అమరావతిపై అఖిలపక్షం తుస్సుమంది!

మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా మారిస్తే రాష్ట్రం మొత్తం వెనుకకు పరుగులు పెడుతుందన్నట్లుగా.. ప్రపంచానికి చాటిచెప్పడానికి ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కానీ దానిద్వారా ఏం సాధించారు? అసలు ఆ అఖలిపక్షానికి ఎవరు మద్దతిచ్చారు.

ఈ విషయాలను పరిశీలించినప్పుడు.. చంద్రబాబు అఖిలపక్షం తుస్సుమనదని అనిపిస్తుంది. పైగా ఆ సమావేశం అనేది.. ఇప్పుడు అవసరమైన కార్యచరణ గురించి చర్చించకుండా.. చంద్రబాబు స్వోత్కర్షకు, ఆత్మస్తుతికి మాత్రమే పరిమితమైంది.

చంద్రబాబునాయుడు తన అఖిలపక్షానికి వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలను, సంఘాలను ఆహ్వానించినట్లు చెప్పుకున్నారు. భారతీయజనతా పార్టీ ముందే ఛీ కొట్టింది. తీరా సమావేశం నాటికి కాంగ్రెసు ప్రతినిధులెవరూ వార్తల్లో కనిపించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది అఖిలపక్ష సమావేశం లాగా సాగలేదు.. ఖాళీగా ఉన్న పార్టీల వారందరినీ ఒక చోట పోగేసి.. చంద్రబాబునాయుడు వారికి తన ఉపదేశం చెప్పినట్లుగా సాగిపోయింది.

వచ్చిన వారిలో ప్రముఖ పార్టీలు సీపీఐ, జనసేన మాత్రమే. మిగిలినవన్నీ ప్రజలకు తెలియని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోదిలో లేని పార్టీలే!

సీపీఐ, జనసేన ల ఎజెండా కూడా వేరు. చంద్రబాబు చెప్పిన మాటలను వినిపోవడానికి వారు రాలేదు. అమరావతి విషయంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అనిపిస్తే దాని మీద విచారణ జరిపించాలే తప్ప... పనులు నిలిపివేయడం సరికాదంటూ సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబుకు మింగుడుపడని డిమాండు కావొచ్చు. అలాగే.. జనసేన కూడా ప్రభుత్వమే  ఒక అఖిలపక్షం వేసి.. జగన్ మోహన్ రెడ్డి.. తన వెంట చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్ ను కూడా తీసుకువెళ్లాలని డిమాండ్ చేసింది. ఇది అర్థం లేని మాట.

జగన్ నాయకత్వంలో ఈ ఇద్దరూ వెళ్తారా లేదా అనేది పక్కన పెడితే... అమరావతి అఖిలపక్షం అనేది తన సారథ్యంలో జరగాలని చంద్రబాబు కోరుకుంటూ ఉంటే.. నీ నాయకత్వం ఇక చాల్లే.. అదేదో జగన్  ద్వారానే వెళ్దాం అని జనసేన సంకేతం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సంకేతాలను బట్టి.. ఏ రకంగా చూసినా.. అఖిలపక్షం తుస్సుమన్నట్లుగానే కనిపిస్తోంది.

Show comments