ఐదుగురు మంత్రులు ఓడిపోతారా.?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. కొన్నిచోట్ల రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదైతే, కొన్నిచోట్ల అత్యంత దారుణంగా పోలింగ్‌ శాతం కన్పించింది. పెద్దగా ఓటింగ్‌లో పెరుగుదల వుండకపోవచ్చనీ, 2014 ఎన్నికల సమయంలో వచ్చిన పోలింగ్‌ శాతానికి కాస్త అటూ ఇటూగా వుంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ నిన్న వెల్లడించిన విషయం విదితమే. అంతిమంగా ఎంత పోలింగ్‌ శాతం నమోదయ్యిందనేదానిపై ఈ రోజు ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

పోలింగ్‌ శాతాన్ని బట్టి, ఆయా రాజకీయ పార్టీల అంచనాల్లో చిన్న చిన్న తేడాలుండొచ్చు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర సమితికే తిరిగి అధికారం కట్టబెడుతున్నాయి. మెజార్టీ సర్వేలు, 'మహాకూటమితో టీఆర్‌ఎస్‌కి గట్టి పోటీ' అని చెబుతున్నా, ఫైనల్‌గా విజయం మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికేనని తేల్చేస్తుండడం గమనార్హం. ఒక్క లగడపాటి సర్వే మాత్రమే, టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా వుంది.

ఎగ్జిట్‌ పోల్స్‌ సంగతి పక్కన పెడితే, ఐదుగురు మంత్రులు ఈసారి ఓడిపోనున్నారంటూ నిన్న సాయంత్రం నుంచీ ఓ ప్రచారం జోరందుకుంది. నిజానికి, పోలింగ్‌కి ఓ వారం పదిరోజుల ముందు నుంచే ఒకరిద్దరు మంత్రులు ఓడిపోవచ్చంటూ అధికార పార్టీ తరఫున లీకులు రావడం గమనార్హం. ఆ సంఖ్య నిన్న సాయంత్రానికి 5గా ప్రచారంలోకి వచ్చింది.

ఐదుగురిలో ఇద్దరు ఓడిపోవడం ఖాయం. ముగ్గురు మాత్రం గెలవడానికి చాలా చాలా కష్టపడాల్సి వుంది. గెలిచినా 100 నుంచి 500 ఓట్ల తేడాతోనే వారికి గెలుపు లభిస్తుంది.. అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ ఐదుగురు మంత్రులు ఎవరు.? అంటే, ముందుగా మహేందర్‌రెడ్డి పేరు విన్పిస్తోంది. ఈ తరహా ప్రచారంలో ఎంత నిజం.? అనేది వేరే విషయం.

తినబోతూ రుచి ఎందుకు.? అంటే, అసలు ఎగ్జిట్‌ పోల్స్‌ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే వుండదన్నది చాలామంది అభిప్రాయం. కాగా, సిద్దిపేటలో హరీష్‌రావుకి బంపర్‌ మెజార్టీ రానుందనీ, మంత్రి కేటీఆర్‌ కూడా మంచి మెజార్టీతో గెలవనున్నారనీ, కేసీఆర్‌కి ఎలాగూ తిరుగే వుండదనీ.. టీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రత్యర్థులు సైతం ఒప్పుకోవాల్సిన పరిస్థితి.

అన్నట్టు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో చాలామందికి షాక్‌ తప్పకపోవచ్చట. అదే సమయంలో, మహాకూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం జరిగిన వారిలోనూ కొందరికి ఓటర్లు ఝలక్‌ ఇచ్చే అవకాశం లేకపోలేదన్నది ఓ అంచనా.

Show comments