చంద్రబాబును పట్టిస్తే లక్ష రూపాయలిస్తా

లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట రామ్ గోపాల్ వర్మ అప్పుడెప్పుడో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్ ను చూపిస్తానని అప్పట్లో ప్రకటించిన వర్మ, ఇప్పుడా ప్రాజెక్టుకు బూజు దులిపాడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ వేడిని క్యాష్ చేసుకుంటూ, అదే ఊపులో లక్ష్మీస్ ఎన్టీఆర్ ను కూడా విడుదల చేస్తానని అంటున్నాడు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మకు చంద్రబాబు దొరికాడు.

ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రను రానా చేస్తున్నాడు. అదే రానాను లక్ష్మీస్ ఎన్టీఆర్ లో రిపీట్ చేసేంత డబ్బు, టైమ్ వర్మ వద్ద లేదు. అందుకే చంద్రబాబు పాత్రధారి కోసం ఓ రేంజ్ లో వెదుకున్న వర్మకు అనుకోకుండా ఓ వీడియో దొరికింది.

చాలా రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూశారా. ఇందులో అచ్చం చంద్రబాబులా కనిపిస్తున్న వ్యక్తిని చూశారా.. అలా అలా వైరల్ అవుతూ వర్మ దృష్టిలో పడింది ఈ వీడియో. అంతే వెంటనే అతడ్ని తన సినిమాలో చంద్రబాబు పాత్ర కోసం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కానీ అతడెవరో వర్మకు తెలియదు కదా. అందుకే వివరాలు చెబితే లక్ష ఇస్తానని ప్రకటించాడు. 

ఏదో క్యాంటీన్ లో సర్వర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఇతడు. అచ్చం చంద్రబాబులానే ఉన్నాడు. ఇతడి ఆచూకి ఎవరు ముందు చెబితే వారికి లక్ష ఇస్తానని ప్రకటించిన వర్మ, వీడియోలో ఉన్న వ్యక్తి కాకపోయినా, కనీసం చంద్రబాబులా కనిపించే మరో వ్యక్తిని చూపించినా లక్ష గ్యారెంటీ అంటూ ప్రకటించాడు. 

ఎలాగోలా వర్మ, ఈ నకిలీ చంద్రబాబును పట్టుకోవడం ఖాయం. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించడం ఖాయం. అదే కనుక జరిగితే ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు (రానా) కంటే, లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబే చాలా రియలిస్టిక్ గా కనిపిస్తాడు. సినిమా రిజల్ట్ సంగతెలా ఉన్నా చంద్రబాబు విషయంలో వర్మ హిట్ కొట్టడం గ్యారెంటీ. 

Show comments