వైఎస్సార్ త‌న‌యుడిగా ముస్లింల‌కు జ‌గ‌న్ భ‌రోసా

ఈ ద‌ఫా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లింల రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తుంద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ఈ మేర‌కు తెలంగాణ బీజేపీ ఎంపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా వెలువ‌రించిన మేనిఫెస్టోలో మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తామ‌ని పేర్కొంది. అయితే ఏపీలో టీడీపీ, జ‌న‌సేన‌తో పొత్తు వ‌ల్ల‌... రాజ‌కీయంగా న‌ష్టం వ‌స్తుంద‌ని బీజేపీ డ్రామాలాడుతోంది. 

ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌పై చంద్ర‌బాబునాయుడు నాట‌కాలాడుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ముస్లింల రిజ‌ర్వేష‌న్లపై వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గ‌ట్టి భరోసా ఇచ్చారు. క‌ర్నూలులో గురువారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌గ‌న్ మైనార్టీల‌కు భ‌రోసా ఇచ్చారు.

ఆరు నూరైనా, నూరు ఆరైనా ముస్లింల‌కు నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్లు ఉండి తీరాల్సిందే అని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇది మీ జ‌గ‌న్ మాట‌, ఇది మీ వైఎస్సార్ త‌న‌యుడి మాట అని జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పించారు. ప్ర‌ధాని మోదీ స‌మ‌క్షంలో మైనార్టీల రిజ‌ర్వేష‌న్ల‌పై చంద్ర‌బాబు త‌న‌లా హామీ ఇవ్వ‌గ‌ల‌రా? అని జ‌గ‌న్ నిలదీశారు. ముస్లిం మైనార్టీల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌న్న బీజేపీతో చంద్ర‌బాబు ఎందుకు అంట‌కాగుతున్నార‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబుది ఊస‌ర‌వెల్లి రాజ‌కీయ‌మ‌ని ఆయ‌న తూర్పార ప‌ట్టారు.

త‌మ రిజ‌ర్వేష‌న్ల‌పై వైఎస్ జ‌గ‌న్ గ‌ట్టి భ‌రోసా ఇస్తుండ‌డంతో ముస్లింల‌లో న‌మ్మ‌కం ఏర్ప‌డింది. బీజేపీ కూట‌మిపై ముస్లింలు ర‌గిలిపోతున్నారు. బ‌హిరంగంగా ముస్లింల రిజ‌ర్వేష‌న్లు తొల‌గిస్తామ‌ని చెబుతున్నా చంద్ర‌బాబు, ప‌వ‌న్ నోరెత్త‌క‌పోవ‌డంపై వారు తీవ్ర ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు.