భర్త కన్నా.. భార్య పారితోషకమెక్కువ!

బాలీవుడ్ లో మీటూ వ్యవహారాన్ని దాదాపు మర్చిపోతున్నారు. మీడియాకు కూడా రణ్ వీర్, దీపికల పెళ్లి వార్తలు దొరకడంతో మీటూ అవసరం లేకుండాపోయింది. అదలా ఉంటే.. ఇప్పుడు చర్చ పారితోషకాల మీదకు మళ్లింది. పారితోషకాల విషయంలో లింగసమానత్వం ఉండాలని కొంతమంది గొంతులు సవరిస్తున్నారు. అంటే హీరోకి ఎక్కువ పారితోషకం.. ఇవ్వాల్సిన అవసరం లేదనేది వీరి వాదన. ఆడ, మగ అన్ని విషయాల్లోనూ సమానం కాబట్టి.. పారితోషకం విషయంలో కూడా సమానం కావాలనేది వీరి డిమాండ్.

ఈ డిమాండ్ పట్ల బాలీవుడ్ లోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. సమాన వేతనం అనేది కుదరదు అని.. మార్కెట్ ను బట్టి రెమ్యూనరేషన్ అనే వాదన వినిపిస్తోంది. కొంతమంది హీరోలు తమ సైడ్ నటించే హీరోయిన్ల కన్నా చాలా ఎక్కువ రెట్ల పారితోషకం తీసుకునేది నిజమే కానీ.. కొన్నిసార్లు మాత్రం హీరోయిన్లే హీరోల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. అలాంటి వాళ్లు ఈ అంశంలో స్పందిస్తున్నారు.

అందుకు ఉదాహరణ అభిషేక్ బచ్చన్. ఈ హీరో పారితోషకం ఆయన భార్య కన్నా చాలా తక్కువ! ఈ విషయాన్ని అభి ఒప్పుకుంటున్నాడు. తను ఇప్పటి వరకూ ఐష్ తో కలిసి ఎనిమిది సినిమాలు నటించాను అని.. కేవలం ఒక్కసారి మాత్రమే ఆమె కన్నా ఎక్కువ పారితోషకం తీసుకున్నాను అని అభి చెబుతున్నాడు. మిగతా సందర్భాలన్నింటిలోనూ ఐష్ తనకన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ పొందిందని వివరిస్తున్నాడు.

ఆమెకు ఉన్న మార్కెట్ ను అనుసరించి ఆమె డబ్బు పొందుతోందని, తనస్థాయికి తను అని అభి అంటున్నాడు. కాబట్టి సమానవేతనం అని డిమాండ్ చేయడం సబబు కాదని.. తామంతా సర్దుకుపోవడం లేదా? అని అభి అంటున్నాడు.

నటి తాప్సీ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. తను అమితాబ్ తో కలిసి నటించిన సందర్భంలో ఆయనకు సమానమైన పారితోషకం కావాలని అడగలేను కదా.. అని తాప్సీ అంటోంది.

Show comments