సినిమా రివ్యూ: తేజ్‌

రివ్యూ: తేజ్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌
తారాగణం: సాయి ధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌, అనీష్‌ కురువిల్లా, 'వైవా' హర్ష తదితరులు
సంగీతం: గోపి సుందర్‌
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ
నిర్మాతలు: కె.ఎస్‌. రామారావు, వల్లభ
కథ, కథనం, దర్శకత్వం: ఏ. కరుణాకరన్‌
విడుదల తేదీ: జులై 6, 2018

లవ్‌స్టోరీస్‌ ఎప్పుడూ మనసులోంచి పుట్టుకురావాలి కానీ... ఆల్రెడీ సక్సెస్‌ అయిన సినిమాల నుంచి పుట్టుకు రాకూడదు. ఫలానా సినిమాలో ఫలానాది క్లిక్‌ అయింది కనుక ఈ సినిమాలోను అది పెట్టేస్తే వర్కవుట్‌ అయిపోతుందనే ఆలోచనే సబబు కాదు. 'తేజ్‌' చిత్రం చూస్తోంటే.. రుణాకరన్‌ అడుగడుగునా తన పాత సినిమాల్లో క్లిక్‌ అయిన పాయింట్లని రిపీట్‌ చేయడానికి చూసిన ప్రయత్నం తెలుస్తూనే వుంటుంది. 'తొలిప్రేమ' తర్వాత ఇరవయ్యేళ్లలో మళ్లీ అలాంటి ఒక క్లాసిక్‌ లవ్‌స్టోరీ రాయలేకపోయినా కానీ 'డార్లింగ్‌', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' లాంటి వినోదాత్మక చిత్రాలని అందించగలిగాడు. ''ప్రేమిస్తున్నానని ప్రేమికుడికి చెప్పేలోపే ఆమె అతడిని పూర్తిగా మరచిపోతే..! 

''కొత్తగా అనిపించిన ఈ పాయింట్‌కి తన మార్కు ఎలిమెంట్స్‌ జోడించేస్తే మరో ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీ రెడీ అయిపోతుందని కరుణాకరన్‌ భావించినట్టున్నాడు. ముందుగా ఆ పాయింట్‌ అంత మైండ్‌ బ్లోయింగ్‌ ఐడియాయేం కాదు. దేశవిదేశాలలో పలు చిత్రాల్లో రొమాన్స్‌కి మెమరీ లాస్‌ కాన్‌ఫ్లిక్ట్‌ని జత చేసారు. ఈ పాయింట్‌ని ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటే ఎమోషనల్‌గా డీల్‌ చేస్తేనే ఇంపాక్ట్‌ ఎక్కువ. అందుకే కరుణాకరన్‌ మార్కు కామెడీ సీన్లు, టీజింగ్‌ సీన్లన్నీ ఫ్లోలో కలిసిపోకుండా అతికించినట్టు అనిపించాయి.

తను ఎంచుకున్న 'మతిమరపు' లైన్‌కి ఒక సినిమా కాగలిగేటంత స్టఫ్‌ లేదని కరుణాకరన్‌ ముందే రియలైజ్‌ అయినట్టున్నాడు. అందుకే వివిధ ఉపకథలు జోడించాడు. చిన్నతనంలోనే ఒక అపరిచితురాలి కోసం హత్య చేసి హీరో జైలుపాలవుతాడు. తర్వాత తన బాబాయ్‌ కూతురికి నచ్చినవాడితో పెళ్లి చేసి కుటుంబానికి దూరమవుతాడు. ఈ ఎమోషన్‌ అంతా స్టార్టింగ్‌లో పెట్టేసి, మళ్లీ క్లయిమాక్స్‌లో వాడుకుందామన్నట్టు దానిని వాయిదా వేసేసి తన మార్కు టీజింగ్‌ సన్నివేశాలకి షిఫ్ట్‌ అయిపోయాడు. మరోవైపు హీరోయిన్‌ కూడా తల్లిని కోల్పోయి, ఆమెకి మిగిలి వున్న ఓ కోరికని తీర్చడానికి వస్తుంది. ఆమె కూడా ఆ ఎమోషన్‌ పక్కన పడేసి హీరోని ఏడిపిస్తూ కాలం గడిపేస్తుంటుంది.

కామెడీ, సెంటిమెంట్‌, లవ్‌... ఏదీ వాటంతట అవి నేచురల్‌గా జరిగిపోతున్నట్టు వుండవు. అన్నీ అతికించినట్టే వుంటాయి. ముందు హీరోయిన్‌ని హీరో ఏడిపించడం, తర్వాత ఆమె రివర్స్‌లో వచ్చి ఏడిపించడం, మళ్లీ దానికి హీరో రిటార్ట్‌ ఇవ్వడం... ఇలా సాగిపోతున్న లవ్‌స్టోరీకి బ్రేక్‌ యాక్సిడెంట్‌తో పడుతుంది. గతం మర్చిపోయిన హీరోయిన్‌కి తాను ఎవరనేది ఎలా గుర్తు చేస్తాడు? ఇందుకోసం కూడా మళ్లీ టీజింగ్‌ సీన్లే వాడుకున్నారు. ప్రియుడిని ప్రేయసి మరచిపోవడమనేది ఫిక్షనే అయినా ఎమోషనల్‌ పాయింట్‌. ఆమె అతడిని మరచిపోయిందనేది ఎఫెక్టివ్‌గా వుండాలంటే అంతకుముందు వారి మధ్య వున్న ప్రేమ హృదయాలని తాకేలా వుండాలి.

కానీ కామెడీ పేరు చెప్పి కరుణాకరన్‌ ఒక్కటైనా హార్ట్‌ టచింగ్‌ రొమాంటిక్‌ మూమెంట్‌నే పెట్టలేదు. దీంతో ఆమె గతం మరచిపోవడమనే పాయింట్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, సెకండ్‌ హాఫ్‌లోను దానిని కామెడీగా మార్చేసి, వేరే అంశాలతో కాలక్షేపం చేయడం వల్ల ఒక దశలో ఆమె గతం మరచిపోయిన సంగతి కూడా మనం మరచిపోతాం. 'తను గతం మరచిపోయింది' అంటూ హీరో గుర్తు చేస్తే తప్ప గుర్తు రానంత కంగాళీగా అవసరం లేని సన్నివేశాలని పేర్చుకుంటూ పోయారు. లవ్‌స్టోరీస్‌ తీయడంలో ఎక్స్‌పర్ట్‌ అనిపించుకున్న దర్శకుడేనా ఇతను అన్నట్టుగా కనీసం హీరో హీరోయిన్ల నడుమ మెప్పించే కెమిస్ట్రీని కూడా క్రియేట్‌ చేయలేకపోయాడు.

సాయిధరమ్‌ తేజ్‌కి 'మాస్‌ హీరో' ఇమేజ్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలని వుంది కానీ దానికి తగిన కథని ఎంచుకోవడం లేదు. ప్రేమకథ చేసేసినంత మాత్రాన ఇమేజ్‌ మేకోవర్‌ వచ్చేయదు. కొత్తగా అటెంప్ట్‌ చేసాననే పేరుకి తప్ప ఇలాంటి గుర్తుండని సినిమాలు చేయడం వల్ల ప్రయోజనం వుండదు. దర్శకుడు పూర్తిగా ఫెయిలైన ఈ చిత్రానికి తేజ్‌, అనుపమల నటనే కాస్త ఆలంబన అయింది. అయితే నటీనటులు కాసేపు ఆకర్షించగలరు కానీ సినిమా పట్ల ఆసక్తిని కలిగించడానికి అవసరమైన కథ, కథనాలు లేకపోవడంతో తేజ్‌ తేలిపోయింది. కనీసం పాటలయినా గుర్తుంచుకునేలా వుంటే అంతో ఇంతో ప్లస్‌ అయ్యేది. ఒక్క పాట మినహా ఏదీ మళ్లీ గుర్తు చేసుకుని పాడుకునేలా లేకపోవడం తేజ్‌కి మరో బలహీనతగా మారింది. కొన్ని కామెడీ సన్నివేశాలు, ఆకర్షణీయమైన ప్రధాన జంట మినహా తేజ్‌ ఆకట్టుకోలేకపోయింది. వరుసగా రాంగ్‌ స్క్రిప్ట్స్‌ ఎంచుకుంటోన్న తేజ్‌ నుంచి ఇంకో మిస్టేక్‌ జరిగిపోయింది.

ఒక దర్శకుడి గత చరిత్ర చూసి తేజ్‌ సినిమాలు ఒప్పుకుంటున్నట్టున్నాడు. కృష్ణవంశీతో ఒకటి, వినాయక్‌తో ఒకటి, కరుణాకరన్‌తో ఒకటి అంటూ తన బకెట్‌ లిస్ట్‌ పూర్తి చేసుకుంటున్నాడే తప్ప ఏ దర్శకుడితో చేసినా కానీ అంతిమంగా గుర్తుండేది విజయవంతమైన సినిమానే అని విస్మరిస్తున్నాడు. ఫలానా దర్శకుడితో పని చేయడం వల్ల తనకి ఆ గురుతు వుండిపోతుందేమో తప్ప అది విజయవంతం కానప్పుడు సదరు సినిమా ఎవరికీ గుర్తుండదు. ఇప్పటికైనా దర్శకుల ఘనమైన గతాన్ని వదిలేసి వాళ్లిప్పుడు చెప్పిన కథలో వున్న విషయాన్ని చూసుకుని సంతకాలు చేసుకుంటే మంచిది.

తొలిప్రేమలో అన్నాచెల్లెళ్ల మధ్య అల్లరి పనులు నచ్చాయని, డార్లింగ్‌లో హీరో హీరోయిన్ల మధ్య చిలిపి తగాదాలు మెచ్చారని, ఫలానా సినిమాలో స్నేహితుల మధ్య సరదా సంభాషణలు ఆకట్టుకున్నాయని... అందులోంచి ఒకటి, ఇందులోంచి ఒకటి అన్నట్టుగా అతికించి రాసిన ఈ లవ్‌స్టోరీ అలరించకపోగా అతుకులబొంతలా తయారయి ప్రేమికులిద్దరూ కలిసే సమయం కోసం కాకుండా, తెర దించేసే తరుణం కోసం ఎదురు చూసేట్టు చేసింది.

బాటమ్‌ లైన్‌: లేదు 'తేజం'!
- గణేష్‌ రావూరి

Show comments