ఎమ్బీయస్‌: మోదీకి కీలకమైన యుపిని యోగి గట్టెక్కిస్తాడా? - 2/2

ఇది ఎప్పణ్నుంచో గత ప్రభుత్వాల కాలం నుంచీ జరిగే అవకతవక వ్యవహారమై ఉంటుంది. ఇక్కడే కాదు, అనేక యితర ఆసుపత్రుల్లో కూడా నడుస్తూనే ఉండి ఉంటుంది. అది ఒప్పుకుని లెంపలేసుకుంటే సరిపోయేది. కానీ అలా కాకుండా మసిపూసి మారేడుకాయ చేద్దామని, అది కుదరనివ్వనివారిని వేధిద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సప్లయి కాకపోవడానికి కాలేజీ ప్రిన్సిపాల్‌ డా. రాజీవ్‌ మిశ్రా కారణమని ఆరోపించింది. ఆయన లంచం యిస్తే తప్ప బిల్లులు పాస్‌ చేయనని తొక్కి పెట్టేడని నేరం మోపి జైల్లో పెట్టింది. చెక్కులపై సంతకం పెట్టేది ఆయన ఒక్కడే కాదు. పోనీ ఈ ఆరోపణ గ్యాస్‌ సప్లయిరు చేశాడా అంటే అదీ లేదు. అతని మీదా కేసు పెట్టారు. బకాయిలు చెల్లించకపోతే సప్లయి ఆపేస్తానని అతను నోటీసులు పంపినా, యోగి దగ్గర్నుంచి అనేకమంది ఉన్నతాధికారులకు లేఖలు రాసిన ఎవరూ జవాబు యివ్వలేదని ఆధారాలున్నాయి. దాంతో అలహాబాదు హైకోర్టు ఏప్రిల్‌లో అతనికి బెయిలు యిచ్చింది.

గ్యాసు సరఫరా లేక తమ వాళ్లు చచ్చిపోయారని మృతుల బంధువులు సంఘటన జరగ్గానే టీవీల ముందు చెప్పారు. తర్వాత పోలీసులు రంగంలోకి దిగి వాళ్లను బెదిరించి, ''మా వాళ్లు ఆక్సిజన్‌ కొరత వలన కాదు, తీవ్రవ్యాధి వలన, సహజకారణాలతో మరణించారు.'' అని పోలీసు విచారణలో చెప్పించారు. అదే సమయంలో 'వైద్యాన్ని అందించడంలో నిర్లక్ష్యం చేశాడంటూ' డా. కఫీల్‌ ఖాన్‌ను అరెస్టు చేశారు.  సహజమరణమైనపుడు డాక్టరు నిర్లక్ష్యం ప్రశ్న ఎక్కడ వస్తుంది? ఆ వాదన నిలవదనుకున్నారేమో ఫ్రాడ్‌, అవినీతి, హోమిసైడ్‌, ప్రభుత్వనిధులను స్వాహా చేయడం, దుష్ప్రచారం చేయడం, కుట్ర చేయడం అనే సెక్షన్లు కూడా చేర్చారు. ఈ దుష్ప్రచారం అనేది ఎందుకు వచ్చి చేరిందంటే ఆయన ఆక్సిజన్‌ సరఫరా లేకనే అందరూ చచ్చిపోయారని మీడియాకు చెప్పాడు. అదీ కోపం.

నిజానికి ఆయన పిల్లల వార్డుకి ఇన్‌చార్జి కాదు. అవేళ సెలవులో కూడా ఉన్నాడు. అయినా అతనిమీదే నేరాలు మోపారు. ఆధారాలు మాత్రం చూపలేకపోయారు. దాంతో హైకోర్టు బెయిలు యిచ్చింది. బయటకు వచ్చాక కూడా కఫీల్‌ ఖాన్‌పై ప్రభుత్వానికి పగ పోలేదు. అతని సోదరుడు కశీఫ్‌ జమీల్‌పై జూన్‌ రెండోవారంలో యిద్దరు ఆగంతకులు కాల్పులు జరిపారు. 'సదర్‌ ఆసుపత్రికి తీసుకెళితే మెడికో లీగల్‌ కేసు అంటూ బిఆర్‌డికి వెళ్లమన్నారు. మీరే ట్రీట్‌ చేయవచ్చు కదా అంటే పోలీసులు వచ్చి ఐదు జీపుల్లో మమ్మల్ని బిఎల్‌డికి తీసుకెళ్లారు. రాత్రి 10 నుంచి నాలుగున్నర గంటలు వృథా చేసి చికిత్స ఆలస్యం చేశారు' అంటాడు కఫీల్‌ ఖాన్‌. ఈ విధంగా యోగి ప్రభుత్వం కక్షసాధింపులతో కోతిపుండుని బ్రహ్మరాక్షసి చేసుకుంది.

యోగికి స్వతంత్రంగా వ్యవహరించడానికి అనేక అడ్డంకులున్నాయి. అనేక గతంలో అఖిలేశ్‌ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అయిదున్నర మంది ముఖ్యమంత్రులున్నారు (ములాయం యిత్యాదులు) అని బిజెపి వెక్కిరించేది. ఇప్పుడు ఆ అంకె మరీ పెరిగింది. ఉపముఖ్యమంత్రులు యోగికి విధేయులు కారు. వారిలో దినేశ్‌ శర్మ మోదీకి సన్నిహితుడు. విద్యామంత్రిగా బోర్డు పరీక్షల్లో మోసాలు జరగకుండా వ్యక్తిగతంగా కూడా పర్యవేక్షిస్తున్నాడు. మరో ఉపముఖ్యమంత్రి కెపి మౌర్యాకు బిసిల్లో చాలా బలం ఉంది. అందువలన వారి స్వాతంత్య్రం వారిదే. బిజెపి రాష్ట్ర కార్యదర్శి సునీల్‌ బన్సాల్‌ది మరో అధికార కేంద్రం. అమిత్‌కు అనుయాయి, 2017 నాటి విజయానికి రూపకర్త.

ఆరెస్సెస్‌, అమిత్‌ షా, ప్రధాని కార్యాలయం కూడా నిరంతరం యోగిపై నిఘా వేసి చూస్తూ, మార్గదర్శకత్వం అంటూ 'సూచనలు' చేస్తూ సమాంతర అధికారకేంద్రాలు నడుపుతున్నారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ గత ఏడాది రాష్ట్రంలో 12 చోట్ల సమావేశాలు నిర్వహించాడు. బిజెపి ఎమ్మెల్యేల, ఎంపీల పనితీరుపై అధిష్టానానికి స్థానిక ఆరెస్సెస్‌ నాయకులు ప్రోగ్రెసు రిపోర్టులు పంపుతున్నారు. కాబినెట్‌ కూర్పులో అమిత్‌ చాలా జోక్యం చేసుకున్నాడు. ప్రధాని కార్యాలయం ప్రతి ముఖ్యమైన విషయం తనకు తెలియాలంటోంది. యుపి నుంచి కేంద్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన 12 మంది ఐఏఎస్‌ అధికారులను యుపికి పంపి, వాళ్ల ద్వారా విషయసేకరణ చేస్తున్నారు. యోగి తన అనుభవరాహిత్యంతో ఏదైనా పిచ్చిపని చేస్తే పార్టీ భారీమూల్యం చెల్లించాల్సి వస్తుంది కదాన్న ఆదుర్దా వాళ్లది.

దళితుల విషయంలో యోగి తప్పటడుగులు వేస్తున్నాడన్న భావన ఒకటి బలపడుతోంది. తొలినుంచీ బిజెపికి అగ్రవర్ణాల పార్టీగా పేరుండేది. దాన్ని చెరిపేసుకోవడానికి బిసిలను, ఎస్సీలను దగ్గరకు చేర్చుకుంటూ విస్తరిస్తోంది. అనేక చోట్ల రిజర్వ్‌డ్‌ స్థానాల్లో కూడా బిజెపి గెలుస్తోంది. అయితే యుపిలో ఆ పార్టీ దళిత ఎంపీ ఛోటే లాల్‌ ఖార్వార్‌ యోగి ప్రభుత్వం, రాష్ట్ర బిజెపి నాయకత్వం దళితుల పట్ల వివక్షత చూపుతున్నాయని బహిరంగంగా విమర్శించాడు. మరో ముగ్గురు బిజెపి దళిత ఎంపీలు కూడా అతనితో గొంతు కలిపి, ప్రభుత్వం దళితులను వేధిస్తోందని, కేంద్రమైతే బొత్తిగా దళిత రిజర్వేషన్లకు మంగళం పాడాలని చూస్తోందని ఆరోపించారు. వెంటనే రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో ఉన్న 25 మంది దళిత ఆఫీసర్ల పేర్లు వల్లించింది బిజెపి. ఏది ఏమైనా బిజెపి ప్రభుత్వమంటే మాది అనే భావనలో ఉన్న అగ్రవర్ణాలు గ్రామాల్లో  దళితులపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి.

బిసిలలో కూడా అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో బిజెపి యోగిని ముఖ్యమంత్రిగా చూపలేదు. కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య అనే బిసి నాయకుణ్నే ముందు పెట్టి నడిపించింది. ఫలితాలు వచ్చాక ఠాకూర్‌ అయిన యోగిని ముఖ్యమంత్రిని చేసి, మౌర్యను ఇద్దరు ఉపముఖ్యమంత్రుల్లో ఒకడిగా చేసింది. బిజెపి భాగస్వామ్య పక్షమైన భారతీయ సమాజ్‌ పార్టీ నాయకుడు, యుపి మంత్రి ఐన ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ ఈ విషయాన్ని జూన్‌లో బహిరంగంగా ప్రస్తావించి, విమర్శించాడు. ఉపయెన్నికలలో వరుస ఓటముల కారణంగానే యోగిని విమర్శించడానికి వారికి ధైర్యం చిక్కింది.

బిసిల అసంతృప్తి బిజెపికి ఆందోళనకరం. ఎందుకంటే ఏ మాత్రం జాగ్రత్తగా వ్యవహరించకపోయినా బిసిలు మళ్లీ ఎస్పీవైపు మరలవచ్చు. 1996లో యుపిలో 33% ఓట్లు వచ్చినా బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దానిపై పార్టీ గోవిందాచార్యతో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ సమస్య అధ్యయనం చేసి, బిసిలలోని లోధులను తమవైపు తిప్పుకోవాలని సూచించింది. సోషల్‌ ఇంజనీరింగు పేరుతో దీన్ని బిజెపి అమలు చేసింది. కళ్యాణ్‌ సింగ్‌, ఉమాభారతి ఆ కులానికి చెందినవారే. ఈ సారి ఎన్నికలలో యాదవేతర బిసిలను, జాతవేతర దళితులను బిజెపి చేరదీసి విజయం సాధించింది. రాబోయే ఎన్నికలలో ఎస్పీ-బియస్పీ కూటమి ఏర్పడితే బిసి-దళిత కాంబినేషన్‌ బిజెపిని సులభంగా ఓడిస్తుంది. దీనికి విరుగుడు మంత్రం వేయడనికి బిసిలను వర్గీకరణ పేరుతో మూడు వర్గాలుగా విడగొట్టడమొకటే మార్గం అని బిజెపి ఫిక్సయింది.

బిసి రిజర్వేషన్‌ ఫలితాలను యాదవులు, కూర్మీలు, లోధులు, జాట్లు (జనాభాలో 19% ఉంటారు) ఎక్కువగా అనుభవిస్తున్నారు. ఆ కారణంగా రాజకీయంగా కూడా బలంగా ఉంటున్నారు. దాంతో చాలా మంది ఒబిసి కులాల వారు తమను షెడ్యూల్డ్‌ కులాలుగా గుర్తించమని అభ్యర్థిస్తున్నారు. అలాటి 17 కులాలను ప్రభుత్వం గుర్తించి ఎస్సీలలో కలుదామనుకుంది. కానీ ఎస్సీ వర్గాల్లో సౌకర్యాలు అనుభవిస్తున్న జాతవులు వారిని రానివ్వటం లేదు. ఇప్పుడు బిజెపికి లోధుల్లో కూడా లీడరు లేడు. బిసి నాయకులెవరైనా అర్జంటుగా కావాలి. జనాభాలో 6% ఉన్న కుశావహా కులస్తుడైన మౌర్యను ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుణ్ని చేశారు. యాదవేతర బిసిలను అతను కలుపుకుని వచ్చాడు. అందువలన ముఖ్యమంత్రి కావచ్చని అందరూ అనుకున్నారు. కానీ కాలేదు.

ఒబిసిలలో వర్గీకరణ కొత్త ఐడియా ఏమీ కాదు. 2001లో అప్పటి ప్రభుత్వం లెక్కలు తీయించింది. 70 కులాలున్న మోస్ట్‌ బాక్‌వర్డ్‌ (మరీ వెనకబడిన) కులాలవారు మొత్తం ఒబిసి జనాభాలో 62% ఉన్నారు. వీరికి 14% రిజర్వేషన్‌ యిస్తానంది. 8 కులాలున్న మోర్‌ బాక్‌వర్డ్‌ (కాస్త వెనకబడిన) కులాలవారు మొత్తం ఒబిసి జనాభాలో 19% ఉన్నారు. వీరికి 9% రిజర్వేషన్‌ యిస్తానంది. తక్కిన బిసిలు 19% ఉన్నారు. వీరికి 5% రిజర్వేషన్‌ యిస్తానంది. జనాభాలో 50% ఉన్న బిసిలకు యిస్తున్న 28% కోటాను యిలా సర్దడాన్ని సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ఇప్పుడు బిజెపి మళ్లీ యీ ప్రతిపాదనను ముందుకు తెస్తోంది.  కానీ యిదేమీ నడిచే వ్యవహారం కాదంటాడు శరద్‌ యాదవ్‌. ''బిహార్‌లో యీ ప్రయోగం ఎప్పుడో విఫలమైంది. కొత్త ఉద్యోగాలుంటేనే యీ రిజర్వేషన్‌ ఫలాలు వారికి అందుతాయి. ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాలు వీళ్లకు ఏం యివ్వగలుగుతాయి? పైగా ఒబిసిలను వర్గీకరించినా వాళ్లల్లో వాళ్లు తగవులాడుకోలేదు. వాళ్లు విడిపోకపోతే వీరికేం లాభం?'' అన్నాడు.

ప్రస్తుతం యోగి ప్రభుత్వానికి తలనొప్పిగా రగులుతున్న సమస్య - శిక్షా మిత్ర టీచర్ల వ్యవహారం, టీచర్ల ఆందోళన, నిరసన ప్రదర్శనలు! యుఎన్‌ మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌ ఒప్పందంపై భారతదేశం 2000 సం.రంలో సంతకం పెట్టాక అనేక రాష్ట్ర ప్రభుత్వాలు శిక్షామిత్ర వ్యవస్థను అమలులోకి తెచ్చాయి. ఊరూరా, గ్రామగ్రామాలా తిరిగి విద్య అవసరాన్ని అందరికీ విశదీకరించి, బడి మానేసిన పిల్లల తలిదండ్రులను ఒప్పించి, తిరిగి బడికి రప్పించడం వీరి పని. దానికి గాను గౌరవవేతనం చెల్లిస్తారు. వీళ్లు 12 వ తరగతి చదివి ఉండాలి. కొంతకాలం పోయాక ప్రభుత్వాలు వీళ్లు 8వ క్లాసు వరకు పిల్లలకు చదువు చెప్పే బాధ్యత కూడా అప్పగించాయి. యుపిలో ఎలిమెంటరీ స్థాయిలో 7.60 లక్షల టీచరు పోస్టులున్నాయి. వాటిలో 1.75 లక్షల పోస్టులు ఖాళీగా వుంటే, వాటిలో 1.72 లక్షలను వీళ్లతో నింపి బండి నడిపించారు.

2009లో పాస్‌ అయిన రైట్‌ టు ఎడ్యుకేషన్‌ చట్టంతో పరిస్థితులు మారాయి. అది నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌కు ఉపాధ్యాయుల అర్హతలను నిర్ధారించమంది. టీచర్లందరూ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్ష పాసై ఉండాలని కౌన్సిల్‌ నిబంధన విధించింది. యుపిలోని శిక్షామిత్రులు చాలామంది అది పాస్‌ కాలేదు. సమాజ్‌వాదీ ప్రభుత్వం కౌన్సిల్‌ నిబంధనను సడలించి టెట్‌ పాసవ్వక్కరలేదు అంటూ శిక్షామిత్రులను రెగ్యులరైజ్‌ చేసింది. కానీ 2015లో అలహాబాద్‌ హైకోర్టు ఆ సవరణను కొట్టేసింది. యుపి ప్రభుత్వం దానిపై సుప్రీం కోర్టుకి వెళ్లింది. 2017 జులైలో సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. వీళ్లందరూ గ్రాడ్యుయేట్‌లు అయి వుండాలని, టెట్‌ పాస్‌ కావాలని తీరాలంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పాస్‌ కావడానికి రెండు ఛాన్సులు యిచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి శిక్షామిత్ర వ్యవహారం కోర్టులో నలుగుతోంది. 'ఇది 1.72 లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్య. మేం అధికారంలోకి వస్తే మూణ్నెళ్లలో పరిష్కరిస్తాం.' అని బిజెపి హామీ యిచ్చింది. కానీ యోగి ప్రభుత్వం కోర్టు తీర్పు రాగానే జీతాలు ఆపేసింది. వీళ్లలో కొంతమంది డిగ్రీ పాసై ఉన్నారు, టెట్‌ కూడా పాసయ్యారు. వాళ్లనైనా రెగ్యులరైజ్‌ చేయడం లేదు. యోగి వాళ్లకు నెలకు రూ.10 వేలు యిస్తానంటున్నాడు. 'రూలు ప్రకారం మాకు రూ.38878 రావాలి. ఈ పదివేలు ఏ మూలకు? మా చేత బూత్‌ లెవెల్‌ ఆఫీసర్ల పని కూడా చేయిస్తున్నారు. ఎన్నికల ఐడి కార్డులను వెరిఫై చేసే పని అప్పగించారు. కానీ జీతాల వద్దకు వచ్చేసరికి యిలా ఉంది' అంటున్నారు వాళ్లు.

టీచర్లంతా ఉద్యమబాట పట్టారు. జాతీయ సగటు ప్రకారం 23 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉన్నాడు. కానీ యుపిలో 39 విద్యార్థులకు 1 టీచరు మాత్రమే ఉన్నాడు. ఇప్పుడీ శిక్షామిత్రులను తీసేయడంతో ఎలిమెంటరీ స్థాయిలో 1.72 లక్షలమంది టీచర్లు తగ్గిపోయి, విద్యార్థుల సంఖ్య మరీ పెరుగుతోంది. విద్యాప్రమాణాలు మరీ తగ్గుతున్నాయి. ఇలాటి పరిస్థితుల్లో యోగి, యుపిలో ఘనవిజయం సాధించిపెడతాడనేది సందేహాస్పదమే. అమిత్‌ షాయే పూనుకుని, తన రాజకీయ చాతుర్యంతో కొందర్ని విడదీసి, మరి కొందర్ని కలిపి, సామదానభేద దండోపాయాలతో ఏదైనా అద్భుతాన్ని సాధించాలి.  (ఫోటో - శిక్షామిత్రుల ఊరేగింపు)

(సమాప్తం) - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2018) 
mbsprasad@gmail.com

Show comments