సినిమా రివ్యూ: యాక్షన్‌

సమీక్ష: యాక్షన్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌:
ట్రైడెంట్‌ ఆర్ట్స్‌
తారాగణం: విశాల్‌, తమన్నా, ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్ష పూరి, యోగిబాబు, కబీర్‌ దుహన్‌ సింగ్‌, రాంకీ తదితరులు
కథనం: సుందర్‌, శుభ, వెంకట్‌ రాఘవన్‌
కూర్పు: ఎన్‌.బి. శ్రీకాంత్‌
సంగీతం: హిప్‌హాప్‌ తమిళ
ఛాయాగ్రహణం: డూడ్లే
నిర్మాత: ఆర్‌. రవీంద్రన్‌
కథ, దర్శకత్వం: సుందర్‌ సి.
విడుదల తేదీ: నవంబర్‌ 15, 2019

పేరులోనే 'యాక్షన్‌' వుంది కనుక సినిమా అంతటా యాక్షన్‌ వుంటే చాలన్నట్టుగా దర్శకుడు సుందర్‌ .సి 'వన్‌ నోట్‌' స్క్రిప్ట్‌ రాసుకున్నాడు. 'మిషన్‌ ఇంపాజిబుల్‌' తరహా యాక్షన్‌ని మన ఆడియన్స్‌కి చూపించాలనే ఆలోచన బాగుంది కానీ అలాంటి సినిమాలలో కేవలం థ్రిల్‌ ఇచ్చే యాక్షన్‌తో పాటు కట్టిపడేసే కథనం వుంటుందని విస్మరించాడు. కళ్లు చెదిరే యాక్షన్‌తో పాటు ఎప్పటికప్పుడు గెస్‌ చేస్తూ కూర్చునేలా చేసే ట్విస్టులు కూడా వుంటాయనేది పూర్తిగా వదిలేసాడు. కనీసం ఒక్క ట్విస్ట్‌ కూడా లేకుండా ఒకరి తర్వాత ఒకరుగా విలన్స్‌ని వెంటాడుతూ వెళ్లిపోతుంటాడు ఇందులోని కథానాయకుడు. పోనీ కేవలం అదే పని మీద వుంటాడా అంటే... లేదు. అతనికోసం ఇద్దరు హీరోయిన్లు, వారితో ఈ స్క్రిప్టులో అస్సలేమాత్రం ఇమడని పాటలు!

ఈ తరహా యాక్షన్‌ సినిమాల్లో యాక్షన్‌ సీన్స్‌ తీయడం చాలా ఖర్చు, శ్రమ, రిస్కుతో కూడుకున్నది. విశాల్‌తో పాటు తమన్నా కూడా పాపం బాగానే జంపింగ్‌లు, రన్నింగ్‌లు చేసింది. యాక్షన్‌ ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుందనేది ఒక లిస్ట్‌ రాసుకుని మరీ అన్ని చోట్ల చేసేసినట్టుగా వివిధ దేశాలలో, రకరకాల ప్రదేశాలలో అదే పనిగా 'యాక్షన్‌' చేస్తూనే వున్నారు. మరీ అంత యాక్షన్‌ వున్నా మొహం మొత్తేస్తుందని మాత్రం గ్రహించలేకపోయారు. 'బోర్న్‌' సిరీస్‌ అయినా, 'మిషన్‌ ఇంపాజిబుల్‌' అయినా అంతగా సక్సెస్‌ అయ్యాయంటే అందుకు కేవలం యాక్షన్‌ సీన్స్‌ మాత్రమే కారణం కాదు. వాటిలో ఆకట్టుకునే కథ వుంటుంది. బిగి సడలని కథనం వుంటుంది. ఊహించని మలుపులుంటాయి. వీలయినంత ఎమోషన్‌ కూడా వుంటుంది. వాటన్నిటి మధ్య యాక్షన్‌ జరుగుతుంది కనుక అవి సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీలయ్యాయి.

సుందర్‌ సి. ఒకే తరహా చిత్రాలు చేయడానికి ఇష్టపడడు. ఎప్పటికప్పుడు కొత్త జోనర్స్‌ ట్రై చేస్తూ ఆల్‌రౌండర్‌ అనిపించుకోవాలని చూస్తాడు. అతని గత చిత్రాలని చూసి, యాక్షన్‌ చూస్తే సర్‌ప్రైజ్‌ అవుతారు. ఇంత రేసీ యాక్షన్‌ సీన్స్‌ అతను విజువలైజ్‌ చేస్తాడని, వాటిని ఇంత ఎఫెక్టివ్‌గా తీస్తాడని అతని మునుపటి చిత్రాలు చూసిన వారెవరూ అనుకోరు. అంతవరకు సుందర్‌కి మార్కులు ఇవ్వవచ్చు. అయితే అలరించే యాక్షన్‌ సినిమాకి కావాల్సిన పకడ్బందీ కథని, మలుపులతో కూడిన కథనాన్ని అతను రాసుకోలేదు. ఒక ప్రధానమంత్రిని బాంబ్‌ బ్లాస్ట్‌లో ఎవరో హత్య చేస్తే ఆ మరక కాబోయే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై పడుతుంది. అతను ఆ నింద భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆర్మీ ఆఫీసర్‌ అయిన కొడుకు ఆ రహస్యాన్ని చేధించడానికి వేటకి వెళతాడు. ప్రధానమంత్రి హత్యకి, తన తండ్రి మరణానికి వెనుక మిగిలిపోయిన ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ వెళతాడు. ఈ క్రమంలో అతను ఒకరి తర్వాత ఒకరిగా విలన్లని వెతుక్కుంటూ వెళుతుంటాడే తప్ప కథాగమనంలో ఇక మార్పులేమీ వుండవు.

ఒక లెవల్‌ అయిపోయిన తర్వాత మరో లెవల్‌కి వెళ్లే వీడియో గేమ్‌ తరహాలో యాక్షన్‌ స్క్రీన్‌ప్లే సాగుతుంది. బోర్‌ కొట్టినపుడు కాసేపు 'పాజ్‌' ఇచ్చి కంటిన్యూ చేయడానికి వీడియో గేమ్‌లో వుండే సౌకర్యం ఇక్కడ వుండదు. సుదీర్ఘంగా... దాదాపు, రెండు గంటల నలభై అయిదు నిమిషాల పాటు యాక్షన్‌, యాక్షన్‌... నాన్‌స్టాప్‌ యాక్షన్‌. ఇందులో ఎంత యాక్షన్‌ చేసారంటే... పతాక సన్నివేశాలకి వచ్చేసరికి దర్శకుడి ఆలోచనలు అలసిపోయినట్టు, ఫైట్‌ మాస్టర్ల ఓపిక హరించుకుపోయినట్టు, విశాల్‌-తమన్నాకి ఇక ఇప్పట్లో ఫైట్‌ చేయడం ఇష్టం లేనట్టు... అందరూ నీరసించిపోయారు. ఇంటర్వెల్‌ సీన్‌లో వున్న యాక్షన్‌లో కనీసం పావు వంతు కూడా పతాక సన్నివేశంలోని యాక్షన్‌ వుందనిపించదు, అంతగా మెప్పించదు. బిల్డింగులపై దూకడాలు, నేలపై దేకడాలు ఇక చాలన్నట్టు చివరి సన్నివేశంలో మన సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే కార్లు ఎగరడాలు మాత్రం చూపిస్తారు. అఫ్‌కోర్స్‌ ఆ ఇంటర్వెల్‌కి, క్లయిమాక్స్‌కి మధ్య విసుగెత్తించేంత యాక్షన్‌ చేసి కానీ ఊరుకోరు.

మేథస్సు వాడాల్సిన చోట, బ్రిలియంట్‌గా అనిపించాల్సిన సన్నివేశాల్లో సుందర్‌ సి. లిమిటేషన్స్‌ దొరికిపోయాయి. హ్యాకర్లని వాడి ఫలానా ఇన్విజిబుల్‌ అసాసిన్‌ లొకేషన్‌ కనుక్కోవడంలో, బ్యాంక్‌ అకౌంట్‌నుంచి నాలుగు వేల కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేసే సీన్‌లో కామెడీ చేసి కవర్‌ చేసుకోవాలని చూసారు. ఇక చివరి సన్నివేశాలలో ఇంటర్నేషనల్‌ టెర్రరిస్ట్‌ని పట్టుకుని ఇండియాకి తెచ్చే సీన్‌ అయితే మరీ 'హరి' తీసే 'సింగం' సిరీస్‌ సీన్లని తలపిస్తుంది. యాక్షన్‌కి మధ్యలో సగటు మసాలాలు వుండాలనే నెపంతో సుందర్‌ ఈ చిత్రం నిడివిని మరింత పెంచాడు. సదరు ఫ్యామిలీ డ్రామాని అంత ఎక్స్‌టెండ్‌ చేయడం వల్ల కానీ, హీరోకి ఒక లవ్‌ ట్రాక్‌ పెట్టడం వల్ల కానీ ఎమోషన్‌ పండలేదు. వాటి వల్ల సినిమాకి ఎలాంటి అదనపు ప్రయోజనం చేకూరలేదు. పైగా ఆ హీరోయిన్‌కి పాట పెట్టడం వల్ల తమన్నా ఫీలవకుండా ఇంకో అర్థం లేని పాటని ఇరికించాడు.

విశాల్‌ యాక్షన్‌ సీన్స్‌లో మెరికలా కదిలాడు. తమన్నా కూడా యాక్షన్‌ సీన్స్‌లో బాగానే కష్టపడింది. యోగిబాబు కామెడీ ఫర్వాలేదు. హీరో బావగా నటించిన నటుడు తమిళ అతితో విసిగిస్తాడు. నటన పరంగా ప్రత్యేకించి మాట్లాడుకునే అవకాశం ఎవరికీ దక్కలేదు. సాంకేతికంగా ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించారు. స్టంట్‌ డైరెక్టర్స్‌ అభినందనీయులు. చాలా కష్టపడి, తక్కువ బడ్జెట్‌లోనే చాలా ఎఫెక్టివ్‌గా, రిస్కీ స్టంట్స్‌ చిత్రీకరించారు. ఫైట్‌ సీన్స్‌లో ఎడిటింగ్‌ చాలా బాగుంది. ఒక్కోసారి ఆ ఫాస్ట్‌ కట్స్‌ వల్ల కొన్ని మూమెంట్స్‌ రిజిష్టర్‌ అవలేదనుకోండి! సినిమాటోగ్రఫీ కనువిందు చేస్తుంది. ప్రొడక్షన్‌ డిజైన్‌ ఈ చిత్రానికి ప్రధానాకర్షణ. నేపథ్య సంగీతం కూడా చక్కగా కుదిరింది. పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమా తీయగలనని నిరూపించుకుని తనలోని విలక్షణతని సుందర్‌ చాటుకున్నాడు కానీ రచయితగా ఫెయిలయ్యాడు. సింగిల్‌ నోట్‌ స్క్రిప్ట్‌ కాకుండా కాస్త ఆలోచన జోడిస్తే ఇంత కష్టపడ్డందుకు యాక్షన్‌ కేవలం ఫైట్‌ సీన్స్‌ లవర్స్‌నే కాకుండా వైడర్‌ ఆడియన్స్‌ని రీచ్‌ అయి వుండేది.

బాటమ్‌ లైన్‌: నాన్‌స్టాప్‌ యాక్షన్‌!

గణేష్‌ రావూరి