మేనిఫెస్టో ... న‌మ్మం బాబూ!

టీడీపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి మేనిఫెస్టో ప్ర‌జాగ‌ళాన్ని న‌మ్మేదెలా? అని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు. కూట‌మిలోని బీజేపీ మేనిఫెస్టోలో భాగ‌స్వామ్యం కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో అనుమానాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న‌దే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మ‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆర్థికంగా వెన్నుద‌న్నుగా నిలిస్తేనే, ఏదైనా చేయ‌గ‌లిగే అవ‌కాశం వుంటుంది.

కానీ కూట‌మిలో భాగ‌స్వామి పార్టీ అయిన బీజేపే బాబును న‌మ్మ‌ని ప‌రిస్థితిని రాష్ట్ర ప్ర‌జానీకం క‌ళ్లారా చూశారు. మేనిఫెస్టో ప్ర‌తిని ముట్టుకోడానికి బీజేపీ రాష్ట్ర స‌హ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ నిరాక‌రించ‌డం చూసి, ఏపీ స‌మాజం నివ్వెర‌పోయింది. ఈ మేనిఫెస్టోతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం స్ప‌ష్టంగా చెప్పింది. చంద్ర‌బాబుతో అంతిమ నిష్టూరం కంటే ఆది నిష్టూర‌మే మేల‌నే అభిప్రాయంతోనే అలా వ్య‌వ‌హ‌రించింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

మేనిఫెస్టో నెర‌వేర్చే బాధ్య‌త టీడీపీ, జ‌న‌సేన తీసుకుంటాయ‌ని ఇరు పార్టీల అధినేత‌లు వెల్ల‌డించారు. స‌న్యాసి, స‌న్యాని రాసుకుంటే బూడిదే త‌ప్ప‌, సంక్షేమం రాల‌ద‌నే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇంత కాలం చంద్ర‌బాబునాయుడి విశ్వ‌స‌నీయ‌త‌పై జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు బీజేపీ తీరు బ‌లం క‌లిగిస్తోంది. ఔను, జ‌గ‌న్ చెప్పిందే నిజం... కేవ‌లం అధికారం కోస‌మే చంద్ర‌బాబు అలివికాని హామీలు ఇచ్చార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది.