సినిమా రివ్యూ: అదుగో

రివ్యూ: అదుగో
రేటింగ్‌: 1/5
బ్యానర్‌: ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌
తారాగణం: రవిబాబు, అభిషేక్‌ వర్మ, నభా నతేష్‌, విజయ్‌ సాయి, ఆర్‌కె, కాశీవిశ్వనాధ్‌ తదితరులు
కథనం: సత్యానంద్‌
మాటలు: నివాస్‌, రవిబాబు
సంగీతం: ప్రశాంత్‌ విహారి
కూర్పు: బళ్ళ సత్యనారాయణ
ఛాయాగ్రహణం: ఎన్‌. సుధాకర్‌రెడ్డి
నిర్మాత: రవిబాబు, సురేష్‌ బాబు
కథ, దర్శకత్వం: రవిబాబు
విడుదల తేదీ: నవంబర్‌ 7, 2018

అయితే అమితంగా ఆకట్టుకునేలా, లేదంటే దారుణంగా హింసించేలా... రెండు ఎక్స్‌ట్రీమ్స్‌లో సినిమాలు తీసే రవిబాబు తాజా చిత్రం 'అదుగో' రెండవ క్యాటగిరీకి చెందినదని రేటింగ్‌ని బట్టి ఈ పాటికి అర్థమయ్యే వుంటుంది. పంది పిల్లని ప్రధాన పాత్రగా పెట్టి సినిమా తీయాలనే థాట్‌తో ఎక్సయిట్‌ అయిన రవిబాబు అందుకు కావాల్సిన వనరులని సమకూర్చుకోవడంలో బిజీ అయిపోయి స్క్రిప్ట్‌ని మాత్రం ప్రయారిటీ లిస్ట్‌లో లాస్ట్‌ పెట్టినట్టున్నాడు. ఈగని ప్రధాన పాత్రగా పెట్టి కూడా అద్భుతాలు చేయవచ్చునని రాజమౌళి ఆల్రెడీ నిరూపించేసాడు.

కాకపోతే హీరో ఈగ అయినా, పంది అయినా ముందు కావాల్సినది ఆకట్టుకునే కథ,  అలరించే కథనం. ఈ బేసిక్స్‌ లేకుండా లైవ్‌ యానిమేషన్‌తో పందులని సృష్టించి ఎన్ని చిందులు వేయించినా దండగ ప్రహసనం. కథకి పందిపిల్ల అవసరం పడడం కాకుండా, పంది పిల్లని పాత్రగా పెడితే ఎలాంటి కథ రాయవచ్చు అనే ఆలోచన నుంచి 'అదుగో' పుట్టిందేమో అనే అనుమానం వస్తుంది. పాత్రల పరిచయం కోసమే దాదాపు అరగంట అవసరమయ్యేటన్ని పాత్రల్ని పెట్టేసి వారితో చేయించిన భరించరాని కామెడీతోనే మొదటి సగం గడిచిపోతుంది.

ఆ గంట గడిచిందనే ఆనందం కంటే ఇంకో గంట భరించాలనే భయమే ఇంటర్వెల్‌లో ఎక్కువ పీడిస్తుంటుంది. నిజానికి ఈ భయం సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే స్టార్ట్‌ అయి, ముందుకి పోయే కొద్దీ ఒక మాదిరి డిప్రెషన్‌కి గురి చేస్తుంది. నాలా రివ్యూలు రాయడానికి వచ్చిన వాళ్లు, పంది పిల్ల సినిమా కాబట్టి పిల్లలకి నచ్చుతుందని వచ్చిన తల్లిదండ్రులు మినహా మిగిలిన వారు మొదలయిన కాసేపటికే పలాయనం చిత్తగించే అవకాశమే ఎక్కువుంది.

పంది పిల్ల రోడ్డు దాటితే ప్రమాదమని ఓ పంది తన పిల్లకి ఓ కథ చెబుతుంది. బంటి అనే పంది పిల్ల రోడ్డు దాటుతూ దుండగుల బారిన పడుతుంది. అక్కడ్నుంచి వివిధ వ్యక్తులు, రౌడీ మూకలు ఆ పంది పిల్ల కోసం వేట మొదలు పెడతారు. కొందరేమో ఆ పంది మింగేసిన చిప్‌ కోసం, మరికొందరేమో పందుల రేసులో గెలిచే సత్తా వున్న పంది ఇదేనన్న కారణంతో. ఆ పంది పిల్లని పెంచుకుంటున్న పిల్లాడు, కొరియర్‌లో కుక్క పిల్లకి బదులు పంది పిల్ల రావడం వల్ల ఇరుక్కున్న ప్రేమజంట... ఇలా మొత్తం అంతా బంటి చుట్టే తిరుగుతుంది.

పాత్రల పరిచయం నుంచే రవిబాబు ఈసారి తాను 'అవును', 'అనసూయ' తీసే మూడ్‌లో లేనని, 'అమ్మాయిలు అబ్బాయిలు', 'పార్టీ' సినిమాలు తీసిన మోడ్‌ యాక్టివేట్‌ అయి వుందని నిరూపించేస్తాడు. ఒక్కో సన్నివేశం గడిచే కొద్దీ విసిరేసినట్టుగా అక్కడక్కడా థియేటర్లో పడి వున్న జనమంతా కలిసి ఒక్క చోట చేరి సంతాపం తెలుపుకోవాలనే తపన అధికం చేస్తుంటాడు. సాధారణంగా ఇంటర్వెల్‌కి తర్వాతేం జరుగుతుందనే ఆలోచనలే ఎక్కువ వస్తుంటాయి.

కానీ ఈ సినిమా మాత్రం తర్వాత ఏమి చూడాల్సి వస్తుందనే కలవరానికి గురి చేస్తుంది. మొదటి సగంలో నటీనటుల గుంపు మొత్తం కలిపి టార్చర్‌ చేస్తే, తర్వాతి సగంలో ఇక నా వంతు అన్నట్టు తన పని మొదలెడుతుంది పంది లాంటి బంటి! మనిషి ముఖంపై పంది మల విసర్జన చేయడం, గుట్కా నములుతూ ఒక వ్యక్తి పక్కవారి బట్టలపై ఉమ్మడం, కత్తిరించిన మనిషి చెవిని వేపుడు చేయించుకుని రమ్మనడం లాంటి సన్నివేశాలు చూసి నవ్వుకోవాలనేది దర్శకుడి ఉద్దేశం.

మరి అలాంటిది హాస్యమనిపిస్తే, అవి చూసి నవ్వుకోగలిగితే ఇంతకంటే మళ్లీ రాదు అవకాశం. తన వెంట పడుతోన్న వందల మంది నుంచి పంది పిల్ల తప్పించుకుంటూ వుండడం, తనకోసం వెతుకుతోన్న పిల్లాడికి చివరకు కానీ కనిపించకపోవడం ద్వితియార్థం తాలూకు సారాంశం. రవిబాబుతో సహా నటీనటుల్లో ఏ ఒక్కరి గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేకుండా, సాంకేతికత అత్యుత్తమంగా అనిపించాల్సిన కథా వస్తువు వుండి కూడా వాటి గురించి ప్రస్తావించాల్సిన పని లేకుండా 'అదుగో' ఈ యేడాది వచ్చిన అతి చెత్త చిత్రాల లిస్టులోకి ఆశువుగా చేరిపోతుంది.

కొన్ని సినిమాలు కథ బాగోక ఫెయిలవుతాయి. కొన్ని తీయడంలో తేడా జరిగి విఫలమవుతాయి. కానీ అదుగోలాంటివి ప్రేక్షకులపై పగ తీర్చుకోవడానికే వచ్చినట్టుంటాయి. దురదృష్టం ఏమిటంటే... ప్రేక్షకులకి ఏదైనా కొత్త అనుభూతిని ఇవ్వడానికి, మూస సినిమాలు తీయడం ఇష్టపడని ఆలోచనల నుంచి వచ్చిన 'అదుగో' లాంటి చిత్రాలు ఈ విధమైన 'చిత్ర' హింసకి గురి చేయడమే చింతించదగ్గది. ఎల్‌కెజీ పిల్లలు కూడా నవ్వడానికి నాలుగు సార్లు ఆలోచించుకునేలా చేసే 'అదుగో' చూసిన ప్రేక్షకులు ఈ అనుభవాన్ని ఎంత త్వరగా మరచిపోగలిగితే వారి ఆరోగ్యానికి అంత మంచిది.

బాటమ్‌ లైన్‌: వెనక్కి చూడకుండా పారిపో!
- గణేష్‌ రావూరి

ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్