ఎమ్బీయస్‌: ఝార్‌ఖండ్‌లో గిరిజనుల వ్యతిరేకత

ఇటీవలి ఉపయెన్నికలలో బిజెపి కంగుతిన్న రాష్ట్రాలలో ఝార్‌ఖండ్‌ ఒకటి. రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపయెన్నికలు జరిగితే రెండిటినీ ఝార్‌ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎంఎం) నిలబెట్టుకుంది. అక్కణ్నుంచి 2014లో గెలిచిన దాని ఎమ్మెల్యేలిద్దరూ కేసుల్లో యిరుక్కుని (ఒకరు ప్రభుత్వాధికారిని కొట్టినందుకు, మరొకరు బొగ్గు దొంగిలించినందుకు) సభ్యత్వాలను పోగొట్టుకోవడం వలన సంభవించిన ఉపయెన్నికలలో వారి భార్యలను నిలబెట్టింది. సిల్లీలో జెఎంఎం అభ్యర్థి సీమా మహతో, బిజెపి భాగస్వామ్య పక్షమైన ఆల్‌ ఝార్‌ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఎజెఎస్‌యు) పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుధేశ్‌ మహతోను 14 వేల తేడాతో ఓడించింది. అది 2014లో సాధించిన మెజారిటీ కంటె తక్కువే. గోమియా నియోజకవర్గంలో బబితా దేవి ఎజెఎస్‌యు అభ్యర్థిని 1400 ఓట్ల తేడాతో ఓడించింది. ఇక్కడ బిజెపి కూడా రంగంలో ఉండి మూడో స్థానంలో నిలిచింది. 2014లో రఘువర్‌ దాస్‌ ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి 6 ఉపయెన్నికలు జరిగితే 5టిలో బిజెపి ఓడిపోయింది. 
 
2014 ఎన్నికలలో బిజెపికి 37 సీట్లు, ఎజెఎస్‌యుకి 5 సీట్లు వచ్చాయి. 82 సీట్లున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీ వచ్చింది కాబట్టి రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచాయి. ఝార్‌ఖండ్‌లో తొలిసారిగా గిరిజనేతరుడైన దాస్‌ను బిజెపి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. అతను 2015 ఫిబ్రవరిలో 8 సీట్లున్న ప్రతిపక్షం ఝార్‌ఖండ్‌ వికాస్‌ మోర్చా (జెవిఎం-పి) ని చీల్చి 6గుర్ని తనవైపు లాక్కున్నాడు. రాజకీయ అస్థిరతకు పేరుబడిన ఝార్‌ఖండ్‌లో ఏ ముఖ్యమంత్రికీ యింత బలం లేదు. ఎవరూ పూర్తి కాలం పదవిలో లేరు. కానీ దాస్‌ మాత్రం ఏదోలా లాక్కుని వస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి 31%, ఎజెఎస్‌యుకి 4% ఓట్లు వచ్చాయి. 2018 ఏప్రిల్‌లో స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు 30% ఓట్లే వచ్చినా మెజారిటీ సీట్లు గెలిచింది. నాలుగేళ్లలో బిజెపి బలం పెరగలేదని, తమ అనైక్యత వలననే ఓడిపోతున్నామని గ్రహించిన ప్రతిపక్షాలు బిజెపికి వ్యతిరేకంగా చేరువౌతున్నాయి. మే నెలలో జరిగిన ఉపయెన్నికలో జెఎంఎంను బలపరచి గెలుపు సాధించాయి. ఒకప్పటి విరోధులైన బాబూలాల్‌ మరాండీ (2014లో 10% ఓట్లు తెచ్చుకున్న జెవిఎం నాయకుడు), హేమంత్‌ సొరేన్‌ (20% ఓట్లు, 18 సీట్లు తెచ్చుకున్న జెఎంఎం నాయకుడు) చేతులు కలుపుతున్నారు. 10% ఓట్లు, 6 సీట్లు తెచ్చుకున్న కాంగ్రెసు కూడా వారితో చేరవచ్చు. అందరూ కలిస్తే దాస్‌కు కష్టాలు తప్పవని అంచనా.
 
దాస్‌ పాలన గురించిన రిపోర్టులు చూడబోతే గత ముఖ్యమంత్రుల కంటె మెరుగనిపించినా, అతన్ని ఏవరేజ్‌ ముఖ్యమంత్రిగానే పరిగణించాలి. సుస్థిర ప్రభుత్వాన్ని అందించాడు, అధికారులపై పట్టు సాధించాడు, మావోయిస్టులను అదుపు చేశాడు, అవినీతిని కొంతవరకు నియంత్రించ గలిగాడు. కానీ విద్యుత్‌ రంగంలో విఫలమయ్యాడు. ముఖ్య నగరాల్లో కూడా విద్యుత్‌ కోతలున్నాయి. శాంతిభద్రతల కారణంగా పారిశ్రామికవేత్తలకు, వ్యాపారస్తులకు యిబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. మహిళలను, బీదలను ఉద్దేశించి అనేక పథకాలను రూపొందించినా క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కాక వాటి ఫలాలు వారిని చేరటం లేదు. ఆరోగ్యరంగంలో కూడా పరిస్థితి బాగా లేదు. గోరఖ్‌పూర్‌లో చిన్నపిల్లలు చనిపోయిన ఘటన వార్తల్లో వచ్చింది కానీ ఝార్‌ఖండ్‌ ఆసుపత్రుల పరిస్థితి మరీ అధ్వాన్నం. 2017 జనవరి-ఆగస్టు మధ్య రాజధాని రాంచీలోని రిమ్స్‌లో 660 మంది చిన్నపిల్లలు మరణించారు. జులై, ఆగస్టు నెలల్లో రిమ్స్‌లో 213 మంది పిల్లలు చనిపోగా, జంషెడ్‌పూర్‌లోని ఎంజిఎమ్‌ ఆస్పత్రిలో 104 గురు చనిపోయారు. 
 
ఇవన్నీ ఒక యెత్తు. 1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి రాజ్‌బాలా వర్మను వెనకేసుకుని రావడం మరో ఎత్తు. ఆమె అత్యంత వివాదాస్పదురాలు. ఏం కావాలనుకుంటే అది, నియమాలకు విరుద్ధంగానైనా చేయడానికి పేరుబడింది. ఎవర్నీ లక్ష్యపెట్టదు. లాలూ యాదవ్‌ యిరుక్కున్న దాణా కుంభకోణంలో ఆమె కూడా యిరుక్కుంది. అప్పట్లో (1990-91) ఆమె పశ్చిమ సింగ్‌భూమ్‌కు కలక్టరుగా ఉంటూ జిల్లా ట్రెజరీ నుంచి దాణా విత్‌డ్రాయల్స్‌ అనుమతించింది. ఎక్కౌంటెంట్‌ జనరల్‌ ఆఫీసుకి తెలియపరచలేదు. సిబిఐ దీని గురించి ఆమెకు ఝార్‌ఖండ్‌ చీఫ్‌ సెక్రటరీల ద్వారా నోటీసులు పంపింది. 2003 నుంచి 2014 వరకు 15 షోకాజ్‌ నోటీసులు అందుకున్నా ఆమె ఒక్కదానికీ సమాధాన మివ్వలేదు. అయినా చెల్లిపోయింది. 
 
అలాటి వ్యక్తికి దాస్‌ ప్రమోషన్‌ యిచ్చి చీఫ్‌ సెక్రటరీగా వేసుకున్నాడు. ఆమె నియంతలా వ్యవహరించి, తనకు, ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు తెచ్చింది. పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ పరీక్షల నిర్వహణ తనకిష్టం వచ్చినట్లు చేయడంతో యువత ఆమెపై కోపం పెంచుకున్నారు. ఎంతమంది చెప్పినా దాస్‌ ఆమెను సమర్థిస్తూనే వచ్చాడు. ఈ ఫిబ్రవరి నెలాఖరుకి రిటైర్‌ కావలసిన ఆమెకు ఎక్స్‌టెన్షన్‌ కూడా యిద్దామనుకున్నాడు. కానీ అతని కాబినెట్‌లోని మంత్రి వ్యతిరేకిస్తూ లేఖ రాశాడు. అంతకుముందు తన కొడుకు కంపెనీకి ఋణాలు యివ్వాలని ఆమె ఒక ప్రయివేటు బ్యాంకుకు లేఖ రాయడంతో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. 
 
దీనికి తోడు జెవిఎం నాయకుడు దిలీప్‌ మిశ్రా ప్రధాని కార్యాలయానికి 2017 జులైలో మరో లేఖ రాశాడు. పలమావులో 200 ఎకరాలను కఠోతియా కోల్‌ బ్లాక్‌ ప్రై.లి.కు జిల్లా కలక్టరు పూజా సింఘాల్‌ అక్రమంగా కట్టబెడితే ఆమెను రక్షించడానికి రాజ్‌బాలా తప్పుడు నివేదికలు యిచ్చిందని అతని ఆరోపణ. ప్రధాని కార్యాలయం దీన్ని సీరియస్‌గా తీసుకుని ఫిబ్రవరిలో రాజ్‌బాలాను వివరణ కోరింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దాస్‌ ఆమె పదవీకాలం పొడిగించలేదు. రిటైరై పోతే నాలుగేళ్ల కంటె పాత కేసులకు ఆమె జవాబుదారీ కాదు. ఆ విధంగా దాణా స్కాములో ఆమె తప్పించేసుకుంది. ఆ విధంగా బిజెపి ఆమెను కాపాడింది. ఆమె భర్త యిప్పటికే రాష్ట్ర బిజెపికి అధికార ప్రతినిథి. ఆమె కూడా రిటైరయ్యాక బిజెపిలో చేరుతుందని అనుకున్నారు కానీ తాజా వార్తల ప్రకారం దాస్‌ తను అధ్యక్షుడిగా ఉన్న రాజ్య వికాస్‌ పరిషద్‌కు ఆమెను ఉపాధ్యక్షురాలిగా నియమించవచ్చు. అందువలన ఆమె హవా కొనసాగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. 
 
రాజ్‌బాలాకు దాస్‌ మద్దతు వెనుక ఒక మతలబు ఉందని ఆరోపిస్తూ ఓ పిల్‌ దాఖలైంది. 2004-05లో రూ.19 కోట్ల డ్రైనేజీ స్కాము జరిగినప్పుడు విధాన సభ ఓ కమిటీని వేసి విచారణకు ఆదేశించింది. ఆ కమిటీ 2007లో నివేదిక యిస్తూ దాస్‌ను దోషిగా పేర్కొంది. అతనిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు అప్పట్లో విజిలెన్సు కమిషనర్‌గా, హోం సెక్రటరీగా ఉన్న రాజ్‌బాలాను అనుమతి కోరారు. అయితే ఆమె శాంక్షన్‌ యివ్వకుండా దాస్‌ను రక్షించింది. దానికి బదులుగా యిప్పుడు దాస్‌ ఆమెను రక్షిస్తున్నాడని పిల్‌ సారాంశం. ప్రతిపక్షాలన్నీ రాజ్‌బాలాపై చర్య తీసుకోమని కోరుతున్నా దాస్‌ కిమ్మనకుండా కూర్చోవడానికి యిదే కారణం కావచ్చు. 
 
దీనికంటె దాస్‌ను ఎక్కువగా చికాకు పెడుతున్నది గిరిజనుల వ్యతిరేకత. రాష్ట్రంలో వారి జనాభా 26.2%, 28 నియోజకవర్గాల్లో వారి ఓట్లు కీలకం. గిరిజనేతరుడైన దాస్‌ ప్రవేశపెడుతున్న చట్టాలను వాళ్లు అనుమానదృష్టితో చూస్తున్నారు. 2016 ఏప్రిల్‌లో డొమిసైల్‌ పాలసీని ప్రవేశపెట్టడంతో యీ శంక ప్రారంభమైంది. దాని ప్రకారం ఝార్‌ఖండ్‌లో 30 ఏళ్లు నివాసమున్న ఏ వ్యక్తి ఐనా దాని ప్రకారం స్థానికుడే! ఝార్‌ఖండ్‌లో జంషెడ్‌పూర్‌, ధన్‌బాద్‌, రాంచి, బొకారో వంటి అనేక పారిశ్రామిక నగరాలుండటం చేత దేశంలోని అనేక రాష్ట్రాల వారు అక్కడకి ఉద్యోగస్తులుగా, చిన్న వ్యాపారస్తులుగా వస్తారు. వారందరినీ స్థానికులనేస్తే తమకు అవకాశాలు లేకుండా పోతాయనే భయం గిరిజనులది.  అనేక రాష్ట్రాలలో బిజెపి విద్య పేరుతో, మతం పేరుతో గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకు పోతోంది. వారి ఓట్లు సంపాదించ గలుగుతోంది. కానీ ఝార్‌ఖండ్‌లో మాత్రం గిరిజనులే వాళ్లకు ఎదురు తిరుగుతున్నారు.
 
ఆ తర్వాత ఛోటానాగపూర్‌, టెనన్సీ యాక్ట్‌, సంతాల్‌ పరగణా టెనన్సీ యాక్ట్‌లను సవరించడానికి పూనుకున్నాడు దాస్‌. ఆ సవరణల వలన గిరిజనులకు వాణిజ్యపరమైన లాభం కలుగుతుందని దాస్‌ అంటాడు. కానీ వాళ్లు నమ్మలేదు. గిరిజనేతరులు వచ్చి భూములు ఆక్రమించేస్తారని వారి భయం. సవరణను అడ్డుకున్నారు. ఏకపక్షంగా అసెంబ్లీ ఆమోదించిన యీ చట్టాలను వ్యతిరేకించడంతో గవర్నరు ద్రౌపది ముర్ము ఆమోదించకుండా తిరిగి రాష్ట్రప్రభుత్వానికి పంపించారు. ఇక దానితో మరో మార్గం వెతికాడు రఘువర్‌ దాస్‌. అవతల మోదీకి ఆత్మీయుడైన అదానీ గ్రూపు గొద్దాలో పవర్‌ ప్లాంట్‌ పెడతానంటూ ముందుకు వచ్చింది. దానికి భూమి సమకూర్చాలి. ఎలా?
 
పారిశ్రామికీకరణ జరగాలంటే భూసేకరణ జరగాలి. కానీ సేకరణ జరిగాక భూమి కోల్పోయినవారి పునరావాసానికి ఎవరూ పూనుకోవటం లేదు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలూ యిద్దరూ వారిని దగా చేస్తున్నారు. అందుకే అంత వ్యతిరేకత. దీన్ని సరిదిద్దడానికి యుపిఏ ప్రభుత్వం భూయజమానుల్లో 70% మంది అనుమతి తీసుకోవాలని, సామాజిక ప్రభావం (సోషల్‌ ఇంపాక్ట్‌) ఎసెస్‌మెంట్‌ చేయించాలని.. యిలాటి షరతులతో చట్టాన్ని రూపొందించింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ దానికి తూట్లు పొడవడానికి యథాశక్తి ప్రయత్నిస్తోంది. ఝార్‌ఖండ్‌లో బిజెపి సర్కారు కూడా అదే చేసింది. 70% మంది అనుమతి అక్కరలేదని, ఎసెస్‌మెంట్‌ చేయనక్కరలేదని, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గ్రామసభలు అనుమతి యిస్తే చాలనీ 2017లో ఓ చట్టాన్ని పాస్‌ చేసి గవర్నరు ఆమోదానికై పంపింది. 
 
ఇది గత చట్టం కంటె ఎక్కువ ప్రమాదకరమని భావించిన ఖూంటీ గుమ్లా, సిమ్‌డేగా, పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లాల్లోని 200 గ్రామాల్లోని ఆదివాసీలు 'పత్థల్‌గడీ' పేరుతో ఉద్యమం మొదలుపెట్టారు. ఆదివాసీ ప్రాంతాలైన షెడ్యూల్డ్‌ ఏరియాలో వనరుల దగ్గర్నుంచి అన్ని విషయాలలో నిర్ణయాధికారం ఆదివాసీ గ్రామసభలదే, ఆదివాసీయేతరులు మా పల్లెల్లోకి రానక్కరలేదని అంటూ శిలలపై నోటీసులు రాసి, పాతుతున్నారు. 2018 జనవరి 16న తమ డిమాండ్లను ఖూంటీ జిల్లా అధికారులకు అందజేశారు. దీనివలన ప్రభుత్వానికి, గిరిజనులకు మధ్య అగాధం మరింత పెరిగింది. చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ జులై 5న ఝార్‌ఖండ్‌ బంద్‌కు పిలుపు నిచ్చాయి. దీన్ని ఎదుర్కోవడానికి ఝార్‌ఖండ్‌ ప్రభుత్వం ఉద్యమానికి మావోయిస్టు రంగు పూయదలచింది. మావోయిస్టులు, క్రైస్తవ మిషనరీలు కలిసి ఆదివాసీల పేరుతో అల్లర్లుచేస్తున్నారని పోలీసులు అంటున్నారు. 2014 నుంచి యిన్నాళ్లూ ఝార్‌ఖండ్‌లో మావోయిస్టు సమస్య లేదు. ఇప్పుడు ఈ ఉద్యమం కూడా ఆదివాసీల భూమిని లాక్కుని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలన్న ఆలోచనకు వ్యతిరేకంగా వచ్చింది. దాన్ని విస్మరించి మావోయిస్టు రంగు పూయడం అవివేకం. దిద్దుబాటు చర్య తీసుకొనకపోతే రాబోయే ఎన్నికలలో యీ గిరిజన వ్యతిరేకత బిజెపికి నష్టదాయకంగా పరిణమించవచ్చు.
(ఫోటో - పత్థల్‌ గడీ ఉద్యమం)
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2018)
mbsprasad@gmail.com

Show comments