆసక్తితో లేరని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేసేదిలేక భారతీయ జనతా పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారట అఖిల. ఇప్పటికే అందుకు సంబంధించి చర్చలు జరిగినట్టుగా టాక్‌ వినిపిస్తోంది.

బీజేపీతో పెద్ద పదవినే అడుగుతున్నారట అఖిల. తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వాలని ఆమె కోరుతున్నట్టుగా సమాచారం! ఎంపీగా తనను నామినేట్‌ చేయాలని, మాజీమంత్రి అయిన తనకు అది తగిన గౌరవం అవుతుందని అఖిల కమలనాథులకు వర్తమానం పంపారట! అయితే ఏకంగా ఆమె అలా పదవిని అడిగే సరికే బీజేపీవాళ్లు కూడా కామ్‌ అయిపోయారని సమాచారం. ఎమ్మెల్యేలుగా కూడా ఓడిపోయిన వాళ్లంతా ఇలా బీజేపీని పెద్ద పెద్ద పదవులు కోరుతుండేసరికి వారు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారని సమాచారం.

అందుకే ఇలాంటి చేరికలు ప్రస్తుతానికి ఆగాయని.. ఓడిపోయిన నేతలను చేర్చుకుంటుండటం వల్లనే బీజేపీ సగం పలుచన అవుతోంది. అవకాశవాద ఫిరాయింపుదారులను చేర్చుకుంటూ బీజేపీ నవ్వుల పాలవుతోంది. దానికితోడు సదరు నేతలు కోరుతున్న కోరికలతో ఆ పార్టీ మరింత అవాక్కవుతోందని సమాచారం!

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది

Show comments