గెలుపు వాస్తవం...నైతిక విజయం భ్రమ..!

ఎవరి జీవితాల్లోనైనా వాస్తవాలు, భ్రమలు ఉంటాయి. వాస్తవాలను అలాగే స్వీకరించాలి తప్ప భ్రమల్లో బతకకూడదు. రాజకీయ నాయకులు కొందరు భ్రమల్లో బతుకుతుంటారు. ఎన్నికల్లో విజయాలకు, అపజయాలకు అనేక కారణాలుంటాయి. విజయం సాధించినవారు ఆనందంగా ఉంటారు. అపజయం పాలైనవారు విషాదంలో మునుగుతారు. దాంతోపాటు విజయం సాధించినవారిపై అనేక విమర్శలు చేస్తారు. వారు డబ్బు ఖర్చు చేసి విజయం సాధించారని, ఓటర్లను ప్రలోభపెట్టారని, అక్రమాలకు పాల్పడ్డారని... ఆరోపణలు చేస్తుంటారు. వీటిల్లో కొన్ని నిజం కావొచ్చు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల విజయాలు, అపజయాలు గణాంకాలతో ముడిపడి ఉంటాయి. అంతా అంకెల గారడీ. ఎవరు మెజారిటీ సాధిస్తే వారు విజేత. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినా అది విజయం కింద లెక్కే. ప్రజాస్వామ్యంలో విజయం సాధించడమే ప్రధానంగాని ఎలా సాధించారనేది ముఖ్యం కాదు. ఒకవేళ విజేత అక్రమాలకు పాల్పడి గెలిచివుంటే ఆ సంగతి కోర్టులో నిరూపితమయ్యేవరకు అతను విన్నరే. విజేతలపైన కోర్టుకు వెళ్లే పరాజితులు తక్కువే. విజేత అక్రమాలు నిరూపణయి పరాజితుడిని విజేతగా ప్రకటించిన సందర్భాలూ ఉన్నాయి. 

అయితే ఎన్నికల ఫలితాలు రాగానే కొందరు పరాజితులు అనే మాట 'నైతిక విజయం మాదే' అని. కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (స్థానిక సంస్థల కోటా) వైఎస్సార్‌సీపీకి పెద్ద దెబ్బ తగిలింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ బాబాయి వివేకానంద రెడ్డి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఏపీలో ఇదో పెద్ద చర్చనీయాంశమైంది. ఇందుకు ప్రధాన కారణం..కడప జిల్లా వైఎస్‌ కుటుంబం కోట కావడం, అక్కడ దశాబ్దాలుగా ఏ ఎన్నికల్లోనూ ఆ కుటుంబం ఓటమి పాలుకాకపోవడం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు-ప్రతిపక్ష నేత జగన్‌ మధ్య నిప్పులు కురుస్తున్న తరుణంలో వైకాపా అభ్యర్థి ఓడిపోవడంతో టీడీపీ మరింత విర్రవీగే పరిస్థితి వచ్చింది. జగన్‌ను కాలరాయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబుకు ఇదో మంచి అవకాశంగా లభించింది. ఈ ఒక్క గెలుపుతో ఆయన 'వచ్చే ఎన్నికలు ఏకపక్షం' అనే ప్రకటించారు. వైఎస్‌ కోటలో టీడీపీ పాగా వేసిందంటే సహజంగానే అది జీర్ణించుకోలేని పరిస్థితి. అయితే చంద్రబాబు కోట్లు ఖర్చు పెట్టారని, వైకాపా నాయకులను ప్రలోభపెట్టారని, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. కాబట్టి 'నైతిక విజయం మాదే' అంటున్నారు.

మన దేశంలో సర్పంచ్‌ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. డబ్బు నీళ్లలా ఖర్చు చేస్తారు. ఎన్నికల్లో ధన బలం తగ్గించాలని నీతులు చెప్పే పాలకులే డబ్బు బలం ప్రదర్శిస్తారు. ఇవన్నీ తెర వెనక జరుగుతాయి. తెర మీద విజయం కనిపిస్తుంది. ప్రజలకు, రాజ్యాంగానికి తెర మీద కనిపించే విజయమే ముఖ్యంగాని తెర వెనక ఏం జరిగిందన్నది కాదు. ప్రజాస్వామ్యంలో 'నైతికం' అనే దానికి ప్రాధాన్యం లేదు. కాబట్టి వైకాపా అధినేత జగన్‌, ఆ పార్టీ నాయకులు ఓటమికి కారణాలు విశ్లేషించుకొని ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలి. అంతేతప్ప 'నైతిక విజయం మాదే' అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. ఒకవేళ వైకాపా నాయకులకు తీరిక, ఓపిక ఉంటే టీడీపీది అక్రమ విజయమని కోర్టులో నిరూపించాలి. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మాయావతి బహుజన సమాజ్‌ పార్టీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయాయి.

వెంటనే వారు ఈవీఎంల టాంపరింగ్‌ జరిగిందని, ఈ ఎన్నికలను తాము అంగీకరించబోమని అన్నారు. మళ్లీ బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. మాయావతి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. మొన్నీమధ్య తమిళనాడు అసెంబ్లీలో శశికళ వర్గం ముఖ్యమంత్రి పళనిసామి బలనిరూపణ వ్యహహారం రచ్చరచ్చ అయింది. పళనిసామి బలం నిరూపణలో నెగ్గారని స్పీకర్‌ చేసిన ప్రకటనను ప్రతిపక్షాలు అంగీకరించలేదు. కాని మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయన్ని అంగీకరించారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఓట్లు, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు..ఇదే ప్రధానం. గోవా, మణిపూర్‌లో కాంగ్రెసుకు బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చినా కాషాయ పార్టీ ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. కారణం ఆ పార్టీకి మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని గవర్నర్‌ విశ్వసించారు. అక్రమాలు చేశారా అని ప్రశ్నించలేదు. శాసనసభ్యతానికి, గెలిచిన పార్టీకి రాజీనామా చేయకుండానే ప్రజాప్రతినిధులు పార్టీ మారుతున్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. ప్రజాస్వామ్యంలో నైతికత ఎక్కడుంది? నైతికతే లేనప్పుడు నైతిక విజయం ఎలా ఉంటుంది?

Show comments