పాపం రాజా వారు!

విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారిది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఆయన జనతా పార్టీ నుంచి 1978లో తొలిసారి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. 1983 నాటికి టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి రెండవసారి ఎమ్మెల్యే అయ్యారు.  అలా టీడీపీలో వ్యవస్థాపక సభ్యుడుగా ఉంటూ ఎన్టీఆర్ జమానాలో ఒక వెలుగు వెలిగారు.

ఆయన చంద్రబాబుకు సమకాలీనుడు. టీడీపీ 1995లో రెండుగా చీలినప్పుడు బాబు పక్షం వహించి ఆయన సీఎం కావడానికి తన వంతుగా కృషి చేసిన వారు అశోక్.  టీడీపీలో ఒక సందర్భంలో అత్యంత కీలకంగా రాజు గారి పాత్ర ఉండేది.

అంతటి రాజు గారు ఇపుడు టీడీపీ మూడవ తరం వారసుడు నారా లోకేష్ విజయనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూంటే పక్కన నిలబడి నవ్వులు చిందిస్తున్న ఫోటోలు చూసిన వారు పాపం రాజు గారు ఆనే అంటున్నారు. టీడీపీకి తొలి నుంచి ఉన్న వారిలో ఒక విధంగా వ్యవస్థాపక బృందంలో రాజు గారు ఒకరు.

కానీ ఆయన కూడా అందరి లాంటి వారుగా ఒక మామూలు నాయకుడిగానే ఈ ప్రాంతీయ పార్టీలో మిగిలిపోయారు. ప్రాంతీయ పార్టీలలో ఎవరెంత సేవలు అందించినా హక్కుభుక్తాలు వారసులకే దక్కుతాయన్నది దేశంలోని ప్రాంతీయ రాజకీయ చరిత్ర చూస్తే అర్ధం అవుతుంది. అలా చూస్తే రాజు గారు టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయిన నాటికి పుట్టని లోకేష్ నాయకత్వంలోనూ ఈ రోజు పనిచేయాల్సి వస్తోంది అన్నదే రాజకీయ వింతగా చెప్పుకుంటున్నారు.

టీడీపీలో సీనియర్లకు చాలా ఈజీగా ఈ ఎన్నికల్లో రిటైర్మెంట్ ఇచ్చేసిన చంద్రబాబు రాజు గారి కుమార్తెకు మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆమె ఈసారి గెలిస్తే పూసపాటి వారి మూడవ తరం రాజకీయంగా కొనసాగుతుంది. లేకపోతే విజయనగరం రాజకీయ చరిత్రలో పూసపాటి వంశానికి బ్రేకులు పడినట్లే అంటున్నారు. దాదాపుగా ఎనభై ఏళ్ళ నుంచి నుంచి పూసపాటి రాజులు చట్ట సభల ద్వారా నెగ్గుతూ రాజకీయాలను శాసిస్తున్నారు. ఈసారి ఏమి జరుగుతుంది అన్నది ప్రజల చేతులలో ఉంది.