అధ్యక్షా.. అనేదెలా బండ్ల గణేషా.?

'అసెంబ్లీలో మైక్‌ పట్టుకుని అధ్యక్షా..' అనడం ఖాయమంటూ గత కొద్ది రోజులుగా సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఇటీవల రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బండ్ల గణేష్‌, అంతకు ముందూ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుదారుడే. ఆ మాటకొస్తే, అన్ని రాజకీయ పార్టీలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. టీడీపీకి ఆర్థికంగా వెన్నూదన్నూ అయిన, సీఎం రమేష్‌కి బండ్ల గణేష్‌ అత్యంత సన్నిహితుడు.

బొత్స సత్యనారాయణతో బండ్ల గణేష్‌కి వున్న సంబంధాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఎలాగైతేనేం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశానంటూ బండ్ల గణేష్‌ హడావిడి చేయడం అయితే అయ్యిందిగానీ, కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు టిక్కెట్‌ ఖరారు చేయలేదు.

జూబ్లీహిల్స్‌ టిక్కెట్‌ని బండ్ల గణేష్‌ ఆశించాడు. అయితే, ఆ టిక్కెట్‌ని మాజీమంత్రి పి.జనార్ధన్‌రెడ్డి తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. దాంతో, బండ్ల గణేష్‌ ఒకింత షాక్‌కి గురయ్యాడట. మరోపక్క, జూబ్లీహిల్స్‌ కాకపోతే, రాజేంద్రనగర్‌ అయినా తనకు దక్కుతుందని బండ్ల గణేష్‌ తన సన్నిహితులతో ఇంకా చెబుతూనే వున్నాడట.

నిజానికి, బండ్ల గణేష్‌.. జనసేన పార్టీలో చేరతాడని అందరూ అనుకున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీచేసే అవకాశం లేకపోవడం, హైద్రాబాద్‌ పరిధిలోనే ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకోవడం.. వెరసి, బండ్ల గణేష్‌ పొలిటికల్‌ ఎంట్రీ విషయంలో ఒకింత తొందరపడ్డాడనే అనుకోవాలి.

డిసెంబర్‌ 11వ తేదీన ఎమ్మెల్యేగా 'సర్టిఫికెట్‌' అందుకుంటాననీ, అసెంబ్లీలో అడుగు పెడ్తాననీ బల్లగుద్ది మరీ, ఒకింత ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో చెప్పుకున్న బండ్ల గణేష్‌కి కనీసం పోటీచేసే ఛాన్స్‌ అయినా కాంగ్రెస్‌ అధిష్టానం ఇస్తుందా.? ప్రస్తుతానికైతే ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకీ రెండో లిస్ట్‌లోనూ సీటు దక్కలేదంటే.. ఇక, బండ్ల గణేష్‌ పరిస్థితి ఇంకెలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదేమో.!

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments