మోదీకి వైసీపీ మంత్రి సంచలన సవాల్!

ఎన్నికల ప్రచారం కోసం అనకాపల్లికి వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సరైన సవాల్ చేశారు వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాధ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయబోమని ప్రధాని ఈ నెల 6న అనకాపల్లిలో జరిగే సభలో కీలకమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మోదీ ఆ ప్రకటన చేస్తే కనుక తాను ఈసారి ఎన్నికలలో పోటీ చేయను అని గాజువాక బరి నుంచి వైసీపీ అభ్యర్ధిగా తప్పుకుంటాను అని ఆయన సంచలనం రేకెత్తించే సవాల్ చేశారు. తనకు తన కుటుంబానికి పదవులు ముఖ్యం కాదని ఈ సందర్భంగా గుడివాడ వ్యాఖ్యానించారు.

తన తాత, తండ్రి ఇద్దరూ ఎమ్మెల్యేలు అని తన తండ్రితో పాటు తాను మంత్రులుగా చేశామని అన్నారు. అందువల్ల తమకు పదవులు కొత్త కాదని తమ కుటుంబానికి రాజకీయ ప్రతిష్ట ఉందని అన్నారు. తనకు విశాఖకే కాదు ఏపీకే తలమానికం అయిన స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగడమే ముఖ్యమని ఆయన అన్నారు.

ఈ విషయంలో తాను పోరాటానికి సిద్ధం అన్నారు. గాజువాక పరిధిలోని స్టీల్ ప్లాంట్ ని రక్షించుకుంటామని అన్నారు. నరేంద్ర మోడీ ఎన్నికల సభ కోసం వస్తున్నందున ఆయన ఈ ముఖ్యమైన హామీ ఇస్తే కనుక విశాఖతో పాటు యావత్తు ఆంధ్ర సమాజం హర్షిస్తుందని ఆయన అన్నారు.

కేవలం ఎన్నికల హామీలుగా ఏ ఇతరమైనవి ఇచ్చినా విశాఖ వాసులు సంతోషపడరని, వారికి కావాల్సింది స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగడమే అని అన్నారు. దానికి సరిసాటి వేరేది లేదని అన్నారు. ఈ విషయం మీద దేశాన్ని ఏలే బీజేపీ ఏపీ మీద విశాఖ మీద ప్రేమను చాటుకోవాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు. నరేంద్ర మోడీ సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఉంటుందా అంటే డౌటే అంటున్నారు. ఆయన చాలా విషయాల మీద మాట్లాడకపోవచ్చు అంటున్నారు. అందులో ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్, పోలవరం వంటి అంశాలు ఉంటాయని అంటున్నారు.