జగన్ ఇచ్చ ఈసారి అయినా తీరుతుందా?

జగన్ పాదయాత్ర మూడున్నర వేల పై చిలుకు పాదయాత్ర చేశారు. అది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా నడిచారు. 2018లో  అక్కడ గుమ్మడికాయ కొట్టి ఘనంగా ముగించారు. 2019లో రాష్ట్రమంతా జగన్ వేవ్ సాగినా ఇచ్చాపురంలో మాత్రం తెలుగుదేశం జెండా ఎగిరింది. అయితే 2014లో వచ్చిన మెజారిటీ కంటే బాగా తగ్గింది.

ఈసారి ఇచ్చాపురాన్ని కొట్టాలని అక్కడ వైసీపీ కసిగా పనిచేస్తోంది. జగన్ సైతం శ్రీకాకుళం జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న పిరియా విజయని ఎమ్మెల్యే అభ్యర్ధిగా చేశారు. ఇచ్చాపురంలో వరసగా రెండు సార్లు గెలిచిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ మీద యాంటీ ఇంకెంబెన్సీ ఉంది.

దానికి ఈసారి సొమ్ము చేసుకోవాలని వైసీపీ చూస్తోంది. 2009లో ఇచ్చాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పిరియా సాయిరాజ్ వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలో జగన్ ఇచ్చాపురంలో ఎన్నికల సభను నిర్వహించనున్నారు.

ఇచ్చాపురం సీటుని ఈసారి కొట్టి తీరాల్సిందే అని వైసీపీ అధినేత పట్టుదలగా ఉన్నారు. టీడీపీకి కంచుకోట లాంటి ఈ సీటులో గెలిస్తే వైసీపీ అద్భుతమైన విజయం సాధించినట్లు లెక్క. ఇచ్చాపురంలో జగన్ ఎన్నికల సభ మంగళవారం జరగనుంది. ఆయన సభకు ఎటూ జనాలు తరలి వస్తారు.

ఈసారి జగన్ ఇచ్చను వారు నెరవేరుస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇచ్చాపురంలో వైసీపీకి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయన్న అంచనాల నేపధ్యంలో జగన్ ఎన్నికల సభ ఆసక్తిని రేపుతోంది. ఇచ్చాపురం నుంచి వైసీపీ జైత్ర యాత్ర మొదలవుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఏమి జరుగుతుందో రేపటి సభ ఎంతో కొంత క్లారిటీ ఇస్తుందని అంటున్నారు.