ఏపీలో సభలకు మోడీ నో!

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం వస్తుంది.. అని పాపం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పదేపదే చెప్పుకుంటూ తిరుగుతున్నారు గానీ.. వారి కూటమి అంతర్గత రాజకీయాల్లో అసలు ఏం జరుగుతున్నదో అర్థం కావడం లేదు.

భాజపా కూడా మా జట్టులో ఉన్నది అని వీరు టముకు వేసుకుంటూ ఉంటారు. కానీ కమలదళం నేతలు మాత్రం వీరితో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమి మేనిఫెస్టో అని ప్రకటించారు గానీ.. అది కేవలం తెలుగుదేశం, జనసేన మేనిఫెస్టోగానే లెక్కతేలింది. ఆ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బిజెపి నేత కనీసం ఆ కాపీని చేత్తో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు.

అయితే ఇప్పుడు కూటమిలోని లుకలుకల రాజకీయాలను ధ్రువీకరించేలాగా ఒక కొత్త సంగతి బయటకు వస్తోంది. భారతీయ జనతా పార్టీ లోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ప్రధాని నరేంద్రమోడీ ఏపీలో ఎన్నికల సభల్లో పాల్గొనడం లేదని సమాచారం.

చంద్రబాబు, పవన్ ల వైఖరిపై భాజపా పెద్దలు గుర్రుగా ఉన్నారని.. ఇప్పటికిప్పుడు ఎన్డీయే కూటమినుంచి ఆ పార్టీలను వెలివేస్తున్నట్టుగా ప్రకటిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి గనుక.. గుంభనంగా ఉన్నారని సమాచారం. వీరి వైఖరితో విసిగిపోయి ఏపీలో ప్లాన్ చేసిన ఎన్నికల సభల షెడ్యూలును కూడా మోడీ రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 3,4 తేదీల్లో తెలంగాణలో పర్యటించి ఎన్నికల సభలు, రోడ్ షో లు నిర్వహిస్తారని కొన్ని వారాల కిందట ఒకసారి షెడ్యూలు ప్రకటించారు. ఆమేరకు నల్గొండ జిల్లాలో కూడా మోడీ సభలు ఉంటాయని ప్రకటించారు. కానీ ఆ షెడ్యూలు తర్వాత మారింది. అదే 3,4 తేదీల్లో మోడీ పర్యటన ఏపీలో ఉంటుందని కొన్ని రోజుల కిందట ప్రకటించారు. రాజంపేట, రాజమండ్రిల్లో సభలు, విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారని ప్రకటించారు.

అయితే ఈ కొన్ని రోజుల వ్యవధిలో కూటమిలో జరిగిన లుకలుకల రాజకీయాల పర్యవసానంగా ఏపీలో కాకుండా తెలంగాణలోనే సభలు నిర్వహించేలా మోడీ షెడ్యూలును మార్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీల పరువు పోవడం గ్యారంటీ అని అంతా అనుకుంటున్నారు. మోడీ భక్త ఓటు బ్యాంకు... ఖచ్చితంగా ఆ రెండు పార్టీలకు పోల్ కాదు అని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు.