చిన్నమ్మ క్లారిటీ: జగన్‌ను అవసరానికి వాడుకున్నాం!

భారతీయ జనతా పార్టీ ఇన్నాళ్లూ వైఎస్సార్ కాంగ్రెస్ తో కుమ్మక్కు రాజకీయం నడిపిందని, ఇప్పుడు ఎన్నికలు రాగానే.. తెలుగుదేశంతో జట్టు కట్టిందని కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయో లేదో తర్వాతి సంగతి.. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన మాట నిజం. ఆయన ఏనాడూ మోడీ సర్కారుతో వైరం పెట్టుకోవడానికి ప్రయత్నించలేదు. అలాగే మోడీ సర్కారు కూడా కీలకమైన బిల్లుల విషయంలో రాజ్యసభలో తమ కూటమి సొంత బలం చాలక, గణనీయంగా ఎంపీలు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ మీద ఆధారపడుతూనే వచ్చింది.

జగన్ స్నేహపూర్వకంగా వ్యవహరించినందుకు, బిల్లుల విషయంలో వారికి సహకరించినందుకు ప్రతిగా.. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఒనగూర్చిన ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ లేవు. తీరా ఇప్పుడు జగన్ నే ఓడించడానికి బరిలో ఉన్నారు. అయితే తమ అవసరాల కోసం జగన్ ను వాడుకుని వదిలేసాం అని సంకేతాలు వచ్చేలాగా.. పురందేశ్వరి ఇప్పుడు అసలు సంగతి బయటపెడుతున్నారు.

ముఖ్యమైన బిల్లుల ఆమోదం విషయంలో ఫ్లోర్ మేనేజిమెంట్ లో భాగంగా.. జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ తో స్నేహంగా మెలిగామే తప్ప.. ఆయన తమకు శత్రువేనని దగ్గుబాటి పురందేశ్వరి సూటిగా చెప్పేశారు. అవసరానికి వాడుకుని వదిలేసే అవకాశవాద వైఖరి తమదని ఆమె చెప్పకనే చెప్పినట్లు అయింది. తాజాగా అమిత్ షా మాటలను గమనిస్తే.. ఆమె బయటపెట్టిన సీక్రెట్ నిజమే అనిపిస్తోంది.

ఎందుకంటే.. రాజ్యసభలో ఎన్డీయే కూటమికి బిల్లులు నెగ్గించుకోగల బలం లేని సమయంలో.. బిజెపి, వైసీపీ బలం మీద ప్రధానంగా ఆధారపడింది. అమిత్ షా స్వయంగా జగన్ కు ఫోను చేసి ఆ పార్టీ సహాయాన్ని అభ్యర్థించారు. కానీ పోలవరానికి నిధుల విడుదల వంటి అంశాలను ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనల్లో జగన్ విన్నవించినా అటు వైపు నుంచి స్పందన మాత్రం లేదు.

ఇప్పుడు ధర్మవరంలో సభ పెట్టి.. జగన్ భూమాఫియాను అంతం చేస్తామని, గూండా రాజ్యాన్ని అంతం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈసారి తమకు రాజ్యసభలో కూడా అవసరమైనంత బలం వచ్చేస్తుందనే నమ్మకంతో బిజెపి విర్రవీగుతున్నట్టుగా ఉంది. ఇది వారి పచ్చి అవకాశవాదవైఖరిగా కనిపిస్తోంది.

అందుకే జగన్ కూడా.. మన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే.. మనకు 25 ఎంపీ సీట్లు దక్కడం మాత్రమే కాదు.. కేంద్రంలో మన మీద ఆధారపడి మాత్రమే ప్రభుత్వం ఏర్పాటుచేయగలిగేలా బిజెపి ఓడిపోవాలి కూడా అని అంటున్నారు.