సీక్వెల్ తో సెట్స్ పైకి వచ్చిన తమన్న

ప్రభుదేవా, తమన్న, సోనూసూద్ లీడ్ రోల్స్ పోషించిన సినిమా అభినేత్రి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కి, ఒకేసారి విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఫ్లాప్ అయింది. హిందీలో ఓ మోస్తరుగా ఆడింది. ఈ సినిమాకు సీక్వెల్ తీస్తామని గతంలోనే ప్రకటించాడు ప్రభుదేవా. చెప్పినట్టుగానే అభినేత్రి-2 సెట్స్ పైకి వచ్చేసింది.

మారిషస్ లో ఈ సినిమా షూటింగ్ చడీచప్పుడు కాకుండా ప్రారంభమైంది. కోవై సరళతో సెల్ఫీ దిగిన ప్రభుదేవా ఆ మేటర్ ను పోస్ట్ చేసే వరకు ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన విషయం ఎవరికీ తెలీదు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ఏఎల్ విజయ్, సీక్వెల్ ను కూడా డైరక్ట్ చేస్తున్నాడు. ప్రభుదేవా, తమన్న, సోనూసూద్ మారలేదు. ఇతర నటీనటుల్లో కొన్ని మార్పుచేర్పులు చేశారు. 

అభినేత్రి సినిమాలో రూబీ, దేవిగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటించింది తమన్న. ఆమె భర్తగా ప్రభుదేవా, సినీస్టార్ గా సోనూసూద్ నటించాడు. సీక్వెల్ లో మాత్రం ఇలాంటి పాత్రలు ఉండవట. టైటిల్, నటీనటుల్ని మాత్రమే రిపీట్ చేస్తున్నారు. కథ పూర్తిగా కొత్తగా ఉంటుందట. కాబట్టి దీన్ని సీక్వెల్ అనొద్దంటున్నాడు ప్రభుదేవా. 

మొదటి సినిమా బెడిసికొట్టినప్పటికీ అభినేత్రిపై ప్రభుదేవాకు ఇంకా నమ్మకం సడలిపోలేదు. అందుకే సీక్వెల్ ను కూడా తనే డబ్బులు పెట్టి నిర్మిస్తున్నాడు. మొదటి భాగంలో నిర్మాణ భాగస్వామిగా ఉన్న కోన వెంకట్ కు తాజా సీక్వెల్ తో సంబంధం లేదు.