సినిమా రివ్యూ: సాక్ష్యం

రివ్యూ: సాక్ష్యం
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: అభిషేక్‌ పిక్చర్స్‌
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, జగపతిబాబు, పూజ హెగ్డే, అశుతోష్‌ రాణా, శరత్‌ కుమార్‌, రవికిషన్‌, రావు                   రమేష్‌, వెన్నెల కిషోర్‌, మధు గురుస్వామి, బ్రహ్మాజీ, జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌ తదితరులు.
మాటలు: సాయి మాధవ్‌ బుర్రా
సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: ఆర్ధర్‌ ఏ. విల్సన్‌
నిర్మాత: అభిషేక్‌ నామా
కథ, కథనం, దర్శకత్వం: శ్రీవాస్‌
విడుదల తేదీ: జులై 27, 2018

వీడియో గేమ్‌ కోసం ఏదైనా ఎక్సయిటింగ్‌ ఐడియా కోసం చూస్తోన్న హీరో దగ్గరికో వ్యక్తి వచ్చి ఓ ఐడియా చెప్తాడు. 'చిన్నప్పుడే అతి కిరాతకంగా కుటుంబాన్ని రౌడీల చేతుల్లో కోల్పోయిన హీరో పెరిగి పెద్దయి వారిని చంపేస్తాడు' అని తన ఐడియా చెప్పగానే... 'రొటీన్‌ రివెంజ్‌' అంటూ తీసి పారేస్తారు. అప్పుడతను 'ఇది ప్రతీకారం కాదు... ప్రతిచర్య. మనంచేసే తప్పులకి కర్మసాక్షి అయిన ప్రకృతి పంచభూతాల ద్వారా చేసే ప్రతిచర్య. ఎందుకు చంపుతున్నాడో అతనికి తెలియదు. ఇతనెవరనేది వాళ్లకీ తెలియదు' అంటూ కథలోని అసలు గుట్టుచెప్తాడు. 'వావ్‌... అద్భుతం. వాట్‌ ఏన్‌ ఐడియా' అంటోన్న హీరో అతని స్నేహితుల రియాక్షన్స్‌ చూస్తే... సాక్ష్యం కథ చెప్పడానికి శ్రీవాస్‌ వెళ్లినప్పుడు అక్కడి సినారియో ఇదేనేమో అనిపిస్తుంది.

సో... ఇది రొటీన్‌ రివెంజ్‌ సినిమా కాదు... నేచర్స్‌ రియాక్షన్‌ అనేది శ్రీవాస్‌ ఫీలింగ్‌. అతను దీనిని ఎలా పిలుచుకున్నా కానీ అసలు పాయింట్‌ విషయానికి వస్తే ఇదో రివెంజ్‌ ప్లాటే. కాకపోతే రెగ్యులర్‌గా హీరో పెరిగి పెద్దయి తనకి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని ప్రతీకారానికి దిగకుండా, పంచభూతాలే అతడితో ప్రతీకారం తీర్చుకునేలా చేయడం ఇందులోని వెరైటీ కాన్సెప్ట్‌. ఆలోచనగా బాగానే వుంది కానీ దీనిని ఆసక్తికరమైన సినిమాగా మలిచేందుకు కావాల్సిన సన్నివేశాలు, బిగి సడలని కథనం కొరవడ్డాయి. ఓ మంచి ఐడియా ఒక ఆసక్తి రేకెత్తించే ట్రెయిలర్‌ కాగలదేమో కానీ, ఆకట్టుకునే సినిమా కాలేదని ఇది సాక్ష్యమిస్తుంది. మూడుగంటల సినిమా కావాలంటే ఆ ఐడియాని అద్భుతంగా ప్రెజెంట్‌ చేసే విజువల్‌ సెన్స్‌ వుండాలి. అంతకుమించి తెరపై జరిగేదానినుంచి కళ్ళు తిప్పనివ్వనంత గొప్పగా ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దాలి.

పంచభూతాలు ప్రతిచర్యకి పాల్పడే సన్నివేశాలే మిగతా సినిమాని భరించేట్టు చేస్తాయనే ధోరణి మిగతా సన్నివేశాల రూపకల్పనలో కనిపించింది. నాలుగైదు థ్రిల్లింగ్‌ ఎపిసోడ్స్‌ పెట్టి మధ్యలో టైమ్‌పాస్‌ స్టఫ్‌తో బ్లాక్‌బస్టర్స్‌ సాధించే రాజమౌళి, బోయపాటి తరహా ఫార్ములాని శ్రీవాస్‌ ఫాలో అయినట్టు అనిపించింది. కాకపోతే ఆ నాలుగైదు ఎపిసోడ్లని కూడా ఎఫెక్టివ్‌గా తీయకపోగా, మిగిలిన భాగాన్ని కూడా ఏమాత్రం ఆసక్తి కలిగించని బోరింగ్‌ ఎపిసోడ్స్‌తో నింపేసాడు. ప్రతీకారం దిశగా కథానాయకుడిని ప్రకృతి నడిపించే విధానం తెరపై చూస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించాలి. కానీ చాలా సందర్భాల్లో అది హాస్యాస్పదంగా తయారైంది.

ఉదాహరణకి ఓ సన్నివేశంలో విలన్స్‌ ఒకవైపు వెళితే హీరో మరోవైపు వెళ్లిపోతాడు. అతని ముందు వెళుతోన్న కొబ్బరికాయల లోడు తీసుకెళుతోన్న లారీ టైరు పగిలి రోడ్డుకి అడ్డంగా కొబ్బరికాయలు పడిపోతే అతను వెనక్కి తిరిగి రౌడీలు వెళ్లిన రూట్లోకి వెళతాడు. ఇది ప్రకృతి చర్యగా అనిపించాలనేది దర్శకుడి ఉద్దేశం. కానీ తెరపై చూస్తోంటే... 'ఇంతోటి దానికి ఇదంతా దేనికి ఆ రూట్లో ముందే పంపిస్తే పోయేదిగా అనిపిస్తుంది' చూసేవారికి. వాయువు సాయంతో తన మొదటి శత్రువుని వధించే సన్నివేశంలో వెనక ఆ వాయుగుండం అలా ఇలా తిరిగేస్తూ వుంటుంది... గ్రాఫిక్స్‌ని ఆడియన్స్‌ గుర్తిస్తారో లేదో అన్నట్టుగా. సదరు సన్నివేశాలు ఎంత థ్రిల్లింగ్‌గా వుండాలో అంత నీరసంగా, పైపెచ్చు కామెడీగా అనిపిస్తాయి.

ఇక ఈ పంచభూతాలు చేసేది హీరో గుర్తిస్తూ దానిగురించి వర్రీ అవడానికా అంటూ వీడియో గేమ్‌ రూపంలో ఒక సబ్‌ప్లాట్‌ నడుస్తుంటుంది. సదరు వీడియో గేమ్‌ డిజైనర్‌ పాత్రని గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌తో చేయించాలనేది ఎవరి ఐడియానో కానీ దారుణంగా బ్యాక్‌ఫైర్‌ అయింది. మంచి ఎక్స్‌ప్రెసివ్‌ యాక్టర్‌ చేసినట్టయితే ఈ సీన్లు నిజంగానే ఉత్కంఠ రేపేవేమో కానీ అనంత శ్రీరామ్‌ కారణంగా అవి కూడా చాలావరకు హాస్యాస్పదంగానే మారాయి. ద్వితియార్ధం కాస్త బెటర్‌ నోట్‌లో స్టార్ట్‌ అయిన తీరుచూసి దర్శకుడు గాడిన పడ్డాడనిపిస్తుంది. వారణాసి ఎపిసోడ్‌ ఇంటర్వెల్‌ సీన్‌ కంటే చాలారెట్లు బెటర్‌గా తెరకెక్కింది. అయితే మరోసారి దర్శకుడికి ఆ గ్రాఫ్‌ మెయింటైన్‌ చేయడంరాలేదు. యాక్షన్‌ నుంచి విరామం తీసుకుని ఫ్యామిలీ సీన్లు, సాంగ్‌ పెట్టుకోవడంతో బిల్డ్‌ అయిన టెంపో కూడా పడిపోతుంది. ప్రకృతి సాయంతో వరుసగా అందరినీ చంపుతోన్న హీరో ఇక అసలు విలన్‌ జగపతిబాబుని ఎలా చంపుతాడనేది ఆసక్తి రేకెత్తించే అంశమే అయినా పతాక సన్నివేశాలలో దర్శకుడి సృజన కొరవడడంతో ఆ సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి.

హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ మెరుగవుతున్నాడు కానీ ఇంకా తన వాచకంపై, ఎమోషనల్‌ సన్నివేశాల్లో హావభావాలపై ఫోకస్‌ పెట్టాలి. పూజహెగ్డే నటిగా ఇంప్రెస్‌ చేయకపోయినా, తన అందంతో ఆకట్టుకుంటుంది. జగపతిబాబుతో డిఫరెంట్‌ విలనీ ట్రై చేసారు కానీ కన్సిస్టెన్సీ కొరవడింది. కాస్త యంగ్‌గా వున్నపుడు జగపతిబాబు చూపించిన క్రూరత్వం ఆ తర్వాత మిస్‌ అయింది. స్టార్‌ కాస్ట్‌ ఘనంగా వుంది కానీ ఎవరికీ చెప్పుకోతగ్గ పాత్రలు దక్కలేదు. శివమ్‌ శివమ్‌ అనే బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌ ఒక్కటీ పలుచోట్ల సన్నివేశాలని ఎలివేట్‌ చేసింది. సాయిమాధవ్‌ బుర్రా రాసిన సంభాషణలు కొన్ని సందర్భాల్లో చాలా ఎఫెక్టివ్‌గా వున్నాయి. నిర్మాత ఏమాత్రం రాజీపడకుండా భారీ స్థాయిలో ఖర్చుపెట్టారు. నిర్మాణ విలువలు ఏ భారీ చిత్రానికీ తీసిపోని స్థాయిలో వున్నాయి. అన్ని వనరులూ ఇచ్చినా కానీ దర్శకుడు శ్రీవాస్‌ తన ఆలోచనలని తెరమీదకి మెప్పించే రీతిన తీసుకుని రాలేకపోయాడు. అనేకచోట్ల ఇంత గ్రాండ్‌ సినిమాని హ్యాండిల్‌ చేసే విజువల్‌ సెన్స్‌ కొరవడిన భావన కలుగుతుంది.

రొటీన్‌కి భిన్నంగా ఏదో చేయాలనే తపన వున్నా కానీ ఆ ఆలోచనలకి ఆకట్టుకునే తెరరూపం ఇవ్వడంలో మాత్రం దర్శకుడి వైఫల్యం సాక్ష్యం చిత్రాన్ని బలహీనంగా మార్చాయి. ఈ ఐడియాతో ఒక కమర్షియల్‌ చిత్రాన్ని రూపొందించేందుకు కావాల్సిన మిశ్రమం కూడా పలుచబడింది. ప్రేమ సన్నివేశాలని, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని సరిగా మిక్స్‌ చేయలేకపోయారు. పాటలకి ఎక్కడ బ్రేక్‌ తీసుకోవాలనేది కూడా సరిగా ప్లాన్‌ చేసుకోకపోవడంతో ఎక్కడా టెంపో మెయింటైన్‌ అవలేదు. కీలకమైన పంచభూతాలకి సంబంధించిన సన్నివేశాలని అయినా ఉత్కంఠభరితంగా రూపొందించినట్టయితే సాక్ష్యం పాస్‌ అయిపోయేది. కానీ ఆ సన్నివేశాలు కూడా అపరిపక్వంగా తెరకెక్కడం కారణంగా గ్రాండ్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ మినహా మరేవీ హైలైట్‌ కాలేకపోయాయి.

బాటమ్‌ లైన్‌: బలహీన 'సాక్ష్యం'!
-గణేష్‌ రావూరి

Show comments