15 లక్షల కోసం జగ్గారెడ్డి కక్కుర్తి

తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి అంటే అన్ని రాజకీయ పార్టీలకీ అత్యంత సన్నిహితుడే. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి.. ఆ వెంటనే కాంగ్రెస్‌ పార్టీ.. మళ్ళీ బీజేపీ.. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ.. ఇలా సాగుతోంది మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయ ప్రయాణం. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన జగ్గారెడ్డి, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో, 'జై సమైక్యాంధ్ర..' అంటూ నినదించిన విషయం అందిరకీ గుర్తుండే వుంటుంది.

తెలుగుదేశం పార్టీతో కూడా జగ్గారెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. గెటప్‌ దగ్గర్నుంచి మాటతీరు వరకు.. అన్ని విషయాల్లో జగ్గారెడ్డి తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంటారు. ఇప్పుడీ జగ్గారెడ్డి, 'మహిళల అక్రమ రవాణా' కేసులో ఇరుక్కున్నారు. అడ్డదారిలో వీసాలు సంపాదించిపెట్టి, భార్య - పిల్లల పేరుతో కొందర్ని విదేశాలకు పంపారన్నది జగ్గారెడ్డిపై మోపబడ్డ తాజా అభియోగం. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలున్నాయంటూ పోలీసులు జగ్గారెడ్డిని అరెస్ట్‌ చేసిన సంగతి తెల్సిందే.

ముందస్తు ఎన్నికల హీట్‌ తెలంగాణలో పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో జగ్గారెడ్డి అరెస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి చాలా పెద్ద షాక్‌. 'టైమ్‌ చూసి అధికార పార్టీ జగ్గారెడ్డికి షాక్‌ ఇచ్చింది..' అనే ప్రచారం ఓ వైపు జరుగుతోంటే, 'జగ్గారెడ్డికి రైట్‌ టైమ్‌లోనే తగాల్సిన షాక్‌ తగిలింది..' అని ఇంకొందరు అభిప్రాయపడ్తున్నారు. జగ్గారెడ్డి దుందుడుకు వైఖరి అలాంటిది మరి.

అన్నట్టు మొన్నామధ్య జగ్గారెడ్డి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో భేటీ అవడం, జనసేనలో చేరేందుకు ఆయన ప్రయత్నించడం అందరికీ గుర్తుండే వుంటుంది. జగ్గారెడ్డి, పవన్‌కళ్యాణ్‌ని పొగడ్తలతో ముంచెత్తేయడం.. జగ్గారెడ్డిని పవన్‌ ప్రశంసించేయడం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆ సంగతి పక్కన పెడితే, సంగారెడ్డిలో జగ్గారెడ్డికి రాజకీయంగా ఎదురే లేదనీ, ఈ కారణంగానే జగ్గారెడ్డిని కేసీఆర్‌ ప్రభుత్వం టార్గెట్‌ చేసిందన్నది కాంగ్రెస్‌ ఆరోపణ.

అయితే, కాంగ్రెస్‌ హయాంలోనూ జగ్గారెడ్డిపై కేసులు నమోదయ్యాయని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. 'దేశద్రోహి జగ్గారెడ్డి..' అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు విరుచుకుపడ్తున్నారు. ఇదే జగ్గారెడ్డి ఒకప్పుడు టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పట్లో జగ్గారెడ్డిని టీఆర్‌ఎస్‌ తన భుజాన మోసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

ఏదిఏమైనా, జగ్గారెడ్డి రాజకీయాల్లో 'అందరివాడు'. అదే సమయంలో, అన్ని రాజకీయ పార్టీలకీ కంటగింపుగా మారినవాడు. కేవలం 15 లక్షల కోసం జగ్గారెడ్డి కక్కుర్తిపడ్డట్టు పోలీసు కథనాల్ని బట్టి అర్థమవుతోంది. అది నిజమేనా.? జగ్గారెడ్డి మాత్రం, ఇదంతా తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని అంటున్నారు. రాజకీయాల్లో ఈ తరహా బుకాయింపులు మామూలే.. కుట్రపూరిత కేసులూ మామూలే. నిజమేంటో, ఆ పైవాడికే ఎరుక.