మోడీకి ధీటైన కౌంటరేసిన జగన్ !

ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్నికల సభకు వచ్చిన ప్రధాని మోడీ ఏపీ ప్రభుత్వం మీద జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పోలవరం కట్టలేదు అన్నారు. రాజధాని నిర్మాణంలో లేదు అన్నారు. రైల్వే జోన్ తాము కట్ట లేకపోవడానికి జగన్ భూములు ఇవ్వకపోవడం కారణం అన్నారు.

ఇలా చాలా విమర్శలు చేసిన మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎవరు కారణమో చెప్పకుండానే ప్రసంగం ముగించేశారు. సరిగ్గా ఇరవై నాలుగు గంటల తేడాలో గాజువాకకు అంటే స్టీల్ ప్లాంట్ లోకేట్ అయి ఉన్న ప్రాంతానికి సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు.

విశాఖకు మోడీ ఏమి చేయలేదో విడమరచి జనాలకు చెప్పారు. రైల్వే జోన్ కి భూములు ఇవ్వలేదు అన్న మోడీ ఆరోపణలను గట్టిగానే తిప్పికొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం భూములను ఇస్తే కేంద్రమే తీసుకోలేదు అని జగన్ అసలు విషయం చెప్పారు. భూముల సర్వే నంబర్లతో సహా ఆ మధ్య ప్రభుత్వ అధికారులు వివరాలు ఇచ్చినా మోడీ అదే మాట అనకాపల్లి లో చెప్పడంతో జగన్ కౌంటర్ ఇలా ఇచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకుండా ఇన్నాళ్ళూ అడ్డుకున్నది తమ ప్రభుత్వమే అని మరో సత్యం చెప్పారు. టీడీపీ కూటమికి ఓటు వేస్తే కనుక స్టీల్ ప్లాంట్ ఇక మిగలదు అని జగన్ హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి అంటే కనుక వైసీపీనే గాజువాకలో గెలిపించాలని అని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు.

అయిదేళ్ళ క్రితం చంద్రబాబుని అవినీతిపరుడు అన్న మోడీకి ఇపుడు ఆయనలో తేడా ఏమి కనిపించిందని జగన్ నిలదీశారు. తమ పక్కకు వస్తే చాలు ఎవరైనా పునీతులు అయిపోతారా అని జగన్ ప్రశ్నించారు. మోడీతో కలసి జనం ముందుకు వచ్చిన ఎన్డీయే కూటమి ఏపీకి చేసే పెద్ద మేలు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీని జగన్ ఈ తీరున విమర్శించడం ద్వారా బీజేపీ పెద్దలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టినట్లు అయింది.