15 వేల మెజార్టీ.. ఎలా కోడెలా.? ఎలా.?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, సత్తెనపల్లి నుంచే ఇంకోసారి పోటీ చేస్తానంటున్నారు. ఈ విషయమై టీడీపీలో చాలా పెద్ద రచ్చే జరుగుతోంది. కోడెల ఓడిపోవడం ఖాయమని టీడీపీ సొంత సర్వేల్లోనే తేటతెల్లమైపోయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, తనకెంతో 'సన్నిహితుడైన' కోడెల శివప్రసాద్‌ని లోక్‌సభకు పంపాలనీ, లేదంటే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలనీ విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ, ఈక్వేషన్స్‌ కుదరడంలేదు. 

తాజాగా, కోడెల శివప్రసాద్‌ తాను సత్తెనపల్లి నుంచే పోటీ చేయబోతున్నాననీ, ఈ నెల 22న నామినేషన్‌ వేయబోతున్నాననీ ప్రకటించేసుకోవడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లోనూ 15 వేల మెజార్టీ దక్కించుకుంటానని బల్లగుద్ది మరీ చెబుతున్నారాయన. నిజంగానే కోడెలకి సత్తెనపల్లిలో అంత సీన్‌ వుందా.? అంటే, నూటికి నూరుపాళ్ళూ లేదనే చెప్పాలి. ఓ ఇంటర్వ్యూలో, 2014 ఎన్నికల కోసం తాను ఎలా 'కోట్లు ఖర్చు' చేయాల్సి వచ్చిందో చెప్పి, ఇరుక్కుపోయారు కోడెల. అంతలా కష్టపడితేనే, వెయ్యి ఓట్ల మెజార్టీ కూడా దక్కలేదు. 

నరేంద్ర మోడీ వేవ్‌, ఆంధ్రప్రదేశ్‌ విభజన తాలూకు ఎఫెక్ట్‌.. ఇలా అన్నీ కలిసొస్తేనే తొమ్మిది వందల పై చిలుకు ఓట్ల తేడాతో గట్టెక్కిన కోడెల శివప్రసాద్‌, ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న దరిమిలా.. గెలవడం అంత ఈజీ కాదు. పైగా, కోడెల కుటుంబం వ్యవహరిస్తున్న తీరుపై స్వచ్ఛందంగా జనం రోడ్ల మీదకు వచ్చి, 'కోడల అక్రమాల్ని' ఎండగడుతూ వచ్చారు నిన్న మొన్నటిదాకా. ఇదేమీ, ప్రత్యర్థులు చేయించిన రాజకీయ నిరసనల వ్యవహారం కాదు. 

మొత్తమ్మీద, టిక్కెట్టు కోసమే అధినేతను మెప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిన కోడెల శివప్రసాద్‌, తనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనంలోకి వెళ్ళి వారి మనసుల్ని గెల్చుకోగలుగుతారా.? పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సరిగ్గా స్పందించనందుకుగాను తెలంగాణలో స్పీకర్‌గా పనిచేసిన మధుసూధనాచారికి తగిలిన ఝలక్‌కి మించి కోడెల శివప్రసాద్‌కీ ఝలక్‌ తగలకుండా వుంటుందా.? వేచి చూడాల్సిందే.