పవన్ కల్యాణ్ ఏ అన్నం తింటున్నాడో?

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి రాబోయే ఎన్నికల్లో పెద్దగా ఊపు ఉండదని చెబుతున్నారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి. తను వైసీపీలో ఉండడం వల్ల ఈ మాట చెప్పడం లేదని, ఎన్నో ప్రాంతాలు తిరిగి జనాలను పరిశీలించిన తర్వాతే ఈ అభిప్రాయానికి వచ్చానని అంటున్నాడు. పవన్ కల్యాణ్ ఏ అన్నం తింటున్నాడో తను చెప్పలేకపోవచ్చని, కానీ జనసేన హవా ఎలా ఉందో మాత్రం లెక్కకట్టగలనని అంటున్నాడు.

"పవన్ ఏ అన్నం తింటున్నాడో మనమేం చెబుతాం. ఆయన వాదనలు ఆయనకున్నాయి. అవన్నీ ప్రజలకు నచ్చుతాయని నేను అనుకోవడం లేదు. నేను కూడా స్టేజ్ ఎక్కి వంద మాట్లాడతాను. పవన్ కూడా అంతే. అవన్నీ వినే ఓపిక, పట్టించుకోవాల్సిన అవసరం జనాలకు లేదు. ఆయనకు ఓ పార్టీ ఉంది, ఎజెండా, మేనిఫెస్టో కూడా ఉంది. చూద్దాం, ఆయన హవా ఎలా ఉంటుందో జనాలు తేలుస్తారు."

జనసేన వల్ల తమ ఓటు బ్యాంక్ కు ఎలాంటి నష్టం ఉండదంటున్నారు పృధ్వి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకే పడుతుందని, జనసేనకు వెళ్లే ఆస్కారం లేదంటున్నారాయన.

"టీడీపీ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా జనసేనకు పడదు. ఎందుకంటే, ప్రభుత్వాన్ని వ్యతిరేస్తున్న ప్రజలు వైసీపీని ఆరాధిస్తున్నారు. జగన్ వెంట నడుస్తున్నారు. పవన్ ను కేవలం చూడ్డానికి మాత్రమే వస్తున్నారు."

కాపు వర్గం ఓటు బ్యాంక్ మొత్తం జనసేన పార్టీ వైపు మళ్లుతుందని చెప్పడం మూర్ఖత్వం అంటున్నారు పృధ్వి. కులం ప్రాతిపదికన ఓట్లు వేసే సంస్కృతి ఇంకా పూర్తిస్థాయిలో విస్తరించలేదని చెప్పుకొచ్చారు.

"కాపు వర్గం ఓట్లు ఎటు వెళ్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే వాదన సరైంది కాదు. కులం మీద ఓటు వేసి గెలిచే సంస్కృతి లేదు. ఓ కాపు వర్గానికి చెందిన వ్యక్తిగా నేను చెబుతున్నాను. కుల రాజకీయాల మీద ఎన్నికలు గెలుస్తామని భావించడం మూర్ఖత్వం."

కాపులంతా పవన్ వైపే ఉన్నారనే వాదనను ఇలా పరోక్షంగా తిప్పికొట్టారు పృధ్వి. కాపులు ఎక్కువగా ఉన్న విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు వైసీపీకే వస్తాయంటున్నారాయన.

రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

Show comments