చంద్ర‌బాబును న‌మ్ముతున్నది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌డే!

ఏ మాత్రం క్రెడిట్ వ‌స్తుంద‌న్నా దాన్ని వ‌దులుకోదు క‌మ‌లం పార్టీ! అదే ఆ పార్టీ న‌యా సిద్ధాంతం. ఒక‌టీ ఆర సీట్లు క‌లిసి రాక‌పోవా.. అనే లెక్క‌ల‌తో మొన్న‌టి వ‌ర‌కూ త‌ను అడ్డంగా విమ‌ర్శించిన జేడీఎస్, టీడీపీల‌తోనే బీజేపీ పొత్తు పెట్టుకుంది! అలాంటిది చంద్ర‌బాబు ప్ర‌క‌టించే ఉచితాల నుంచి కూడా ఏవో నాలుగు ఓట్లు వ‌స్తాయ‌న్నా బీజేపీ వాటిని దండుకోవాల‌నే చూస్తుంది!

2014లో చంద్ర‌బాబు ఇచ్చిన అడ్డ‌మైన హామీల‌కూ బీజేపీ వంత పాడింది! ఐదు కాదు, ప‌ది, ప‌ది కాదు ప‌దిహేనేళ్ల ప్ర‌త్యేక హోదా అంటూ బీజేపీ వాళ్లు అప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేశారు! ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది తెలిసిన సంగ‌తే! ఆ హామీలేవీ చంద్ర‌బాబు అమ‌లు చేయ‌లేదు, బీజేపీ కూడా ఏపీకి పంగ‌నామాలు పీకింది! చంద్ర‌బాబు నాయుడు సింపుల్ గా మెనిఫెస్టోని త‌న పార్టీ వెబ్ సైట్ నుంచి డిలీట్ చేయించేశారు! 

ఈ అనుభ‌వాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇచ్చిన కొత్త చిట్టాను బీజేపీనే న‌మ్మ‌డం లేదు! ఆ మెనిఫెస్టో గోల త‌మ‌కు వ‌ద్దే వ‌ద్దు అని బీజేపీ క్లారిటీ ఇచ్చింది. అయితే బీజేపీ ఉచితాల‌కు వ్య‌తిరేకం అని, జాతీయ మెనిఫెస్టో అని.. ఏవేవో చెబుతున్నారు. అయితే అదే బీజేపీ క‌ర్ణాట‌క‌లో బోలెడ‌న్ని ఉచిత హామీల‌ను ఇచ్చింది అసెంబ్లీ ఎన్నిక‌ల‌ప్పుడు! లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌తం ఆయుధాన్నే ప్ర‌ధానంగా వాడుతోంది కాబ‌ట్టి.. ఇక వేరే అవ‌స‌రం లేద‌నే లెక్క‌తో ఉంది! 

ఈ ర‌కంగా చూస్తే.. చంద్ర‌బాబు మెనిఫెస్టోతో ఏదైనా క‌లిసి వ‌స్తే బీజేపీ భుజం రాసుకునేదే! అయినా మూడు పార్టీలూ క‌లిసి పోటీ చేస్తున్న‌ప్పుడు.. హామీల విష‌యంలో ఇలా పూచీ తీసుకోక‌పోయినా, తీసుకున్న‌ట్టే! కానీ.. బీజేపీ చంద్ర‌బాబు అడ్డ‌దిడ్డ‌మైన హామీల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేస్తోంది! మ‌రి చంద్ర‌బాబుతో క‌లిసి పోటీ చేస్తున్న రాజ‌కీయ పార్టీనే ఆయ‌న హామీల ప‌ట్ల విశ్వాసం లేక‌, వాటిని త‌న భుజానికి ఎత్తుకోక‌పోతే.. ఇక ప్ర‌జ‌లేం న‌మ్ముతారు! ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీలు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌దులుకోవు. అలాంటిది చంద్ర‌బాబు హామీల‌ను మాత్రం బీజేపీ భుజానికి ఎత్తుకోవ‌డం లేదు!

ఇలా చంద్ర‌బాబుకు ఏ చిన్న అవ‌కాశాన్ని ఇవ్వ‌డానికి కూడా బీజేపీ ముందుకు రావ‌డం లేదు. ఇది చంద్ర‌బాబుకు శ‌రాఘాత‌మే! ఏతావాతా చంద్ర‌బాబును న‌మ్ముతున్న‌ది ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ప్ప మ‌రోక‌రు ఎవ్వ‌రూ న‌మ్మ‌డం లేదు!