ఎమ్బీయస్‌: అసాం పౌరసత్వ జాబితా వాయిదా

ఎవరు అసాం పౌరులో, ఎవరు కాదో తేల్చే నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సి) తుది జాబితా సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం జూన్‌ 30కల్లా వెలువడాలి. కానీ దాని కారణంగా బిజెపికి, దాని మిత్రపక్షాలకు పేచీలు వచ్చేట్లా ఉండడంతో ఎందుకైనా మంచిదని ఒక నెల్లాళ్లపాటు వివాదాన్ని వాయిదా వేశారు. ఎన్‌ఆర్‌సి కోఆర్డినేటర్‌ ప్రతీక్‌ హజేలా 'రాష్ట్రంలోని కచార్‌, కరీమ్‌గంజ్‌, హైలాకండి వగైరా జిల్లాలలో వరదలు రావడం చేత జూన్‌ 30కి జాబితా తయారు చేయలేమని, యింకో నెల గడువు కావాలని' సుప్రీం కోర్టుకి విన్నవించుకోవడంతో 'సరే జులై 30కి తయారు చేయండి' అంది సుప్రీం కోర్టు. ఈ వివాదం యొక్క లోతు, సంక్లిష్టత చూస్తే ఆ నెల గడువైనా చాలుతుందా, అప్పుడు మరో సాకు వెతుకుతారా అనే సందేహం కలగక మానదు.

అసాంలో పౌరసత్వ సమస్య యీనాటిది కాదు. ఈ విషయంపై ఆల్‌ అసాం స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆసు) ఐదేళ్లపాటు అసాంను స్తంభింపచేసింది. కేంద్రాన్ని దిగి వచ్చేట్లా చేసి, 1985లో ఒప్పందం చేసుకుంది. అదే అంశంపై అసాం గణ పరిషద్‌ (ఎజిపి) పార్టీగా ఏర్పడి ఆ డిసెంబరులో ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 33 ఏళ్లయినా యిప్పటికీ సమస్య తీరకపోగా మరింత జటిలమైంది. ఈనాడు అసాం జనాభాలో అసామీల జనాభా కేవలం మూడో వంతు మాత్రమే. అంటే అక్రమ వలసదారులు అంత దారుణంగా అసాంను ముంచెత్తారన్నమాట. టీ తోటల్లో పని చేయించడానికి బ్రిటిషువారు 19వ శతాబ్దంలోనే మైదాన ప్రాంతాల నుంచి హిందువులను అసాంకు ప్రజలను తీసుకుని వచ్చారు. బీడు భూముల్లో వ్యవసాయం చేయించడానికి తూర్పు బెంగాల్‌లోని ముస్లిము రైతులను తీసుకుని వచ్చారు. వీరితో అసామీయులకు పేచీ రాలేదు. కానీ దక్షిణ అసాంలో ఎప్పణ్నుంచో స్థిరపడిన బెంగాలీలు అసామీయులతో కలవకుండా విడిగా ఉంటూ తమ బెంగాలీ గుర్తింపును అలాగే ఉంచుకున్నారు. అది అసామీలకు అంతగా రుచించే విషయం కాదు.

దేశవిభజన సమయంలో, తూర్పు బెంగాల్‌ నుంచి అనేకమంది హిందువులు అసాంకు వచ్చి స్థిరపడ్డారు. ఇక 1971లో బంగ్లాదేశ్‌ విమోచన సమయంలో కోటి మంది పారిపోయి శరణార్థుల్లా అసాంకు వచ్చారు. వారిలో హిందువులు, ముస్లిములు అందరూ ఉన్నారు. యుద్ధం ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొన్నా వాళ్లు వెనక్కి వెళ్లకుండా యిక్కడే తిష్ట వేశారు. పైగా వాళ్ల కుటుంబ సభ్యులను కూడా లాక్కుని వచ్చారు. అందరూ కలిసి చౌక కూలీలుగా, చిరుద్యోగులుగా, చిన్న వ్యాపారస్తులుగా ఉంటూ స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బ తీశారు. దాంతో యువత వారిపై కోపం పెంచుకున్నారు. వారిని రాష్ట్రంలోకి రానిచ్చి ఓటు బ్యాంకుగా మార్చుకున్న రాజకీయ నాయకులపై మండిపడ్డారు. విదేశీయులు అసాం విడిచి వెళ్లాలంటూ చాలా తీవ్రమైన ఉద్యమం చేశారు.

1951లో అసాంలో ఎన్‌ఆర్‌సి తయారు చేశారు. దాని ప్రకారం అసాంలో 80 లక్షల మంది పౌరులుగా నమోదయ్యారు. వారు, వారి వారసులు తప్ప తక్కినవారందరూ విదేశీయులే అని ఆసు వాదన. 1985 ఒప్పందం ప్రకారం 1966 నుంచి 1971 మధ్య వచ్చిపడినవారికి ఓటరు ఐడి వంటి సరైన డాక్యుమెంట్లు ఉంటే జస్ట్‌ పదేళ్ల పాటు ఓటుహక్కు లేకుండా చేసి, తర్వాత పౌరసత్వం యివ్వవచ్చు. 1971 మార్చి 25 తర్వాత అంటే బంగ్లాదేశ్‌ ఏర్పడిన తర్వాత వచ్చినవారందరినీ గుర్తించి వెనక్కి పంపేయాలి. సరే అన్నారు కానీ నిజాయితీ లేక ఆ పని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు.

జాబితాను అప్‌డేట్‌ చేస్తామంటూ 2005లో ఆసు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. 2010లో రెండు జిల్లాలలో మొదలుపెట్టారు కానీ అల్లర్లు జరగడంతో ఆపేశారు.  ప్రదీప్‌ భూయాన్‌ అని ఐఐటిలో చదివిన 85 ఏళ్ల వ్యక్తి అభిజిత్‌ శర్మ అనే 43 ఏళ్ల ఎంటర్‌ప్రెనార్‌ వద్దకు వెళ్లి '41 లక్షల మంది అక్రమ ఓటర్లున్నారని పిల్‌ వేద్దాం' అని ప్రతిపాదించాడు. 2009 జులైలో సుప్రీం కోర్టులో  పిల్‌ దాఖలైంది. ఎన్‌ఆర్‌సి సవరిస్తే తప్ప యీ సమస్యకు పరిష్కారం లేదని వాళ్లు విన్నవించారు. 2013లో యిది రంజన్‌ గొగొయ్‌, ఎచ్‌ఎల్‌ గోఖలేల బెంచ్‌కు వచ్చింది. 2015లో ఎన్‌ఆర్‌సిపై పని ప్రారంభమైంది. 2017 డిసెంబరు 31కి ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ పూర్తి చేసి జనం ముందు పెట్టాలని, 2018 జూన్‌ 30 కల్లా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

డిసెంబరు 31న తొలి డ్రాఫ్ట్‌ వెలువడింది. పౌరసత్వం కోసం 3.29 కోట్ల మంది దరఖాస్తు చేసుకుంటే ఆ జాబితాలో 1.90 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. అంటే 1.39 కోట్ల మందిని పౌరులుగా గుర్తించలేదన్నమాట. అసలైన పౌరులను తీసేసి, బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చిన 50 లక్షల మంది హిందువుల పేర్లు చేర్చేశారని గగ్గోలు పుట్టింది. దాంతో మీరు సరైన డాక్యుమెంట్లు చూపించి, సవరణలు చేయించుకోవచ్చు. ఫైనల్‌ జాబితా జూన్‌ 30 కల్లా ప్రకటిస్తాం అన్నారు. ఇప్పుడు అది జులై 30 అయింది. లెక్క ప్రకారం 1951 ఓటరు లిస్టులో ఉన్నవారి పేర్లు, 1971 మార్చి 24 నాటికి ఉన్నవారి పేర్లు, ఆ తర్వాత దేశంలోని వేరే రాష్ట్రాల నుంచి అసాంకు వచ్చి స్థిరపడినవారి పేర్లు, వారి వారసుల పేర్లు ఉండాలి. కానీ డిసెంబరు 30 జాబితాలో పిల్లల పేర్లు ఉండి, తలిదండ్రుల పేర్లు లేకపోవడం వంటి వింతలు కూడా జరిగాయట. శతాబ్దాలుగా అసాంలో ఉన్నవారి పేర్లూ మిస్సయ్యాయట.

ఇక 'బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చిన 50 లక్షల మంది హిందువుల' గురించి చెప్పాలంటే దాని వెనుక కథ ఉంది. మామూలుగా అయితే అక్రమంగా వచ్చినవాళ్లందరూ ఒకే కేటగిరిలోకి వస్తారు. వాళ్లను వెనక్కి పంపించి వేయాల్సిందే. కానీ ఎన్‌డిఏ ప్రభుత్వం 2016 జులైలో ఓ బిల్లు పాస్‌ చేసి, 1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణలు చేసింది. ముస్లిం దేశాలైన బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ల నుంచి మైనారిటీలైన హిందువులు, సిఖ్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు 2014 డిసెంబరు 31 లోగా భారతదేశానికి వస్తే వాళ్లు అక్రమ వలసదారులుగా పరిగణించరు. అక్రమంగా వచ్చినవారిని యిలా మతపరంగా విభజించడం ఇజ్రాయేలులో తప్ప వేరే ఏ దేశంలోనూ జరగలేదు. తక్కిన దేశాల పేర్లు, తక్కిన మతస్తుల పేర్లు నామ్‌కేవాస్తే చేర్చినా బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చినవారిలో ముస్లిములను వెనక్కి పంపేసి, హిందువులను ఉంచడమే దీని ప్రధాన లక్ష్యం.

అ చట్టం ప్రకారం ఈ డిసెంబరు 30 నాటి జాబితాలో బంగ్లాదేశీ హిందువుల పేర్లు చేర్చి, ముస్లిముల పేర్లు తీసేసి వుంటారు. పనిలో పనిగా అసామీల పేర్లు కూడా ఎగిరిపోయాయి. ఇది అసామీయులను మండిస్తోంది. బిజెపి మిత్రపక్షంగా ఉన్న ఎజిపి కూడా జాబితాకు వ్యతిరేకంగా ఉద్యమించింది. 2016 బిల్లు తయారైనప్పుడే అది దాన్ని వ్యతిరేకిస్తూ మెమోరాండం యిచ్చింది. ఇప్పుడు యీ అంశంపై కాబినెట్‌లోంచి బయటకు రావడానికి కూడా సిద్ధం అంటోంది. హిందువులైనా, ముస్లిములైనా బంగ్లాదేశీయులందరూ అసాం విడిచి వెళ్లాల్సిందే అనే తన విధానానికి అది కట్టుపడి వుంది.

బంగ్లాదేశ్‌ నుంచి సాటి హిందువులు వస్తూంటే రానీయవచ్చుగా యీ అసామీ హిందువులకేం పోయేకాలం అని అనుకునేవారి గురించి కొంత వివరణ రాయాలి. ఎవరికైనా యిబ్బంది వస్తే సాటి మనిషిగా మనం ఆదుకుంటాం. ఎన్నాళ్లు? 'మా ఆయన/ఆవిడ/మా హౌస్‌ఓనరు తరిమేశార'రంటూ స్నేహితులు మీ యింట్లో ఆశ్రయం కోరితే ఎన్నాళ్లు ఉంచుకుంటారు? నాలుగు రోజులు పోయాక 'మీ సమస్య ఎలా తీరాలో చెప్పండి, నన్ను వచ్చి మాట్లాడమంటారా? లాయరుతో మాట్లాడి కేసు పెడదామా, రౌడీలను ఎంగేజ్‌ చేద్దామా? కాస్త డబ్బు సాయం చేయనా?' అంటారు. 'అబ్బే, అదేం అక్కరలేదు, మీ యిల్లు బాగా నచ్చింది. ఇక్కడే ఉండిపోతా' అంటే ఊరుకుంటారా? తక్షణం తరిమివేస్తారు. మీ సమస్యలు మీరు తీర్చుకోవాలి, కావాలంటే సాయం చేస్తాను తప్ప వచ్చి నా నెత్తిన కూర్చుంటే ఒప్పదు అని ఖండితంగా చెప్తారు.

రోహింగ్యాల గురించి మాట్లాడుతూ మానవతాదృష్టితో మన దేశంలో ఆశ్రయం యివ్వాలని కొందరు వాదిస్తారు. నాకు అది మింగుడు పడదు. శరణార్థి అన్నవాడికి తాత్కాలికంగా శరణు యిస్తాం. వాళ్ల పోరాటానికి నైతికంగానో, దౌత్యపరంగానో, సైనికపరంగానో సాయం చేయవచ్చు, మన యింట్లోనే బిచాణా వేయనిస్తే వాడు పోరాటమే మర్చిపోతాడు. ఇక్కడే బాగుందనుకుంటాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చినవారికి ఎన్నేళ్లయినా సరే, ఆశ్రయం యివ్వాలి, కడుపులో పెట్టుకోవాలి అని దూరంగా ఎక్కడో ఉన్నవాడు ఉపదేశాలు చేయవచ్చు. కానీ శరణార్థుల క్యాంప్‌ల పక్కన ఉండేవాళ్లు, వాళ్ల వలన ప్రభావితమయ్యే స్థానికులు అది అలా ఆలోచించలేరు.

ఎందుకంటే శరణార్థిగా వచ్చినవాడు ఎలాగైనా బతికేయాలని చూస్తాడు. పరిసరాలను రకరకాలుగా పాడు చేస్తాడు. ఇళ్లూ, ఆస్తులు పోగొట్టుకుని వచ్చినవాళ్లు శాంతంగా ఉండరు. బాధతో తాగుతారు, తన్నులాడుకుంటారు. ఇరుగుపొరుగు యిళ్లలో దొంగతనాలకు, రౌడీయిజానికి అలవాటు పడతారు. ఇవన్నీ ఎప్పణ్నుంచో అక్కడ ఉన్నవాళ్లకు తలనొప్పి. అప్పుడు సాటి మనిషి, సాటి మతస్తుడు, సాటి కులస్తుడు... యిలాటివేవీ గుర్తుకు రావు. వీళ్లనిక్కణ్నుంచి తరిమేయాలి అనే అనుకుంటాడు.

మనదేశంలో బర్మా కాందిశీకులు ఎప్పణ్నుంచో ఉన్నారు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జపాన్‌ సైన్యం బర్మాను ఆక్రమించి మన వాళ్లను తరిమివేశారు. వారిలో ఎక్కువమంది దక్షిణాదివారు, బెంగాలీలే. బెంగాలీలు కాలినడకన అసాం చేరారు. దక్షిణాది వారికి అప్పటి మద్రాసు రాష్ట్రంలోనే అనేక చోట్ల బస ఏర్పరచారు. మద్రాసులో యిప్పటికీ బర్మా బజారు చూడవచ్చు. స్మగుల్డ్‌ వస్తువులకు, డూప్లికేటు వస్తువులకు పేరుబడింది. శరణార్థులు కదా అని జాలి చూపి వదిలేస్తారేమో, దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమే కదా!

శరణార్థులపై జాలి కూడా నిజంగా వారు దుస్థితిలో ఉన్నపుడే వస్తుంది. ఏవీ లేకుండా హడావుడి చేస్తే ఒళ్లు మండుతుంది. బంగ్లాదేశ్‌లో హిందువుల నందరినీ చంపేస్తున్నారని వచ్చే వార్తల్లో వాస్తవాలేమిటో పొరుగున ఉన్నవాళ్లకి బాగా తెలుసు. నేను మా బ్యాంకు కలకత్తా బ్రాంచ్‌లో పనిచేసేటప్పుడు నా కొలీగ్‌ బంగ్లాదేశీ హిందువు ఉండేవాడు. 1971లో శరణార్థులమంటూ వాళ్ల కుటుంబం ఇండియాకు వచ్చింది. ప్రభుత్వం వాళ్లకు ఉద్యోగాలిచ్చింది. ఇతనికి బ్యాంకులో, వాళ్ల అన్నయ్యకు మరో ప్రభుత్వసంస్థలో... యిలా! నిజానికి వీళ్లు బంగ్లాదేశ్‌ను సాంతం విడిచిపెట్టి రాలేదు. అక్కడ వీళ్లకి వ్యాపారం ఉంది. అప్పటికి (1985) ఆస్తులూ ఉన్నాయి. వెళ్లి వాటి సంగతి చూసుకుని వస్తూ ఉంటారు. 'ఇలా రాకపోకలు అనుమతిస్తారా?' అని అడిగితే అతను నవ్వి బంగ్లాదేశ్‌, ఇండియా సరిహద్దుల్లో ఎవరూ ఎవర్నీ ఆపరని చెప్పాడు. కొందరు బంగ్లాదేశీయులు సైకిళ్లేసుకుని పొద్దున్న ఇండియాకు వచ్చి సరుకులు అమ్ముకుని సాయంత్రానికి తమ వూళ్లకు వెళ్లిపోతారట.

అంటే వీళ్లకు జరిగిన హాని ఏమీ లేదు కానీ, శరణార్థులమని పేరు చెప్పి వీళ్లు మన ఉద్యోగాలు కొట్టేశారు. ఇలాటివి యింకా ఎన్ని ఉన్నాయో! బంగ్లాదేశ్‌ యుద్ధం జరిగినపుడు హిందువులకు వ్యతిరేకంగా జరగలేదు. అది పశ్చిమ పాకిస్తానీ ముస్లిములు తూర్పు పాకిస్తానీ ముస్లిములపై చేసిన యుద్ధం. మతంతో సంబంధం లేకుండా బెంగాలీలపై చేసిన యుద్ధం. అందువలన యిరు మతాల వారూ పారిపోయి వచ్చారు. కొందరు వెనక్కి వెళ్లారు. కొందరు యిక్కడే కాపురాలు పెట్టేశారు. మరి కొందరు యిక్కడా, అక్కడా తిరుగుతూ రెండిందాలా లాభం పొందుతున్నారు.

ఇక బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి అని వచ్చే వార్తల గురించి లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు తడతాయి. నా పాఠకుల్లో ఒకాయన 'దమ్ముంటే మీరు హైదరాబాదు పాతబస్తీలో నివాసముండి అప్పుడు మాట్లాడండి' అని ఛాలెంజ్‌లు విసురుతూ ఉంటాడు. అది మాత్రమే వింటే పాతబస్తీలో ముస్లిములు తప్ప వేరెవరూ జీవించలేరనే అర్థం వస్తుంది. కానీ వినాయక చవితి సందర్భంగా ఎన్ని ఊరేగింపులు పాత బస్తీ నుండి వస్తాయో చూడండి. పాతబస్తీకి వెళ్లి చూస్తే ఒక ముస్లిము షాపుంటే, పక్కనే మార్వాడీల షాపుంటుంది. హిందూ-ముస్లిం ఘర్షణలు జరిగిన సందర్భాల్లో కూడా యించుమించుగా యిద్దరికీ సమానబలం ఉన్నట్లేగా అర్థం! లేకపోతే అంతా ఒన్‌సైడ్‌ గేమే కదా!

హిందువులు చాలామందే ఉన్నా రాజకీయాధికారం మజ్లిస్‌ చేతిలో - ముస్లిములు అని అనలేం, మజ్లిస్‌కి వ్యతిరేకంగా నిలిచిన వేరే ముస్లిం పార్టీ కూడా నెగ్గదు - ఉంది. ఆ మాటకొస్తే ఆంధ్రలో పాలనాధికారం రెడ్డి-కమ్మల మధ్య తిరుగుతోంది. అంతమాత్రం చేత తక్కినవాళ్లు జీవించ లేకపోతున్నారనా? కానీ యీ పాఠకుడి వ్యాఖ్యలు ఏ విదేశీ మీడియాయో చూసిందనుకోండి. 'హైదరాబాదు పాతబస్తీలో హిందువులు జీవించే పరిస్థితి లేదు, కొత్త బస్తీలో ముస్లిములు జీవించే పరిస్థితి లేదు. దేశమంతా మతఘర్షణల్లో మునిగి తేలుతోంది.' అని కథనం తయారుచేస్తుంది.

దానికి తోడు కత్తి మహేష్‌పై, అతన్ని ఆదరిస్తున్న టీవీ9పై ప్రస్తుతం చెలరేగుతున్న దుమారం చూసి 'భారతదేశంలో దళితులు (మహేశ్‌ క్రైస్తవుడై ఉంటే క్రైస్తవులు) ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతికే పరిస్థితి ఉంది.' అని చేరుస్తారు. దళితుల పరిస్థితి ఎలా ఉందో మనకు నిజానిజాలు తెలుసు. అలాగే ఫలానా ప్రాంతంలో కులఘర్షణలు జరిగాయి అని వార్త వస్తుంది. నిజానికి అవి వ్యక్తిగత సమస్యలు. ఎవడైనా వచ్చి 'మా అమ్మాయి ఫలానావాడితో లేచిపోయిందిరా, వెళ్లి తందాం' అని అంటే 'అది కొవ్వెక్కి తిరుగుతూంటే నువ్వు అదుపులో పెట్టుకోలేక పోయావా?' అంటారు. అందువలన 'మన కులంలో అమ్మాయిలను వాళ్ల కులం యువకులు వలలో వేసుకుంటున్నార్రా. ఆపకపోతే రేపు నీ కూతురికీ యిదే గతి పడుతుంది.' అనే కలరింగ్‌ యిస్తే ఆ కులం వాళ్లు, యీ కులం వాళ్లు నాలుగు రోజులు తన్నుకుంటారు.

తర్వాత వ్యవహారం చల్లబడుతుంది. రెండు కులాల మధ్య తరతరాలుగా ఎలాటి బంధం వుంటూ వచ్చిందో, అదే కొనసాగుతుంది. మనకు మాత్రం ఆ కొట్లాట వార్త మనసులో ఉండిపోయి వాళ్లు నిరంతరం ఘర్షిస్తున్నట్లుగా అనుకుంటాం. ప్రేమికుడు ముస్లిం అయితే 'లవ్‌ జిహాద్‌' పేరు పెడతారు, అక్కడికి ముస్లిం కుర్రాళ్ల కున్న ఆకర్షణ శక్తి హిందూ కుర్రాళ్లకు లేనట్లు! ఆ సదరు అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చాడు. దట్సాల్‌, కానీ దానికి వేరే కలరింగు యిస్తే అదో పెద్ద అంశంగా మారుతుంది. కావేరీ గొడవ వస్తుంది, బెంగుళూరులో తమిళుల కాలనీలో కాస్త గొడవలు జరుగుతాయి. ఇంకో వారానికి అంతా మామూలే. అది మర్చిపోయి, తమిళులకు, కన్నడిగులకు నిరంతరం కలహమే అని తీర్మానించగలమా?

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి వార్తలు కూడా యిలాటివే అని నా ఉద్దేశం. అలా కాకుండా అక్కడ నిజంగా హిందువులకు బతికే పరిస్థితే లేకపోతే వాళ్లు తిరగబడి పోరాడాలి. బ్రిటిషు వాళ్లను, పశ్చిమ పాకిస్తానీ వాళ్లను ఎదిరించి పోరాడామని చెప్పుకుంటారు కదా, ఆ స్పిరిట్‌ అంతా ఏమయింది? ఆవిరై పోయిందా? అంతగా కావాలంటే భారత్‌ నుంచి హిందూత్వ సేనలను మెర్సినరీలుగా తెప్పించుకోవాలి. అంతేకానీ అక్కడ గొడవగా ఉందంటూ యిక్కడకు వచ్చి తిష్ట వేస్తే ఎలా? సాటి హిందువులు కాబట్టి సర్దుకోండి అని వేరే రాష్ట్రాల నుంచి మనం సలహా యివ్వడం తగదు.

మనరాష్ట్రంలో మనం ఏం చేశాం? మతం ఒక్కటే, భాష ఒక్కటే, కులవ్యవస్థా ఒక్కటే, సంబంధబాంధవ్యాలు తరతరాలవి, రాజధాని కదాని ఆంధ్రమూలాల వాళ్లు వచ్చి స్థిరపడ్డారు. మీరు దోపిడీదారులు, మా అవకాశాలు తన్నుకుపోతున్నారు, తెలంగాణా వాలే జాగో, ఆంధ్రావాలే భాగో అని నినాదాలు యివ్వలేదా? రేపు 'విజయవాడలో కమ్మల ప్రాబల్యం తట్టుకోలేకపోతున్నాం, పారిపోయి వచ్చాం. మేమూ కాపులమే, మీ మున్నూరు కాపు భవనంలో మాకు ఆశ్రయం యివ్వండి' అంటే తెలంగాణ మున్నూరు కాపు సంఘం వారు తమ బిల్డింగు యిచ్చేస్తారా?

బెంగాలీ వాళ్లను ఆదరించండి, మీ యింట్లో పెట్టుకోండి అని ఎవరికైనా నచ్చచెప్పడం చాలాకష్టం. ఎందుకంటే బెంగాలీలు తమిళుల్లాగే చాలా డామినేటింగు. వేరే చోటకి వెళ్లి అక్కడ కూడా తమ సంస్కృతి, తమ భాషా చెల్లాలంటారు. బ్రిటిషు హయాంలో ఉన్నత పదవులన్నీ వాళ్లవే. తమ పలుకుబడి ఉపయోగించి తూర్పు భారతంలో బెంగాలీకే ఎక్కువ ప్రాధాన్యత వచ్చేట్లు చేసేవారు. త్రిపురలో కూడా బెంగాలీయే అధికార భాష చేశారు. స్థానికుల భాష అయిన కోక్‌బొరాక్‌ రెండో అధికార భాష. బ్రిటిషు హయాంలో అసాంలో కూడా బెంగాలీని అధికార భాషగా ప్రకటించారు. అసామీయ జాతి చరిత్రలో దాన్ని చీకటి అధ్యాయంగా పరిగణిస్తారు. వాళ్ల స్వాతంత్య్ర పోరాటంలో బెంగాలీ భాషాధిóపత్యానికి వ్యతిరేకంగా పోరాడడం కూడా ఒక అంశమైంది.

స్వాతంత్య్రం వచ్చాక 1948లో బెంగాలీల దుకాణాలపై దాడి చేశారు కూడా. 1917లో అసాం సాహిత్య సభ అని ఏర్పడి, అసామియా భాషను అధికార భాష చేయాలని ఉద్యమించింది. 1960లో ''బంగాల్‌ ఖేడా'' (బెంగాలీలను తరమండి) ఉద్యమం తీవ్రమైంది. అసాం ప్రభుత్వం అసామియా భాషను అధికార భాషగా ప్రకటించింది. అయితే దక్షిణ అసాంలో బెంగాలీలు అధిక సంఖ్యలో ఉండడంతో నిఖిల అసాం బంగ భాషాభాషీ సమితి అని ఏర్పడి బరాక్‌ లోయలో మాత్రం బెంగాలీయే అధికార భాషగా కొనసాగాలని పోరాడి సాధించింది. తాము 6 వ శతాబ్దం నుంచి అక్కడే ఉంటున్నామని వారి వాదన.

ఉత్తర శ్రీలంకలో తమిళుల వాదన లాటిదే యిదీను. బరాక్‌ లోయలో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. అసామీ వాళ్లు ఎప్పటికప్పుడు అక్కడ కూడా అసామియాను అధికార భాష చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా 2014లో అలాటి ఒక విఫలయత్నం జరిగింది. అసాంలో కొన్ని ప్రాంతాల్లో బెంగాలీ కాళి అని విడిగా దేవాలయాలు ఉన్నాయని, బెంగాలీలు వాటికే వెళతారనీ నేను విన్నాను. కాళీమాత ఒకరే కదా. అయినా భాషాపరంగా, జాతిపరంగా విడగొట్టగల సమర్థులు బెంగాలీ వాళ్లు. పాతవాళ్లని ఏమీ చేయలేం, యిక కొత్తవాళ్లను కూడా తీసుకుని వచ్చి నట్టింట్లో పెట్టుకోమంటే సగటు అసామీ ఎందుకు ఒప్పుకుంటాడు?

మోదీ బెంగాల్‌లోని శ్రీరామ్‌పూర్‌లో 2014లో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ ''మే 16న మేం అధికారంలోకి వస్తాం. ఈ బంగ్లాదేశీయులందరూ మూటాముల్లె సర్దుకుని సిద్ధంగా ఉండాలి.'' అని ప్రకటించాడు. అది అసామీయులకు అమిత హర్షాన్ని కలిగించింది. తమ రాష్ట్రంలో 14 పార్లమెంటు సీట్లలో 7టిని బిజెపికి కట్టబెట్టారు. రెండేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి అసామీ 'మాటీ, భేటీ ఆర్‌ జాతీ' (భూమి, యిల్లు, జాతి) కాపాడుతామని వాగ్దానాలు చేసి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు యీ విధంగా బంగ్లాదేశీయులను అక్కున చేర్చుకోవడం అసామీయులకు మింగుడు పడటంలేదు.

దేశవిభజన సమయంలో తూర్పు బెంగాల్‌ నుంచి అనేకమంది హిందు కుటుంబాలు వచ్చి కలకత్తాలో పడ్డాయి. ఫుట్‌పాత్‌లు ఆక్రమించి కాపురాలు పెట్టేశారు, దుకాణాలు పెట్టేశారు. తగాదాలూ ఎక్కువే. నగరం ధ్వంసమై పోయింది. శుచీశుభ్రతా నుమరుగయ్యాయి. నీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, డ్రైనేజి అన్నీ చెడిపోయి యిప్పుడు చూస్తే యిది ఒకప్పటి దేశరాజధానా? అని ఆశ్చర్యం వేసేట్లా తయారైంది. విభజన తర్వాత కూడా జనాలు వచ్చిపడుతూనే ఉన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కమ్యూనిస్టులు ఓటు బ్యాంకు కోసం వీళ్లను చేరదీశారు. మీకు అండగా ఉంటామన్నారు. వీరిని వెనక్కి పంపడానికి వీల్లేదని పోరాడారు. ఈ క్రమంలో నగరం, రాష్ట్రం దెబ్బ తినిపోయాయి. అలాగే ఇప్పుడు బిజెపి బంగ్లాదేశీయుల ఓట్ల కోసం ప్రమాదకరమైన క్రీడ ఆడుతోంది.

2016 నాటి సవరణ 2019 ఎన్నికలలో బెంగాల్‌లో బెంగాలీల ఓట్ల కోసమే అని అసాం నాయకుల అభిప్రాయం. అక్రమ బెంగాలీల పేర్లు తొలగించాలని అసాం వాళ్లు చేసే ఆందోళనను మమతా బెనర్జీ ఖండించింది. ఇది మరొక 'బంగాల్‌ ఖేడా' ఉద్యమం లాటిది అంది. అసామీయుల మాట వింటే బిజెపి అసాంలో గెలిచినా, బెంగాల్‌లో ఓడే ప్రమాదం ఉంది. అసాం కంటె బెంగాల్‌ పెద్ద రాష్ట్రం. అసాం బిజెపిలో కూడా అసామీ, బెంగాలీ నాయకులున్నారు. 2016 నాటి సవరణపై ఇద్దరిదీ చెరో దారి. అసాం ముఖ్యమంత్రి సర్వానంద సోనేవాల్‌ 'నా ప్రజల ప్రయోజనాలు కాపాడలేకపోతే నేను ముఖ్యమంత్రిగా కొనసాగడంలో అర్థం లేదు' అన్నాడు. ఆర్థికమంత్రి, బలమైన నాయకుడు అయిన హిమాంత బిశ్వ శర్మ సవరణను సమర్థిస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసు పరిస్థితీ అదే. బెంగాలీ వర్గం, అసామీ వర్గం రెండూ చెరో మాటా మాట్లాడుతున్నాయి. తుది జాబితా వెలువడ్డాక అసామీ, బెంగాలీ జాతులు కలహాలకు సిద్ధపడితే దాని ప్రయోజనం పొందడానికి ఉగ్రవాద సంస్థ ఉల్ఫా పొంచి ఉంది.
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2018)
mbsprasad@gmail.com

Show comments