సినిమా రివ్యూ: 2.0

రివ్యూ: 2.0
రేటింగ్‌: 3.25/5
బ్యానర్‌: లైకా ప్రొడక్షన్స్‌
తారాగణం: రజినికాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, సుధాన్షు పాండే, ఆదిల్‌ హుస్సేన్‌ తదితరులు
సంగీతం: ఏ.ఆర్‌. రహమాన్‌
కూర్పు: ఆంటొని
ఛాయాగ్రహణం: నిరవ్‌ షా
నిర్మాతలు: ఏ. సుబాస్కరన్‌, రాజు మహాలింగం
కథ, కథనం, దర్శకత్వం: శంకర్‌
విడుదల తేదీ: నవంబర్‌ 29, 2018

పెద్ద స్టార్స్‌తో కూడా మీడియం బడ్జెట్‌లో సినిమాలు తీసుకునే రోజుల్లోనే తనదైన గ్రాండ్‌ విజన్‌తో కళ్ళు చెదిరే నిర్మాణ విలువలున్న సినిమాలు అందించేవాడు శంకర్‌. ప్రస్తుతం మిగతా దర్శకులు కూడా ఆ స్థాయి గ్రాండ్‌ విజువల్స్‌ చూపించే స్థాయికి అప్‌డేట్‌ అయ్యారు కనుక తన అప్‌లోడెడ్‌ వెర్షన్‌ని చూపించడానికి ఇదే మంచి టైమ్‌. బాహుబలితో ఇండియన్‌ సినిమా మార్కెట్‌ పొటెన్షియల్‌ ఎంత అనేదానిపై ఒక అవగాహన కూడా రావడం శంకర్‌ ఎప్పట్నుంచో పెండింగ్‌లో వుంచిన 'రోబో' సీక్వెల్‌కి తెర లేచింది. పాటల్లో అందమైన లొకేషన్లు, ఖరీదైన సెట్లు చూపించేసి, సమాజంలో జరుగుతోన్న అన్యాయాలపై తన హీరో గర్జించేస్తే చాలదని, ఈ తరం ఆడియన్స్‌కి కావాల్సిన స్కేల్‌లో '2.0'ని ఊహించాడు.

అయితే ఊహించడం ఈజీనే కానీ ఊహించిన దానిని తెరమీదకి తేవడం అంత తేలిక కాదు. భారీ తారాగణం, లారీల కొద్దీ ధనం వున్నా 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' లాంటి మిస్‌ఫైరింగ్‌లు జరుగుతూనే వుండడం చూస్తూనే వున్నాం. ఆకాశ హర్మ్యాలు భారీ ఆకారాలున్న జంతువులు లేదా మరేదైనా ఉపద్రవం వస్తే కూలిపోవడాలు, జయంట్‌ ఆకారాలున్న వ్యక్తులు లేదా జంతువులు కొట్టుకుంటూ అందించే థ్రిల్సూ... హాలీవుడ్‌ సినిమాలకే పరిమితం అనుకుని అలాంటివి మన సినిమాల నుంచి ఆశించను కూడా ఆశించం.

అనుకోవాలే కానీ అలాంటి వింతలని తెర మీదకి తీసుకురావడం, అదేస్థాయి థ్రిల్‌ని మన భాషలో, మన నటులతోను ఆస్వాదించడం వీలవుతుందని నిరూపించిందీ చిత్రం. హాలీవుడ్‌ చిత్రాలకి వున్న వనరులు, బడ్జెట్‌ మిగతా దేశాల చిత్ర పరిశ్రమలకి వీలు కాదు కనుక అవి వారు మాత్రమే తీయగలరనే నమ్మకం ఏర్పడిపోయింది. హాలీవుడ్‌ సినిమాల బడ్జెట్‌లో ఎన్నో వంతులు తక్కువలోనే శంకర్‌ అలాంటి వినోదాన్ని, సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందించగలిగాడు.

సూపర్‌ హీరో వర్సెస్‌ జయంట్‌ ఫోర్స్‌ అనేది హాలీవుడ్‌ సినిమాని ఏళ్ల తరబడి నడిపిస్తోన్న ఇంధనం. ఇకపై అలాంటి సినిమాలని మన వాళ్లు కూడా 'ఊహించవచ్చు', ప్రయత్నిస్తే 'సాధించవచ్చు' అని నిరూపిస్తుంది 2.0, ఏ శంకర్‌ ఫిలిం! ఓపెనింగ్‌ టైటిల్స్‌ దగ్గర్నుంచే శంకర్‌ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాడు. 3డి టెక్నాలజీలో హాలీవుడ్‌ సినిమాలు తరచుగా చూస్తూనే వుంటాం కానీ అది ఇంత బ్యూటిఫుల్‌గా వుంటుందా అనిపించేట్టుగా టైటిల్‌ డిజైనింగ్‌ దగ్గరే శంకర్‌ సృజనకి సరెండర్‌ అయిపోతాం.

కథలోకి వెళ్లడానికి కాలయాపన చేయకుండా సరాసరి సమస్యని హైలైట్‌ చేయడంతో ఇమ్మీడియట్‌గా ఎంగేజ్‌ అవుతాం. సెల్‌ఫోన్లు ఎగిరిపోవడంతో పాటు కొందరు ప్రముఖుల హత్యలు కూడా జరుగుతూ వుండడం, ఈ క్రమంలో సెల్‌ఫోన్స్‌తో నిండిపోయిన రహదారి, అడవి లాంటి విజువల్స్‌ వగైరా అన్నీ ఇన్‌స్టంట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తాయి. కాకపోతే అసలు ఏమి జరిగిందనేది తెలియకుండా ఇదంతా చూపిస్తూ వుండడం వల్ల ఎమోషనల్‌ కనక్ట్‌ మిస్‌ అవుతుంది. పక్షిరాజు (అక్షయ్‌కుమార్‌) నెగెటివ్‌ ఆరాని న్యూట్రలైజ్‌ చేసే ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ అనుకున్నంత ఎఫెక్టివ్‌గా తెరమీదకి రాలేకపోయింది.

చిట్టి (రజనీకాంత్‌) విన్యాసాలేవో చేస్తుంటాడు కానీ సుదీర్ఘంగా సాగే ఈ సన్నివేశం అంతగా రక్తి కట్టించలేకపోవడంతో ఒక విధమైన 'లో'తోనే కథ ఇంటర్వెల్‌కి చేరుతుంది. అటు సైంటిస్ట్‌ వశీకరన్‌ కానీ, ఇటు చిట్టి ఇద్దరూ పాసివ్‌గానే అనిపించడం కూడా రజనీకాంత్‌ అభిమానులకి కొంచెం వెలితిగానే అనిపిస్తుంది. అయితే పక్షిరాజు కథ రిలవెంట్‌గా అనిపిస్తుంది. అవధులు మించిన సాంకేతికత పర్యావరణానికి మంచిది కాదనే సందేశాన్ని ఇస్తూ శంకర్‌ తన శైలి చాటుకుంటాడు. పక్షిరాజు అసలు కథ తెలిసిన తర్వాత 2.0 కూడా రసకందాయంలో పడుతుంది. అప్పుడే చిట్టి 2.0 ఎంట్రీ ఇస్తాడు.

'రోబో'లో బ్యాడ్‌ చిట్టి ఎంట్రీతో రజనీకాంత్‌కి కూడా తన మార్కు స్టయిల్‌, మేనరిజమ్స్‌ చూపించే వీలు చిక్కింది. 'హుహూ' అనే అరుపు, 'నంబర్‌ వన్‌' అని చెప్పుకునే హీరోలపై విసురు... రజనీ ఫుల్‌ ఫామ్‌లో ఈ పాత్రని మరోసారి రక్తి కట్టించగా, సీక్వెల్‌లో సర్‌ప్రైజ్‌ని చివరి వరకు దాచిపెట్టాడు శంకర్‌. సర్‌ప్రైజ్‌ కాబట్టి అది తెరపై చూస్తేనే సబబు. ఫుల్‌ బాల్‌ స్టేడియంలో సెట్‌ చేసిన చివరి పోరాట ఘట్టం సుదీర్ఘంగా సాగుతుంది అయినప్పటికీ బోర్‌ అనిపించదు. నిజానికి చిట్టి 2.0 పాత్రని మరింత ముందుగా పరిచయం చేసి వుండాల్సిందని అనిపిస్తుంది.

పాటలు తీయడంలో అందె వేసిన చెయ్యి అయినా కానీ ఈసారి శంకర్‌ ఒకే పాట చిత్రీకరించి, అది కూడా కథకి అడ్డం పడకుండా చివర్లో టైటిల్స్‌కి పరిమితం చేసాడు. శంకర్‌ ఊహాశక్తికి, దానిని తెర మీదకి తెచ్చిన ప్రతిభకి మాత్రం హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. తనకి తానే ఒక స్టాండర్డ్‌ సెట్‌ చేసుకుని నిరంతరం దానిని ఇంకాస్త పెంచుకునే శంకర్‌ 2.0తో ఫిలింమేకర్‌ ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కేసారనడంలో సందేహం లేదు. సాంకేతికంగా ఉన్నతంగా రూపొందిన ఈ చిత్రానికి ఇంత పెట్టుబడి ఏమాత్రం వెనుకాడకుండా పెట్టిన నిర్మాతలు అభినందనీయులు.

నిరవ్‌ షా ఛాయాగ్రహణం, రహమాన్‌ సంగీతం, కళా దర్శకత్వం, అన్నిటికీ మించి విజువల్‌ ఎఫెక్ట్స్‌ టీమ్‌ చేసిన కృషి ఈ చిత్రాన్ని ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఒక మైల్‌స్టోన్‌గా నిలబెడతాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా ఎక్సలెంట్‌ లెవల్‌కి చేరుకోవడానికి ఇంకా సమయం వుంది కానీ అటు వైపుగా ఇదో జయంట్‌ స్టెప్‌ అనుకోవాలి. రజనీకాంత్‌ చివరి అరగంటలో తన ఫాన్స్‌కి ఫుల్‌ ఫీస్ట్‌ ఇచ్చేసారు. అక్షయ్‌కుమార్‌ ఆ పాత్రకి కావాల్సిన వెయిట్‌ తీసుకొచ్చాడు.

అమీ జాక్సన్‌కి సైడ్‌లైన్‌ అయిపోయే క్యారెక్టర్‌ కాకుండా యాక్టివ్‌ రోల్‌ ఇచ్చారు. ఆమె తనవంతు చేయగలిగింది చేసింది. నటీనటవర్గంలో ఈ ముగ్గురి పాత్రల చుట్టే కథంతా తిరుగుతుంది. సుధాన్షు పాండే త్రెడ్‌ని కేవలం సీక్వెల్‌ ఎలిమెంట్స్‌ కోసం వాడుకున్నట్టయింది. విజువల్‌గా కళ్ళు చెదిరే అనుభవాన్ని అందించడంలో 2.0 గ్రాండ్‌ సక్సెస్‌ అయినా కానీ కథని బ్యాక్‌గ్రౌండ్‌కి పరిమితం చేసేయడం వల్ల యాక్షన్‌ డామినేట్‌ చేస్తుంది. చాలా త్రెడ్స్‌ని సరిగా డీల్‌ చేయకుండా పూర్తిగా చిట్టి వర్సెస్‌ పక్షిరాజు అన్నట్టుగానే వారిద్దరి మధ్య పోరాట దృశ్యాల మీదే ఫోకస్‌ ఎక్కువయింది.

ఎంత విజువల్‌ స్పెక్టకిల్‌ అయినా కానీ ఎమోషనల్‌గా కనక్ట్‌ చేసే స్టోరీపై కూడా అంతే ఫోకస్‌ వుంటే ఈ హాలీవుడ్‌ డ్రీమ్‌కి ఇండియన్‌ హార్ట్‌ కూడా జత చేసినట్టుండేది. స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త అసంతృప్తి వుంటుందేమో కానీ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ విషయంలో లోటు చేయదని గ్యారెంటీ. కొన్ని అపశ్రుతులు మినహాయిస్తే... వెండితెరపై, అది కూడా త్రీడీలో చూస్తే కానీ తనివి తీరనంతగా 'బిగ్‌ స్క్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌'కి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌గా 2.0 నిలిచింది.

బాటమ్‌ లైన్‌: శంకర్‌ - 2.0!
- గణేష్‌ రావూరి

చంద్ర 'స్క్వేర్' తెలంగాణ గెలుపు చంద్రుడెవరు? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్