సినిమా రివ్యూ: పంతం

రివ్యూ: పంతం
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌
తారాగణం: గోపిచంద్‌, మెహ్రీన్‌, సంపత్‌ రాజ్‌, ముఖేష్‌ రుషి, పవిత్ర లోకేష్‌, సయాజీ షిండే, పృధ్వీ, జయప్రకాష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రభాస్‌ శ్రీను, హర్షవర్ధన్‌ తదితరులు
మాటలు: రమేష్‌ రెడ్డి
కథనం: బాబీ, కె. చక్రవర్తి
సంగీతం: గోపి సుందర్‌
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మురెళ్ల
నిర్మాత: కె.కె. రాధామోహన్‌
కథ, దర్శకత్వం: కె. చక్రవర్తి
విడుదల తేదీ: జులై 5, 2018

''చెప్పుకోడానికిదేమీ కొత్త కథ కాదు... దేశం పుట్టినప్పటినుంచి మనం చెప్పుకునే కథే!'' కథ పరంగా వాళ్లకి ఫుల్‌ క్లారిటీ వుంది. అయితే అంత కాలంగా చెప్పుకుంటోన్న పాత కథని మళ్లీ చెప్తే ఎంత మందికి నచ్చుతుందనే క్లారిటీ వుండాలిగా? పాత కథలు చూడ్డం మనకీ కొత్తేం కాదు... కాకపోతే వాటికి పాస్‌ మార్కులేయాలంటే మాత్రం పాత కథనే ఎంత కొత్తగా చెప్పారని చూస్తాం. 'పంతం ఫర్‌ ఏ కాజ్‌' అంటూ మొదలు పెట్టిన దర్శకుడు ఆ కాజ్‌ కొత్తగా అనిపిస్తే, పంతం పాతదయినా చూసేస్తాం అనుకున్నట్టున్నాడు. నిజానికి ఆ కాజ్‌ కూడా కొత్తదేమీ కాదు. కాకపోతే దానికి సొల్యూషన్‌ని ఇటీవల అప్‌డేట్‌ అయిన సిస్టమ్‌తో లింక్‌ చేసారు.

ట్రెయిలర్‌, టీజర్లలోనే 'పంతం' దేని గురించి అనేది చెప్పేసారు కనుక వాటి గురించి చెప్పేసుకున్నా స్పాయిలర్స్‌ ఏమీ అవవు. విపత్తులు, ప్రమాదాలు జరిగినపుడు ప్రభుత్వం ప్రకటించే ఎక్స్‌గ్రేషియాని అవినీతిపరులు హరించేస్తున్నారని, అంచేత అలాంటి వారికి అందాల్సిన సాయం నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్‌కే చేరిపోవాలని ఆకాంక్షించాడు దర్శకుడు. ఎలాగో ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్స్‌ లింకింగ్‌ జరిగిపోయింది కనుక ఇలాంటి వాటికి కూడా డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా వాళ్ల అకౌంట్లో వేసేస్తే మధ్యవర్తులు, దళారులు, కుంభకోణ కర్ణులు వుండరనేది అతని ఉద్దేశం. ఆలోచన మరచిదే. కాకపోతే ఇలాంటి సందేశాలు ఇవ్వడానికి కొందరు మెసేజింగ్‌ యాప్స్‌ వాడతారు... ఖర్చు లేకుండా, చక్రవర్తి లాంటివాళ్లు సినిమాలు తీస్తారు... కోట్ల ఖర్చుతో!

నిజానికి ఇది పాత థీమ్‌ అయినా కానీ ప్రస్తుత టెక్నాలజీ వాడుకుని ఒక మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ని తీర్చిదిద్దే అవకాశముంది. అందుకు అనుగుణమైన సెటప్‌ని కూడా పెట్టుకున్నారు. కోట్లు గడించిన అవినీతి పరుల సొమ్ముని దొంగిలించి అవసరంలో వున్న వారిని ఆదుకోవడమనే పాయింట్‌ మీద థ్రిల్‌ ఇచ్చే రాబరీ ఎపిసోడ్స్‌ చిత్రీకరించవచ్చు. రాబరీ సీన్ల కోసం చాలా సమయం కేటాయించినా ఒక్కటంటే ఒక్కటి కూడా ఎక్సయిటింగ్‌ సీన్‌ని తీయలేకపోయారు. కోట్ల ధనాన్ని కొల్లగొట్టడం చిటికెలో వ్యవహారం అన్నట్టు చూపించేయడంతో మార్కులు స్కోర్‌ చేసుకునే అవకాశమున్న పార్ట్‌ని వేస్ట్‌ చేసుకున్నారు. కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌... ఇలా కమర్షియల్‌ మసాలాకి కావాల్సిన అంశాలన్నీ వుండేట్టు చూసుకున్నారు కానీ ఇవన్నీ పండించేలా తెర మీదకి తీసుకురాలేకపోయారు.

ఈ థీమ్‌తో అద్భుతమైన చిత్రాలెన్నో ఆల్రెడీ చూసేసినపుడు ఇలాంటి బేసిక్‌ థాట్‌ కూడా పెట్టని సినిమాకి ప్రేక్షకామోదం ఎలా లభిస్తుందనుకున్నారు? రాబరీ సీన్ల కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. బోలెడంత కంటెంట్‌ వరల్డ్‌ సినిమాలో వున్నపుడు 'స్ఫూర్తి' పొందడానికి కూడా తీరిక లేకపోతే ఎవరిది తప్పు? హీరో ఎంత పనిమంతుడు అయినా ప్రేమికుడు అవ్వక తప్పదనేది మన సినిమాల పాలసీ. కనీసం ఇంత బృహత్తర బాధ్యతని ఎత్తుకున్న వాడి ప్రేమకథ అర్థవంతంగా, స్ఫూర్తిదాయకంగా వుండాలని అనుకోవాలిగా. 'కామెడీ' అని ఫీలయిన లవ్‌స్టోరీ పెద్ద విసుగు అనుకుంటే, మెహ్రీన్‌ వచ్చినపుడల్లా సాంగ్‌కి బ్రేక్‌ తీసుకోవడం మరో హెడ్డేక్‌.

పృధ్వీతో చేయించిన కార్పొరేటర్‌ కామెడీ అయితే నవ్వొచ్చిన వాళ్లు నవ్వుకుంటారులే అన్నట్టుంది. ఆ సీన్లకి సంతాప సభకి హాజరైనట్టు ఆడియన్స్‌ కూడా మౌనం పాటించి తగిన స్పందనే ఇచ్చార్లెండి. ద్వితియార్ధంలో హీరో క్యారెక్టర్‌ పరంగా ట్విస్ట్‌ ఇచ్చి అతనికో చేదు అనుభవం ఎదురైన రొటీన్‌ పాయింట్‌ కాకుండా శ్రీమంతుడు దొంగగా ఎలా మారాడంటూ అతని బ్యాక్‌గ్రౌండ్‌ చూపించారు. విషయం లేని ప్రథమార్ధం కంటే ఇది నయమనిపించినా కానీ ఫస్ట్‌ హాఫ్‌లోని జాఢ్యాలైన మెహ్రీన్‌, పృధ్వీ ట్రాక్‌లు ఇక్కడా చొరబడి ఏ దశలోను సినిమాని నిలబడనివ్వలేదు. మెహ్రీన్‌ చొరబడినపుడల్లా బోనస్‌గా ఒక సాంగ్‌ వచ్చి ఈ 'పంతం' అంతం చూడాలనుకుంది.

గోపిచంద్‌ రీసెంట్‌ సినిమాల్లో కంటే హాండ్‌సమ్‌గా, ఫిట్‌గా కనిపించాడు. కోర్టు సీన్లో ఎమోషన్‌ కూడా బాగా పండించాడు. మెహ్రీన్‌ విషయంలో ఎప్పుడూ రెండు కంప్లయింట్స్‌ వుండేవి. స్లిమ్‌ అవ్వాలని, యాక్టింగ్‌ నేర్చుకోవాలని. స్లిమ్‌ అయితే అయింది. ఇక రెండోదాని సంగతి చూడాలి. సంపత్‌రాజ్‌ అయితే ఫోన్లో అరిచే కేటగిరీలో అవార్డు కోసం ట్రై చేస్తున్నాడా అనిపించాడు. మిగతావారి గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఈమధ్య వచ్చిన గోపిచంద్‌ సినిమాల్లో రిచ్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ వుంటున్నాయి. దీంట్లోను విపరీతంగా ఖర్చు పెట్టారు. అది విజువల్స్‌లో కనిపించింది.

నాసి రకం సంభాషణలకి కొదువలేకుండా పోయింది. 'రోడ్‌కి స్పీడ్‌ లిమిట్‌ వుంటుంది, ఏటీఎమ్‌కి మనీ లిమిట్‌ వుంటుంది, ఎగ్జామ్‌కి టైమ్‌ లిమిట్‌ వుంటుంది కానీ నా యాక్షన్‌కి నో లిమిట్‌' లాంటి అర్థం లేని మాటలు కొల్లలుగా వున్నాయి. డైలాగ్‌ రైటరేనా మాకు రావా అన్నట్టు లిరిసిస్టు కూడా ఒక పాటలో 'కాలర్‌ ట్యూన్‌ చేసుకుంటా నీ పేరు... కాలరెత్తి చెప్పుకుంటా నిన్ను నేను' అని రాసాడు.

కమర్షియల్‌ మసాలా పేరుతో ఇలాంటి సెన్స్‌లెస్‌నెస్‌తో నిండిపోయిన ఈ చిత్రంలో పతాక సన్నివేశాలు మాత్రం కాస్త సెన్సిబుల్‌గా అనిపిస్తాయి. కోర్ట్‌ రూమ్‌ డ్రామా, డైలాగ్స్‌ అన్నీ అంతకుముందు చూసిన దానితో పోలిస్తే చాలా మేలనిపిస్తాయి. కాకపోతే ముందే చెప్పినట్టు ఈ మెసేజ్‌ ఇవ్వడానికి ఇంత సినిమానే తీయాల్సిన అవసరం లేదు. తీద్దామని డిసైడ్‌ అయినపుడు ఇంత అలసత్వం పనికిరాదు.

బాటమ్‌ లైన్‌: అదే 'పంతం'!
- గణేష్‌ రావూరి

Show comments