ఆ రేంజి ప్రగల్భాలు పలికితేనే ఆయన పవన్!

రాజకీయ నాయకులు అంటేనే లాజిక్ కు అందని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. మాటలు కోటలు దాటుతుంటాయి. అలాంటి ప్రగల్భాల నాయకుల్లో పవన్ కల్యాణ్ ను మించిన వారు లేరు. కిందపడినా సరే పైచేయి నాదే అని చాటుకునే పవన్ కల్యాణ్ వైఖరి గురించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు.

ఒంటరిగా జనసేన పోటీచేస్తే.. ఏక పక్షంగా సీఎం అయిపోతానని విర్రవీగిన ఆయన తాను రెండు చోట్ల పోటీచేసి ఒక్కచోట కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. కనీసం జనసేనకు గుర్తింపు ఉన్న పార్టీ అనే హోదాను కూడా సాధించలేకపోయారు. ఈరోజు కూటమిలో ఆయనతో కలిసి పోటీచేస్తున్న తెలుగుదేశం, భాజపా అభ్యర్థుల విజయావకాశాలను ప్రమాదంలోకి నెట్టారు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏదో పొత్తుల పుణ్యమాని తాను ఎమ్మెల్యేగా గెలిచి సభలో అడుగుపెట్టగలను అని ఆశపడాలి గానీ.. అంతకు మించిన ఉత్తరకుమార ప్రగల్భాలతో నవ్వుల పాలు అవుతున్నారు.

తమ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా రాష్ట్రంలోని అయిదు కోట్ల మందికి ధైర్యం నూరిపోసిందని పవన్ కల్యాణ్ అంటున్నారు. ధైర్యం అంటే అదేదో ఆయుర్వేద వైద్యుడు నూరిపోసే మందులాంటిదని పవన్ కల్యాణ్ అనుకుంటున్నట్టుగా ఉంది. మరి అయిదుకోట్ల మందిలో ఆయన ధైర్యం నూరిపోస్తే.. తన పార్టీ తరఫున ఒంటరిగా పోటీచేసి.. తన పార్టీకి అయిదుకోట్ల ఓట్లు వేయించుకుని.. డైరక్టుగా సీఎం అయిపోవచ్చు కదా.. అనేది ప్రజల సందేహం.

‘నేను బతికి ఉండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను. దేశ ఐక్యతకు భంగం రానివ్వను’ అని పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు, పంచ్ డైలాగులు వల్లిస్తున్నారు. ఈయన పోటీచేస్తున్న ఎమ్మెల్యే స్థానంలో గెలిచినా గెలవకపోయినా.. దేశఐక్యతకు దానికి సంబంధం ఏమిటో ప్రజలకు బుర్ర చించుకున్నా అర్థం కావడం లేదు. 

అంతకంటె తమాషా ఏంటంటే.. ‘ప్రతి ఓటమి జనసేనను మరింత బలపడేలా చేసింది’ అని పవన్ కల్యాణ్ ప్రగల్భాలు పలకడం! ఆయన  పార్టీ ఇప్పటిదాకా ఒకటే ఎన్నికల్లో పోటీచేైసింది. ప్రతి ఓటమి తమను మరింత బలపడేలా చేసిందని అంటున్నారు. ఈ మాటలు విని జనం మాత్రం.. మళ్లీ మీ పార్టీ మొత్తంగా ఓడిపోయిందంటే.. ఇంకా చాలా పడతారు పవన్ జీ.. పూర్తిగా ఓడిపోండి.. వచ్చే ఎన్నికలకు తమరు పొత్తుల్లేకుండా డైరెక్ట్ సీఎం అయ్యేలాగా బలపడతారు.. అంటూ జోకులు వేసుకుంటున్నారు.