లాంఛనం పూర్తి చేసిన ఆదినారాయణ రెడ్డి!

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి భారతీయజనతా పార్టీ తీర్థం  పుచ్చుకున్నారు ఆదినారాయణ రెడ్డి. ఫిరాయింపుల్లో ఈయనది అందెవేసిన చేయి అనే సంగతి తెలిసిందే. ఎవరి చేతిలో పవర్ ఉంటే  అక్కడ తేలడం ఆదినారాయణ రెడ్డి ప్రత్యేకత. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తలుపులు మూసేసింది.

అయితే  కనీసం మూడునాలుగు నెలలు కూడా ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అధికారం లేకుండా ఉండలేకపోయారు. ఆయన బీజేపీలోకి చేరబోతున్నారంటూ  చాన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ లాంఛనం పూర్తి చేశారు.

ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో ఆదినారాయణ రెడ్డి భారతీయజనతా పార్టీ కండువా వేసుకున్నారు. ఈయన రెండు వేల పద్నాలుగులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గిన సంగతి తెలిసిందే. జమ్మలమడుగు నుంచి నెగ్గి ఈయన కొన్నాళ్లకే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ద్వారా దక్కిన  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు.

అలాగే కొనసాగుతూ.. మంత్రి కూడా అయ్యారు. ఈ ఫిరాయింపు నేతకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చారు. అప్పటికే ఫ్యాక్షన్ తగాదాలు కలిగి ఉన్న రామసుబ్బారెడ్డితో కూడా ఆది రాజీ అయ్యారు. తమ వద్ద వాటాల పంపకం కరెక్టుగా ఉందని, తాము  సరిగ్గా పంచుకుంటున్నామని.. ఇక తగాదాలు లేవని ఆదినారాయణ రెడ్డి  బహిరంగంగా ప్రకటించుకున్నారు.

అయితే జనాలు మాత్రం ఆదిని ఛీత్కరించుకున్నారు. కడప ఎంపీగా పోటీ చేసి చిత్తుగా ఓడారీయన. అవినీతికి సంబంధించిన కేసుల భయం ఈయనకు గట్టిగా ఉందని టాక్. అందుకే బీజేపీలోకి వెళ్లి తనను తాను రక్షించుకోవడానికి ఆది ప్రయత్నిస్తూ ఉన్నారనేది జమ్మలమడుగు జనం అనుకుంటున్న మాట!