బౌండ్ స్క్రిప్ట్ లేకుంటే సినిమా చేయను-మహేష్

జీవితమే కాదు సినిమాలు కూడా పాఠాలు నేర్పుతాయి. సూపర్ స్టార్ మహేష్ కు బ్రహ్మత్సవం, స్పైడర్ సినిమాలు అలాంటి పాఠాన్నే నేర్పాయంట. అందుకే ఆయన ఇప్పుడు బౌండ్ స్క్రిప్ట్ వుంటే తప్ప సినిమా చేయను అనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంతటి డైరక్టర్ అయినా బౌండ్ స్క్రిప్ట్ వుండాల్సిందే. మహేష్ నటించిన మహర్షి సినిమా విడుదల సందర్భంగా మీడియా మీట్ ఏర్పాటు చేసారు. ఆ మీడియా మీట్ ముచ్చట్లు ఇవి.

మహర్షి సినిమా చేయడానికి మిమ్మల్ని డ్రయివ్ చేసిన పాయింట్?
ముమ్మాటికీ కథే. చాలా విస్తృతమైన కథ. కేవలం మూడు షేడ్స్ వున్నాయనే కాదు, సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారు. 

సినిమా ఏ షేడ్ చేయడానికి కాస్త కష్టం అనిపించింది.
కష్టం అని కాదు కానీ, స్టూడెంట్ ఎపిసోడ్ చేయాలనుకున్నపుడు కాస్త ఆలోచించాల్సి వచ్చింది. 

మీరు అదే సులువుగా చేసి వుంటారనుకున్నాం
ఎలా? ఆ దశదాటి ఇరవై ఏళ్లు ముందుకు వచ్చేసిన తరువాత మళ్లీ అలా చేయడం, పైగా చేసి ఒప్పించడం. ఇదే డిస్కస్ చేసాం. ఈ ఎపిసోడ్ ఒప్పించగలిగితే మనం పాస్ అని.

శ్రీమంతుడులో ఓ చిన్న స్టూడెంట్ బ్లాక్ వుంది కదా?
అది జస్ట్ చిన్న బ్లాక్. పైగా అది స్టూడెంట్ ఎపిసోడ్ అనుకోవడానికి లేదు. కానీ ఈ సినిమాలో అలా కాదు. పూర్తిగా, పక్కాగా స్టూడెంట్ల వ్యవహారం.

త్రీ ఇడియట్ షేడ్స్ ఏమైనా ఈ విషయంలో కనిపిస్తాయా?
అబ్బే.. అస్సలు దానికి ఈ ఎపిసోడ్ కు సంబంధం లేదు.

ఓ సెల్ఫిష్, కాస్త యారోగెంట్ షేడ్స్ వున్న పాత్ర ఏ విధంగా అనిపించింది.
కథ చెప్పినపుడు చాలా ఎగ్జయిటింగ్ గా అనిపించింది. జర్నీ ఆఫ్ రుషి అన్న కాన్సెప్ట్ లో అది ఒకభాగం. 

సక్సెస్ కోసం పరితపించడం, విపరీతంగా ప్రయత్నించడం.. మీకు దగ్గరగా వున్న పాత్ర అనిపించిందా?
నాకే కాదు. ఎవరికైనా.. ఎవరైనా సక్సెస్ కోసం ప్రయత్నించాల్సిదే కదా?

ఈ సినిమాలో మీరు మరింత అందంగా కనిపించారని ట్రయిలర్ చూపించింది. ఏమిటి సీక్రెట్?
థాంక్స్. అండ్ థాంక్స్ టు మై డిఓపి. ఆ పాత్రలు మూడింటికి కాస్త వేరియేషన్ వుండాలని ముందుగానే అనుకున్నాం. ఆ విధంగానే మూడు డిజైన్ చేసాం. అందుకే మీకు అలా అనిపించి వుంటుంది.

ఈ సినిమా కోసం వంశీ పైడిపల్లి వెయిట్ చేయడం, కొంతమంది వెయిట్ చేయడం లేదని కామెంట్ మీరు చేయడం?
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను యాక్ట్యువల్ గా ఆ రోజు స్టేజ్ మీద చెప్పిన మాటలు వంశీని పొగుడుతూ చెప్పినవి. కానీ అందరూ నేనేనో సుకుమార్ ను విమర్శిస్తూ చెప్పినట్లు రాసేసారు. నిజానికి సుకుమార్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు మంచి స్నేహితుడు. నా కొడుకును స్క్రీన్ కు పరిచయం చేసాడు. వన్ లాంటి డిఫరెంట్ మూవీ అందించాడు. 

మరి ఆయనతో క్రియేటివ్ డిఫరెన్స్ లు, సినిమా చేయకపోవడం?
చేయకపోవడం ఏమీలేదు. వరుసగా మెసేజ్ సినిమాలు చేస్తూవుంటే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ ఓ బ్రేక్ లా వచ్చింది. బాగుంది. అందుకే అది చేసాక చేద్దాం అన్నాను. ఈలోగా తను కూడా ఓ సినిమా చేసుకుని వస్తా అన్నాడు. దట్సిట్. 

అంటే కచ్చితంగా మీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వుంటుంది?
యా.. వుంటుంది.

ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ లో ఓకె చేయడంలో మీ ప్రాధాన్యత?
బౌండ్ స్క్రిప్ట్. కచ్చితంగా బౌండ్ స్క్రిప్ట్ వుండాల్సిందే. లేకుంటే సెట్ మీదకు వెళ్లను. ఇరవై నిమిషాల లైన్ చెప్పి, సెట్ మీదకు వెళ్లిపోయి, సీన్స్ రెడీ కాకుంటే షూటింగ్ వాయిదా వేసి, అప్పటికప్పుడు ఇంప్రూవ్ మెంట్ చేస్తూ, ఇలాంటి వాటి వల్ల నష్టం తప్పలేదు.

ఇది స్పైడర్ నేర్పిన పాఠమా?
స్పైడర్ అనే కాదు, బ్రహ్మోత్సవం కూడా. ఇరవై నిమిషాలు విన్నపుడు చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ దాన్ని ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్ గా మార్చడంలో తేడా వస్తోంది. అందుకే ఇప్పుడు బౌండ్ స్క్రిప్ట్ వుంటే తప్ప సినిమాలు చేయను అని డిసైడ్ అయిపోయాను.

ఎప్పటి నుంచో మీ అభిమానులు ఎదురుచూస్తున్న త్రివిక్రమ్, రాజమౌళి, బోయపాటి లాంటి డైరక్టర్లతో మీ సినిమాలు.
రాజమౌళిగారితో వుంటుంది. కెఎల్ నారాయణ నిర్మాత. రాజమౌళిగారి కమిట్ మెంట్లు కాగానే వుంటుంది. త్రివిక్రమ్ గారితో కూడా ఈ మధ్య డిస్కస్ చేసాను.

వంశీ పైడిపల్లితో మీ కాంబినేషన్.
ఈ సినిమాకు పేరు వచ్చేది ఆయనకే. ముమ్మాటికి ఇది వంశీ పైడిపల్లి సినిమా. ఆయన చాలామంది పేరు వస్తుంది.

శ్రీమంతుడులో శృతిహాసన్ చివరిదాకా వుంటుంది. మీ ఆశయంలో ఆమె పార్ట్ కూడా వుంటుంది. మరి ఈ సినిమాలో?
అలా వుండదు. ఇది వేరే. 

అంటే చివరిదాకా హీరోయిన్ పాత్ర వుంటుందా?
సినిమా చూస్తారుగా తొమ్మిదిన.

నాన్నగారు సినిమా చూస్తున్నారా?
తొమ్మిదిన చూస్తారు. నేను కూడా దాని కోసం వెయిటింగ్. ఆయన చూసి చెపితే అదో ఆనందం.

మీరు నిర్మించిన ఎఎమ్ బి మాల్ సిటీకే ఓ ఐకానిక్ అయిపోయింది. మీకు ఎలా వుంది ?
అసలు ఆ థాట్ వచ్చినపుడే నేను సునీల్ నారంగ్ కు ఒకటే చెప్పాను ఇండియాలో ది బెస్ట్ అన్నట్లు వుండాలి. ఎవ్వీర్రీ థింగ్ ది బెస్ట్ అన్నట్లు వుండాలి అని. 

అందులో మీ ఇన్ పుట్స్, మీ శ్రీమతిగారి ఇన్ పుట్స్.
అస్సలు లేవు. మేం కలిసినపుడల్లా ఒక్కటే చెప్పేవాడిని..ది బెస్ట్..ది బెస్ట్.. వాళ్లు కూడా పూర్తి చేసాక, ఇదిగో చూడండి అని చూపించారు.

సినిమా బడ్జెట్ పెరిగిపోవడంపై మీ కంట్రోలు ఏమైనా?
అదే నాకు ఒక్కోసారి అర్థంకావడం లేదు. ఈ సినిమా వరకు బడ్జెట్ పెరిగింది అంటే సబ్జెక్ట్ అలాంటిది. అమెరికాలో బిలియనీర్ అంటే ఆ రేంజ్ లో చూపించాలి. విలేజ్ అనుకుంటాం కానీ, వేలాది మంది జూనియర్ ఆర్టిస్ట్ లు. ఖర్చు చాలా అయింది.

సోలో హీరోగా, సింగిల్ లాంగ్వేజ్ లో 150 కోట్లకు పైగా మార్కెట్ అంటే కాస్త ప్రౌడ్ గా వుందా మీకు?
ముందు టెన్షన్ గా వుంది. ఎందుకంటే 110-120 కోట్ల థియేటర్ రైట్స్ అంటే 130-140 కోట్ల వసూళ్లు వుండాలి. అంటే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాల్సిందే. అలా ఊహించుకున్నపుడు కాస్త టెన్షన్ వుంటుంది.

సాధారణంగా హీరోలు సినిమా విడుదల ముందు టెన్షన్ తో వుంటారు. మీరు లీజర్ గా వెకేషన్ కు వెళ్లారు.
నాకు టెన్షన్ వుంది. కానీ టీమ్ మీద నమ్మకం వుంది. ఇక్కడ వుండి వాళ్లను డిస్ట్రబ్ చేయడం కన్నా, గ్యాప్ దొరికింది అని వెకేషన్ కు వెళ్లాను. అయినా అక్కడి నుంచి ఫోన్ లు చేసి అడుగుతూనే వున్నాను.

-విఎస్ఎన్ మూర్తి

మహేష్ బాబు ఫొటోస్ కోసం క్లిక్ చేయండి