సినిమా రివ్యూ: విజేత

రివ్యూ: విజేత
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: వారాహి చలనచిత్రం
తారాగణం: కళ్యాణ్‌ దేవ్‌, మురళి శర్మ, మాళవిక నాయర్‌, తనికెళ్ళ భరణి, జయప్రకాష్‌, పవిత్ర, సుదర్శన్‌, కిరీటి తదితరులు
సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: కె.కె. సెంథిల్‌ కుమార్‌
నిర్మాత: రజని కొర్రపాటి
రచన, దర్శకత్వం: రాకేష్‌ శశి
విడుదల తేదీ: జులై 12, 2018

చిరంజీవి కుటుంబం నుంచి కొత్త హీరో వచ్చాడు. కొత్తల్లుడు కూడా హీరో అయిపోయాడు. చూడ్డానికి బాగానే వున్నాడు కానీ హీరోగా తొలి అడుగు వేయడానికి మరీ సేఫ్‌గా సక్సెస్‌ఫుల్‌ ఫార్ములాని నమ్ముకుని ఎప్పుడో ఇరవై, ముప్పయ్యేళ్ల క్రితం రావాల్సిన కథతో 'విజేత' కావాలని చూసాడు. సినిమాలో ప్రతి అంశం, సన్నివేశం ఎక్కడో చూసేసినదే అనిపించే ఈ చిత్రంలో ఎంత కొత్త హీరో వున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. బాధ్యత లేని కొడుకులో పరివర్తన వచ్చి తన తండ్రిని 'విజేత'గా నిలబెడతాడు. సింపుల్‌గా ఇదీ కథ. ఇప్పటికే వెండితెరపై వందల సార్లు వెలిసి, వెలిసి వెలిసిపోయిన ఈ కథని కనీసం జనరంజకంగా మలిచేందుకు అయినా కృషి జరగలేదు. అన్ని కమర్షియల్‌ అంశాలూ కవర్‌ చేయాలనే తాపత్రయం అయితే కనిపిస్తుంది కానీ వాటిని ఆకట్టుకునేలా మలిచే ప్రతిభే కరవైంది.

బాధ్యత లేకుండా బలాదూర్‌గా తిరిగే యువకుడి కథ చాలా పాతదే అయినా కానీ నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కూడా మలిచే అవకాశముంది. ఉదాహరణకి ధనుష్‌ నటించిన 'రఘువరన్‌ బీటెక్‌' చిత్రాన్నే తీసుకుంటే సిమిలర్‌ సెటప్‌తో చాలా ఎంటర్‌టైనింగ్‌ సినిమా అందించారు. సహజత్వంతో కూడిన సన్నివేశాలు, పాత్రలు, సందర్భాలు వున్నట్టయితే సగటు మిడిల్‌ క్లాస్‌ తండ్రీ కొడుకులు ఇందులోని మురళి శర్మ, కళ్యాణ్‌ దేవ్‌ పాత్రల్లో ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. కానీ ప్రతి సన్నివేశం 'యాక్షన్‌-కట్‌' ఇన్‌స్ట్రక్షన్స్‌కి అనుగుణంగా యాంత్రికంగా నటీనటులు నటిస్తోన్న భావనే కలిగిస్తుంది కానీ ఏ దశలోను సహజంగా అనిపించదు. ఇందులో హీరో సర్‌ప్రైజ్‌ ప్లానర్‌. కాకపోతే ఈ కథనంలో కనీసం ఒక్క సర్‌ప్రైజ్‌ కూడా లేకుండా అంతా ఊహించినట్టే సాగిపోతూంటుంది.

పతాక సన్నివేశంలోని ఎమోషన్స్‌కి కూడా ముందే ప్లాంటింగ్‌ వేసేసి వుండడం వల్ల అవి కూడా ఊహలకి తగ్గట్టే కనిపిస్తాయి తప్ప ఎలాంటి హై ఇవ్వవు. మొదలైన దగ్గర్నుంచి ఫ్లాట్‌గా సాగిపోయే ఈ చిత్రంలో హాయిగా నవ్వించే సీన్‌ కానీ, హృదయానికి హత్తుకునేలా కదిలించే సందర్భం కానీ లేదు. ప్రథమార్ధంలో వినోదానికి స్కోప్‌ వున్న సెటప్‌ వున్నప్పటికీ రాసుకున్న నిస్సారమైన సన్నివేశాల వల్ల నీరసం వస్తుందే తప్ప కాలక్షేపమవదు. అటు స్నేహితులతో హీరో కొట్టే బాతాఖానీ కానీ, ఇటు హీరోయిన్‌ వెంట పడుతూ నడిపించే ప్రేమ కహానీ కానీ ఆకట్టుకోవు. సోకాల్డ్‌ ఫ్యామిలీ సీన్లు కూడా సీదాసాదాగా అనిపిస్తూ కేవలం రన్‌ టైమ్‌ నింపడానికి వేసుకున్న సీన్లలానే వుంటాయి తప్ప ఎఫెక్టివ్‌గా వుండవు.

అందరూ ఊహించిన ఘట్టమే అయినా... హీరోలో పరివర్తన వచ్చి బాధ్యతగా మసలుకునే సందర్భంలో కూడా వుండాల్సినంత 'జోల్ట్‌' లేదు. బాధ్యత తెలుసుకుని అతనేదైనా గొప్ప పనులు చేసేస్తుంటాడా అంటే అదీ లేదు. అది కూడా డ్రామా సెటప్పే. ఒక సుదీర్ఘమైన 'సర్‌ప్రైజ్‌' తాలూకు ఆఫ్టర్‌ ఎఫెక్ట్‌గా అతని చెల్లికి మంచి సంబంధం కుదురుతుంది. ఇదీ చాలా చిత్రాల్లో చూసేసిన విషయమే కనుక దాని వల్ల కూడా మురళి శర్మ ఫీలవ్వాలే తప్ప ఎమోషన్‌ ఏమీ పండదు. ముందే చెప్పినట్టు పతాక సన్నివేశాన్ని ఊహించడం అంత కష్టమేం కాదు. ఫార్ములా సినిమాలని ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరిస్తారనే ధీమాతో తీసేసిన ఈ చిత్రంలో ఏ ఒక్క అంశాన్ని జనరంజకంగా మలచుకోలేకపోయారు.

సెంథిల్‌ సినిమాటోగ్రఫీ ఒక్కటీ పక్కన పెడితే సాంకేతికంగా ఆహా అనిపించే మరో అంశమేమీ లేదు. పాటలు ఏవో వచ్చి పోతుంటాయి తప్ప గుర్తుండే స్టఫ్‌ కాదు. నటుడిగా కళ్యాణ్‌దేవ్‌ చాలా దూరం ప్రయాణించాలి. రూపం, ఆకారం వరకు బాగున్నా కానీ ఇలాంటి క్యాజువల్‌ క్యారెక్టర్‌ని ఐడెంటిఫై చేసుకునేలా చేసే టాలెంట్‌ అయితే ప్రస్తుతానికి లేదనే అనిపించింది. మురళి శర్మ చేసినది రొటీన్‌ పాత్రే అయినా కానీ తన ప్రతిభతో ఈ పాత్రని కూడా మెప్పించేలా చేసాడు. క్లయిమాక్స్‌ సీన్‌లో ఎమోషన్స్‌ బాగా పండించాడు. మాళవిక శర్మ చేయడానికేమీ లేదు. మిగిలిన నటీనటుల్లో ఎవరికీ చెప్పుకోతగ్గ పాత్రలు దక్కలేదు.

షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌లలో కూడా ఎంతో కొంత వైవిధ్యాన్ని అందించడానికి, కాస్తో కూస్తో నవ్వించడానికి తపన పడుతోన్న ఈ రోజుల్లో ఇలా ఎలాంటి కొత్తదనం లేని, వినోదం అస్సలే లేని చిత్రంతో విజేతలవ్వాలని ఆశించడం అత్యాశే అవుతుంది.
బాటమ్‌ లైన్‌: పరాజిత!
- గణేష్‌ రావూరి

Show comments