గాజుగ్లాసుపై వీడ‌ని ఉత్కంఠ‌!

గాజుగ్లాసుపై కూట‌మిలో ఉత్కంఠ కొన‌సాగుతోంది. జ‌న‌సేన కేవ‌లం రిజిస్ట‌ర్డ్ పార్టీ కావ‌డంతో దాని గుర్తు గాజుగ్లాసును ఫ్రీ సింబ‌ల్‌గా వుంచారు. జ‌న‌సేన పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే గాజుగ్లాసును ఆ పార్టీకి కేటాయించారు. మిగిలిన చోట్ల స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు కేటాయించారు. దీంతో జ‌న‌సేన ల‌బోదిబోమంటూ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించింది.

ఏపీ హైకోర్టు ప‌లు ద‌ఫాలుగా విచారించింది. ఎన్నిక‌ల‌కు గ‌డువు ద‌గ్గ‌ర ప‌డ‌డంతో 24 గంట‌ల్లో గాజుగ్లాసు గుర్తుపై తేల్చాల‌ని కేంద్ర‌ ఎన్నిక‌ల సంఘాన్ని న్యాయ‌స్థానం ఆదేశించింది. జనసేన పోటీచేసే రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల ప‌రిధిలో, అలాగే ఆ పార్టీ  పోటీ చేస్తున్న‌ 21 అసెంబ్లీ స్థానాలున్న లోక్‌సభ నియోజక వర్గాల్లో పోటీచేసే అభ్యర్థులెవరికీ గాజు గ్లాసు గుర్తు ఇచ్చేది లేద‌ని హైకోర్టుకు ఈసీ తెలిపింది. ఈ మేర‌కు రిటర్నింగ్‌ అధికారు(ఆర్వో)లకు ఆదేశాలిచ్చిన‌ట్టు హైకోర్టుకు ఈసీ నివేదించింది. దీంతో న్యాయ‌స్థానం విచార‌ణ‌ను కూడా మూసివేసింది.

కానీ కూట‌మి సంతృప్తి చెంద‌లేదు. మిగిలిన చోట్ల గాజుగ్లాసు గుర్తు కేటాయించ‌డంపై ఆందోళ‌న చెందుతోంది. ఈ నేప‌థ్యంలో న్యాయ‌స్థానాన్ని టీడీపీ ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం. మూడు పార్టీలు కలిసి కూట‌మిగా ఏర్ప‌డి పోటీ చేస్తున్నాయ‌ని, గాజుగ్లాసు గుర్తును స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు కేటాయిస్తే త‌మ‌కు న‌ష్ట‌మ‌ని పేర్కొంది. కావున గాజుగ్లాసు గుర్తును ఇత‌రులెవ‌రికీ కేటాయించ‌కుండా జ‌న‌సేన‌కే రిజ‌ర్వ్ చేయాలంటూ టీడీపీ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. టీడీపీ పిటిష‌న్‌పై గురువారం విచార‌ణ జ‌ర‌గ‌నుంది. గాజుగ్లాసు గుర్తు స్వ‌తంత్రుల‌కు కేటాయించ‌డంపై కూట‌మి తీవ్రంగా భ‌య‌ప‌డుతోంద‌నేందుకు న్యాయ‌స్థానంలో పోరాట‌మే నిద‌ర్శ‌నం.

గాజుగ్లాసు గుర్తు స్వ‌తంత్రుల‌కు కేటాయిస్తే ఏదో అవుతుంద‌నే భ‌యాందోళ‌న ముఖ్యంగా టీడీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. అందుకే జ‌న‌సేన కంటే ఎక్కువ‌గా టీడీపీ గాజుగ్లాసు గుర్తుపై న్యాయ పోరాటానికి ఆత్రుత ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇవాళ కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో మ‌రి!